iDreamPost

ముసలి బావకు పడుచు గుణపాఠం – Nostalgia

ముసలి బావకు పడుచు గుణపాఠం – Nostalgia

హాస్యబ్రహ్మ జంధ్యాల గారికి ఆ బిరుదు ఊరికే రాలేదు. చక్కని హాస్యంతో ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈవివి సత్యనారాయణ లాంటి శిష్యులు వారి బాటలోనే నడిచి ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నారు. 1989 సమయంలో జంధ్యాల గారు మంచి ఊపుమీదున్నారు. చూపులు కలిసిన శుభవేళ, హైహై నాయక, జయమ్ము నిశ్చయమ్మురా హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సమయంలో కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామని తీసిన లేడీస్ స్పెషల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక నిరాశ పరిచింది. అందుకే మళ్ళీ తన బాణీలోకే వచ్చారు.

Also Read: ప్రిన్స్ కు నచ్చినది కొందరే మెచ్చారు – Nostalgia

సుప్రసిద్ధ రచయిత భమిడిపాటి కామేశ్వరరావు గారు రాసిన పెళ్లి ట్రైనింగ్ అనే నాటికను ఆధారంగాగా చేసుకుని వారి అబ్బాయి భమిడిపాటి రాధాకృష్ణ బావాబావా పన్నీరుకి కథను అందించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనదే. చక్రవర్తి సంగీతం అందించగా బాబ్జీ ఛాయాగ్రహణం సమకూర్చారు. మొత్తం నాలుగు పాటలు కంపోజ్ చేయించారు. నరేష్ రూపకళ జంటగా కోట, ధర్మవరపు, రాళ్లపల్లి, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, గౌతమ్ రాజు, సుబ్బరాయశర్మ, శిల్ప, సుత్తివేలు, జెన్నీ ఇంకా భారీ కామెడీ క్యాస్టింగ్ నే సెట్ చేసుకున్నారు. ఆహ నా పెళ్ళంట తర్వాత కోట శ్రీనివాసరావుకి అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇందులో దక్కింది.

పిసినారి శానయ్య(కోట) భార్యను హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా నమ్మించి రెండో పెళ్లి కోసం ఓ పదేళ్ల పిల్లను తీసుకొచ్చి పెంచుకుంటాడు. తీరా ఆమె యుక్తవయసుకు వచ్చాక రమేష్(నరేష్)ని ప్రేమిస్తుంది. తండ్రి లాంటి శానయ్య మనసులో ఇంత కుట్ర ఉందని తెలుసుకోలేక పోతుంది. ఆ తర్వాత జరిగే డ్రామానే అసలు కథ. పైకి సీరియస్ గా అనిపించే ఈ పాయింట్ ని జంధ్యాల గారు పొట్టచెక్కలయ్యేలా డీల్ చేసిన తీరు ఆబాలగోపాలాన్ని అలరించింది. 1991 ఆగస్ట్ 9న సుమన్ భార్గవ్, జగపతిబాబు జగన్నాటకంతో పాటు విడుదలైన బావాబావా పన్నీరు క్లాసు మాస్ తేడా లేకుండా అందరినీ అలరించి ఆ వారానికి విజేతగా నిలిచింది.

Also Read: వినోదం విస్మయం కలగలసిన సినిమా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి