iDreamPost

స్లో ఉంటే నో అంటున్నారు

స్లో ఉంటే నో అంటున్నారు

సంక్రాంతి పండగ తర్వాత బాక్సాఫీస్ కు ఆశించిన ఉత్సాహం దొరకడం లేదు. వారానికో సినిమా నీటి బుడగలా పేలిపోవడంతో ట్రేడ్ కూడా ఒకరకమైన నిరాశలో ఉంది. ఒకరకంగా ఇలా పరాజయం పాలైన సినిమాల వెనుక కారణాలు విశ్లేషిస్తే అందులో ప్రధానంగా కనిపించేది స్లో నెరేషన్. మొన్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లో మూడు ప్రేమకథలు నలుగురు హీరొయిన్లు ఉన్నా బోర్ కొట్టడానికి రీజన్ ఇదే. నత్తనడకన సాగే కథనాన్ని ప్రేక్షకులు భరించలేకపోయారు.

దాని కన్నా సరిగ్గా వారం ముందు వచ్చిన జానుదీ ఇదే పరిస్థితి. కేవలం రెండే పాత్రలతో గంటకు పైగా సినిమాను ఎమోషన్ పేరుతో తెగ సాగదీయడంతో టార్గెట్ చేసిన యూత్ ని మెప్పించడంలోనూ జాను ఫెయిల్ అయ్యింది. ఇక నాగ శౌర్య అశ్వద్ధామలోనూ ఇదే సమస్య. అనవసరమైన ప్రేమ కథ, ఫ్యామిలీ డ్రామా గ్రిప్పింగ్ గా నడవాల్సిన సైకో స్టొరీని చప్పగా మార్చేసాయి. దీనికి రవితేజ డిస్కోరాజా మినహాయింపుగా నిలవలేదు

హీరో ఎవరైనా దర్శకుడికి ఎంత టాలెంట్ ఉన్నా ఇప్పటి తరం ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు ఎంగేజింగ్ గా ఎంటర్ టైనింగ్ గా చెప్పకపోతే నిర్మాతకు షాక్ తప్పని రోజులు ఇవి. అది రీమేకా స్ట్రెయిట్ మూవీనా అనే లెక్కలు చూసేవాళ్ళకు అనవసరం. నచ్చితే చాలు కోట్లు గుమ్మరిస్తారు. ఈపాటికే ఫైనల్ రన్ పూర్తి చేసుకోవాల్సిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు వీకెండ్స్ లో ఇంకా హౌస్ ఫుల్స్ నమోదు చేస్తున్నయంటే పైన చెప్పిన సినిమాలు కనీస స్థాయిలో అంచనాలు అందుకోలేకపోవడమే. గీతాంజలి, ఏ మాయ చేసావే లాంటివి హిట్ అవ్వడంలో సంగీతం పాత్ర చాలా ఉంది. కాని దాని మీదా మన దర్శకులు శ్రద్ధ వహించడం లేదు.ఎంత స్లోగా అంత గొప్ప సినిమా తీస్తున్నామనే భ్రమలో నుంచి త్వరగా బయటికి వస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు వస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి