iDreamPost
android-app
ios-app

బుసలు కొడుతూ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన పాము! నిలిచిన మ్యాచ్‌

  • Published Aug 01, 2023 | 8:57 AM Updated Updated Aug 01, 2023 | 8:57 AM
  • Published Aug 01, 2023 | 8:57 AMUpdated Aug 01, 2023 | 8:57 AM
బుసలు కొడుతూ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన పాము! నిలిచిన మ్యాచ్‌

క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు తమ అభిమాన క్రికెటర్‌ను కలిసేందుకు ఫ్యాన్స్‌ గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చి మ్యాచ్‌కు అంతరాయం కలిగించడం చూశాం. అలాగే మరికొన్ని సార్లు కుక్కలు కూడా మ్యాచ్‌ మధ్యలో గ్రౌండ్‌లోకి పరిగెత్తుకు వస్తుంటాయి. సెక్యూరిటీ సిబ్బందికి చిక్కకుండా గ్రౌండ్‌లో అటూ ఇటూ పరిగెత్తుతూ మ్యాచ్‌ను ఆపేస్తాయి. ఇలాంటి ఘటనలు తరచు జరుగుతుంటాయి. కానీ, తాజాగా ఓ పెద్ద పాము గ్రౌండ్‌లోకి బుసలు కొడుతూ దూసుకొచ్చింది. ప్రేక్షకులతో నిండిన స్టేడియంలోకి అసలు ఆ పాటు ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఏకంగా గ్రౌండ్‌లోకి వచ్చేసింది. దీంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.

ఈ ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. ఆదివారం ప్రారంభమైన లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023లో భాగంగా సోమవారం గాలె టైటాన్స్‌, దంబుల్ల ఆరా టీమ్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఓ నాగిని ఇలా పిలవని అతిథిలా వచ్చేసింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో గాలె టైటాన్స్ బౌలింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ టీం స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు. సరిగ్గా అప్పుడే మైదానంలోకి పాము వచ్చినట్లు స్క్రీన్‌పై చూపించారు.

దీంతో కాసేపు మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్‌ ఆందోళనలో మొదలైంది. ఆటగాళ్లు దాన్ని చూసి.. పెద్దగా భయపడకపోయినా.. కాస్త కంగారు పడ్డారు. అయితే.. ఫీల్డ్‌ అంపైర్‌ కాస్త ధైర్యం చేసి ఆ పామును బయటికి పంపించారు. ఆ తర్వాత గ్రౌండ్‌ స్టాఫ్‌ ఆ పామును పట్టుకుని స్టేడియం బయటికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ ‘ది నాగిన్‌ ఈజ్‌ బ్యాక్‌.. నేను బంగ్లాదేశ్‌ అనుకున్నా’ అంటూ ట్వీట్‌ చేశాడు. బంగ్లా ఆటగాళ్లు నాగిన్‌ డ్యాన్స్‌తో మ్యాచ్‌లో సంబురాలు చేసుకుంటారనే విషయం తెలిసిందే. వారిని ఉద్దేశిస్తూ డీకే ఈ ట్వీట్‌ చేశాడు.

ఇదీ చదవండి: యువీ 6 సిక్సుల తర్వాత.. బ్రాడ్‌ భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడని తెలుసా?