iDreamPost

బీజేపీ మేయర్‌ అభ్యర్థి ఖరారు

బీజేపీ మేయర్‌ అభ్యర్థి ఖరారు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పాలక వర్గం కొలువుతీరేందుకు సిద్ధమైంది. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ హాలులో సమావేశమయ్యారు. మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమం గంటన్నరలో ముగియనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగుతుంది.

మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించడంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ.. కొద్దిసేపటి క్రితం తమ అభ్యర్థులను ప్రకటించింది. మేయర్‌ అభ్యర్థిగా ఆర్కేపురం డివిజన్‌ నుంచి గెలిచిన రాధ ధీరజ్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌గా రాంనగర్‌ కార్పొరేటర్‌ రవిచారిలను బీజేపీ నేత రాంచందర్‌ రావు ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ నుంచి మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవి కోసం పలువురు మధ్య పోటీ ఉండగా.. సీఎం కేసీఆర్‌ ఎవరిని ప్రకటిస్తారన్నది మరికొద్ది సమయంలో తేలిపోతుంది. అయితే మేయర్‌ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరును దాదాపు ఖారారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విజయలక్ష్మి బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి గెలుపొందారు. డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ పేర్లను సీల్ట్‌ కవర్‌లో ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్‌ పంపనున్నారు.

150 డివిజన్లు గల జీహెచ్‌ఎంసీకి గత డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. టీఆర్‌ఎస్‌ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్‌ 2 సీట్లు చొప్పున గెలిచాయి. బీజేపీకి చెందిన లింగోజి గూడా కార్పొరేటర్‌ కరోనాతో మరణించడంతో ఆ పార్టీ బలం 47కు తగ్గింది. 149 మంది కార్పొరేటర్లు, 44 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 193 మంది సభ్యులు జీహెచ్‌ఎంసీలో ఉన్నారు. 97 మంది సభ్యులు ఉంటే కోరం ఉన్నట్లుగా భావించి.. ఎన్నిక నిర్వహిస్తారు.

44 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వారు 32 మంది, ఎంఐఎం 10, బీజేపీకి చెందిన వారు ఇద్దరు ఉన్నారు. కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులందరూ ఓటింగ్‌లో పాల్గొంటే.. ఏ పార్టీ కూడా సొంతంగా మేయర్, డిప్యూటీ మేయర్‌ పీఠాలు గెలుచుకోలేదు. 56 మంది కార్పొరేటర్లు, 32 మంది ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలిపి టీఆర్‌ఎస్‌ బలం 88 వద్ద ఆగిపోతుంది. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్ధతు ఇవ్వడం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరైతే మేయర్, డిప్యూటీ మేయర్‌ పీఠాలను కారు పార్టీ గెలుచుకుంటుంది. మరో గంటన్నరలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠం పై ఎవరు కూర్చునేది తేలిపోనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి