iDreamPost

ఉప ఎన్నికలో పోలింగ్ వద్దంటున్న బీజేపీ

ఉప ఎన్నికలో పోలింగ్ వద్దంటున్న బీజేపీ

బీజేపీ.. జాతీయ పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కానీ విధానాలు మాత్రం దేశమంతటా ఒకేలా ఉండవు. ఒక్కోచోట ఒక్కోలా పార్టీ తీరు ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అంటారు.. కానీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇస్తారు. రోహింగ్యాలను తరిమికొడతామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అంటారు.. వలస వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటామని బెంగాల్ ప్రచారంలో అమిత్ షా అంటారు. తిరుపతిలో వైసీపీ ఎంపీ, నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోతే తమ అభ్యర్థులను బరిలో నిలిపిన బీజేపీ.. జీహెచ్ఎంసీలోని లింగోజిగూడలో మాత్రం ఏకగ్రీవం చేయాలంటూ అభ్యర్థిస్తోంది.

ఉప ఎన్నిక వద్దని..

మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి ఆకుల రమేశ్‌ గౌడ్ గెలిచారు. కానీ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆయన చనిపోయారు. తాజాగా 2 కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతోపాటు ఖాళీగా ఉన్న పలు వార్డుల్లో ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. లింగోజిగూడ డివిజన్ లో కూడా ఈనెల 30న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. పోటీలో ఉన్న రమేశ్‌ గౌడ్ కొడుకును ఏకగ్రీవం చేయాలని బీజేపీ భావించింది. దీంతో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కూడిన టీం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. లింగోజిగూడలో ఏకగ్రీవానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

చొరవ తీసుకున్న కేటీఆర్

బీజేపీ మాట్లాడిన తర్వాత కేటీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. లింగోజిగూడ డివిజన్ ను ఏకగ్రీవం చేసేందుకు తాము పోటీ చేయబోమని చెప్పారు. పోటీ చేయొద్దని తమకు బీజేపీ చేసిన విజ్ఞప్తిని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కేటీఆర్ అక్కడితో ఆగలేదు. ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాంగ్రెస్ ను ఒప్పించేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. లింగోజిగూడ డివిజన్ ను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని కోరారు. సహృదయంతో కేటీఆర్ చూపిన చొరవ.. పాత సంప్రదాయానికి మళ్లీ దారి చూపింది. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ లేదా ఇంకెవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే, చనిపోయిన లీడర్ కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీలో ఉంటే.. మిగతా పార్టీలు తమ అభ్యర్థిని బరిలో నిలపకుండా ఏకగ్రీవం చేసేవి. కానీ కొన్నేళ్లుగా ఆ సంప్రదాయం కొనసాగడం లేదు. గత ట్రెండ్ ఇప్పుడు రిపీట్ కానుంది.

అక్కడ మాత్రం పోటీ..

లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం చేయాలని కోరిన బీజేపీ..2q34 గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు చనిపోయినప్పుడు మాత్రం తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. మొన్న దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి చనిపోతే.. ఆయన భార్య పోటీ చేశారు. కానీ ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలిపాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు. ఇప్పుడు తిరుపతి, నాగార్జున సాగర్ లోనూ రెండు పార్టీలు పొటీలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నిక వద్దు.. ఏకగ్రీవం కావాలంటోది బిజెపి.

Also Read : పాయింట్ గట్టిదే కానీ లెట్ అయ్యింది రేవంత్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి