iDreamPost

ఢిల్లీ ఫలితాలు – నరేంద్ర మోడీకి స్పీడ్ బ్రేకర్..

ఢిల్లీ ఫలితాలు – నరేంద్ర మోడీకి స్పీడ్ బ్రేకర్..

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి ఎలాగైనా అధికారంలోకి కైవసం చేసుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ ఈరోజు విడుదలౌతున్న ఫలితాలలో AAP భారీ మెజారిటీతో విజయం సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా ఒక్కసారిగా తమ స్వరాన్నిపెంచాయి. తాజాగా బిజెపి ఓటమి రూపంలో మోడీపైనా పోరాడడానికి కాంగ్రెసేతర విపక్షాల చేతికి ఆయుధం దొరికినట్టయింది. ఈనేపథ్యంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఉదయం నుండి కొందరు విపక్ష నేతలు మీడియా ముందుకు వచ్చి మోడీ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

దేశవ్యాప్తంగా విపక్షాలు ఎంత వ్యతిరేకిస్తున్నా లెక్కచేయకుండా బిజెపి ప్రభుత్వం వివాదాస్పద CAA, NRC, NPR వంటి అంశాలమీద వెనక్కి తగ్గకపోవడంతో ఈ వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్నివారాలుగా విపక్షాలు, యూనివర్సిటీ విద్యార్థులు నిత్యం ఢిల్లీ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క ఢిల్లీలోని షాహిన్ భాగ్, జామియా యూనివర్సిటీ ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం, బయటనుంచి జేఎన్.యూ లోకి చొరబడిన అసాంఘిక శక్తులు విద్యార్థిని, విద్యార్ధులపై దాడులు చెయ్యడం, విద్యార్థుల ఆందోళనల్లో కొందరు వ్యక్తులు కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

ఈనేపధ్యంలో వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా విజయం సాధించడం ద్వారా CAA, NRC, NPR వంటి అంశాలమీద తమకు ప్రజల మద్దతు లభించిందని చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించిన బిజెపి అమిత్ షా ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ అధినాయకత్వాన్ని మొత్తాన్ని రంగంలోకి దించింది. ప్రధాని మోడీ, అమిత్ షా లతో పాటు కొత్తగా ఎన్నికైన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఢిల్లీలో విస్తృతంగా పర్యటించి అనేక ర్యాలీలు నిర్వహించడం, ఢిల్లీలో అత్యధికంగా నివసిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల వారి ఓటు బ్యాంక్ ని కైవసం చేసుకోవడానికి ప్రధాన ఎన్నికల ప్రచారకర్తగా మనోజ్ తివారిని తెరపైకి తీసుకొచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు హిందూ ఓటు బ్యాంక్ ని ఆకట్టుకోవడానికి అయోధ్య లో రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేసి 67 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది.

బిజెపి పెద్దల అభీష్టానికి భిన్నంగా ఈరోజు విడుదలైన ఫలితాలలో మాత్రం కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పార్లమెంట్, సెక్రటేరియట్ ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా నివసించే న్యూఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో AAP దాటికి బిజెపి, కాంగ్రెస్ లు తుడిచిపెట్టుకుపోయాయి. ఇటీవలే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థ LIC లో పెట్టుబడుల ఉపసంహరణ, రైల్వే LIC ల ప్రయివేటీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ బిజెపి పై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది.

ఏదిఏమైనా సర్వశక్తులు ఒడ్డినప్పటికీ ఈరోజు విడుదలైన ఢిల్లీ ఫలితాలలో బిజెపి ఓటమి మూట కట్టుకోవడంతో మొదటినుండి CAA, NRC, NPR వంటి అంశాలమీద బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్న మమతాబెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వంటివారు మీడియా ముందుకు వచ్చి అరవింద్ కేజ్రీవాల్ ని అభినందిస్తూ అదే సమయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మీద, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆఖరికి బీజేపీ స్వపక్షం లో కూడా లుకలుకలు మొదలయ్యాయి. త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి స్వపక్షమైన జెడియు కూడా ఈ తాజా పరిణామాలతో బిజెపికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తుంది. ఇటీవలే జెడియు నుంచి బహిష్కరణకు గురైన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఢిల్లీ ఓటర్లను అభినందిస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.

దేశవ్యాప్తంగా మరి కొన్ని రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక పక్క దేశంలో ఆర్ధిక మాంద్యంతో పాటు ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా వృద్ధి రేటు పడిపోయింది. దింతో పాటు అంతర్జాతీయ సమాజం నుండి, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుండి వివాదాస్పద CAA, NRC, NPR కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడులు వస్తున్న నేపథ్యంలో, మరోపక్క ఢిల్లీ ఫలితాలతో కాంగ్రెస్, కాంగ్రెసేతర విపక్షాలు తమ స్వరాన్ని పెంచడంతో రాబోయే రోజులలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వివాదాస్పద అంశాల విషయంలో ఏవిధంగా వ్యవహరిస్తుందో చూడాలి. ఏదేమైనా ఢిల్లీ ఎన్నికలు నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు ఒక స్పీడ్ బ్రేకర్ పడినట్టుగా చెప్పవచ్చు!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి