iDreamPost

పరారీలో ఉన్న సినీ నటి జయప్రద అరెస్టుకు కోర్టు ఆదేశాలు

సినీ నటి, బీజేపీ నేత జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్ర నటి. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు.

సినీ నటి, బీజేపీ నేత జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్ర నటి. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు.

పరారీలో ఉన్న సినీ నటి జయప్రద అరెస్టుకు కోర్టు ఆదేశాలు

సీనియర్ సినీ నటి, బీజెపీ నేత, మాజీ ఎంపీ జయప్రదను వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. గతంలో కార్మికుల ఈఎస్ఐ సొమ్ము కాజేసిన కేసులో 6 నెలల జైలు శిక్షతో పాటు, 5 వేల రూపాయల జరిమానా కట్టాలని ఆదేశించింది తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు. తాజాగా 2019 లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు నమోదైన రెండు కేసుల్లో మెడకు ఉచ్చు బిగుసుకుంది. ప్రస్తుతం ఈ కేసులను విచారిస్తోంది ఉత్తరప్రదేశ్ లోని ప్రత్యేక కోర్టు. ఈ రెండు కేసుల విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కోర్టు ఏడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసింది. అయినప్పటికీ ఆమె బేఖాతరు చేసింది. దీంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమె పరారీలో ఉన్న నిందితురాలిగా పేర్కొంటూ.. ఆమె అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది.

2019 లోక్ సభ ఎన్నికల సమయంలో జయప్రద యుపిలోని రాంపూర్ నియోజకవర్గం నుండి బీజెపీ అభ్యర్థిగా పోటీ చేసింది. కాగా, ఆ ఎన్నికల్లో ఆమె సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ చేతిలో ఓడిపోయింది. అయితే స్వార్ కొత్వాలిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణల కింద కేసు నమోదైంది. అదేవిధంగా కౌమరి పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు ఫైల్ అయ్యింది. పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. యుపీలోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఈ కేసుల్లో ఆమె కోర్టుకు హాజరు కావాలంటూ న్యాయ స్థానం పలుమార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. ఇప్పటికే 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయగా.. ఆమె విచారణకు హాజరు కాలేదు.

అలాగే వివరణ కూడా ఇవ్వలేదు. అయితే అప్పటి నుండే ఆమె ఆచూకీ కూడా కానరావడం లేదు. పరారీలో ఉందంటూ వార్తలు వచ్చాయి. తాజా విచారణలో ఆమె కోర్టుకు హాజరుకాకపోవడంతో పరారీలో ఉన్న నిందితురాలిగా పేర్కొంటూ.. ఆమె అరెస్టుకు రంగం సిద్ధం చేయాలని స్పెషల్ కోర్టు జడ్జ్ శోభిత్ బన్సల్ ఆదేశాలు ఇచ్చారు. జయప్రదను పట్టుకునేందుకు డీఎస్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రాంపూర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. తదుపరి విచారణ అనగా.. వచ్చే నెల 6వ తేదీన కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు జడ్జి. ఇక జయప్రద విషయానికి వస్తే.. తెలుగులో 1980-90 దశకంలో తన సినిమాలతో ఊర్రూతలూగించారు. బాలీవుడ్ లో కూడా ఓ వెలుగు వెలిగింది ఈ అచ్చ తెలుగు వనిత.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి