iDreamPost

దీదీ లేఖాస్త్రం – విపక్షాల ఐక్యత ఈ సారైనా సాధ్యమవుతుందా..?

దీదీ లేఖాస్త్రం – విపక్షాల ఐక్యత ఈ సారైనా సాధ్యమవుతుందా..?

పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత దేశవ్యాప్త జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు ప్రారంభించారు. దేశాన్ని రక్షించేందుకు ఏకతాటిపైకి రావాలని కోరుతూ దేశంలోని పలు విపక్ష పార్టీల నేతలు, భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దీదీ లేఖ రాశారు. భాజపాయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలోని అమానుష పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అధికార భాజపా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు.

‘‘నాలో నెలకొన్న తీవ్రమైన ఆవేదనతో ఈ రోజు మీకు లేఖ రాస్తున్నా. పౌరసత్వ చట్టం, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్​ఆర్​సీపై కులంతో సంబంధం లేకుండా ఈ దేశ పౌరులు, మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, ముఖ్యంగా పిల్లలు, మహిళలు భయాందోళనల్లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనగా ఉన్నాయి. దేశంలో ఉన్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సీనియర్ ​నాయకులు, రాజకీయ నేతలు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని కోరుతున్నా. కేంద్రం చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుదాం. భారతదేశ ప్రజాస్వామ్య ఆత్మను కాపాడుదాం’’ అని దీదీ తన లేఖలో పేర్కొన్నారు.

అది సాధ్యం కాదు: బిజెపి

మమత లేఖపై బెంగాల్‌ భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ స్పందించారు. సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయాలకుంటున్న మమత లక్ష్యం నెరవేరదని పేర్కొన్నారు. భాజపాకు వ్యతిరేకంగా గతంలో విపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నం విఫలమైందని గుర్తు చేశారు. ఇప్పుడూ అదే జరుగుతుందని జోస్యం చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి