iDreamPost

అన్నదాతకు అండగా.. బంద్‌లో ఏపీ ప్రభుత్వం, ప్రజలు..

అన్నదాతకు అండగా.. బంద్‌లో ఏపీ ప్రభుత్వం, ప్రజలు..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేస్తున్న భారీ నిరసనకు మద్ధతుగా నేడు జరుగుతోన్న భారత్‌ బంద్‌ ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. భారత్‌ బంద్‌కు రైతులు ఇచ్చిన పిలుపునకు స్పందించిన అన్ని పక్షాలు మద్ధతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా రైతులకు మద్ధతుగా నిలిచింది. బంద్‌కు సంపూర్ణంగా సహకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు అన్ని బోసిపోయాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అధికారులు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. వెలగపూడిలోని సచివాలయం బోసిపోయింది. అటు అధికారులు, ఇటు సందర్శకులు రాక సచివాలయ ప్రాంగంణం వెలవెలబోతోంది. అత్యవసర విభాగాలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నాయి. బస్సులు లేకపోవడంతో ఉద్యోగులు తమ సొంత వాహనాలపై కార్యాలయాలకు వస్తున్నారు. బంద్‌ దృష్ట్యా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. బస్సులు రోడ్డెక్కనున్నాయి. బంద్‌ నుంచి తిరుమలకు వెళ్లే బస్సులకు మినహాయింపు ఇచ్చారు.

ఏపీని వివిధ రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్ధతుగా బంద్‌లో పాల్గొంటున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. 13 జిల్లాలలో ఆయా పార్టీల నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పట్టణాలలో దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు విద్యా సంస్థలు బంద్‌ పాటిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి