iDreamPost

విడుదలకి సిద్ధమైన వీరసింహారెడ్డి – అఫీషియల్

విడుదలకి సిద్ధమైన వీరసింహారెడ్డి – అఫీషియల్

భారీ అంచనాల మధ్య సంక్రాంతికి ఢీ కొట్టబోతున్న ఇద్దరు అగ్ర హీరోల్లో బాలకృష్ణ అడ్వాన్స్ అయ్యారు. వీరసింహారెడ్డి విడుదలని జనవరి 12కి ఫిక్స్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. డేట్ విషయంలో సందిగ్దతకు చెక్ పెట్టేశారు. అదే రోజు విజయ్ వారసుడు వస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లను నెల రోజుల నుంచే ముందస్తుగా లాక్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు వీరసింహారెడ్డి ఎంట్రీ వల్ల బిసి సెంటర్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. వాల్తేర్ వీరయ్య ఒక రోజు ఆలస్యంగా జనవరి 13న ఉండొచ్చనే టాక్ డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉంది కానీ మైత్రి నుంచి అనౌన్స్ మెంట్ వస్తే తప్ప ఖరారుగా చెప్పలేం. చివరిగా రావడం గురించి చిరు మనసులో ఏముందో!

నాలుగేళ్ల క్రితం గౌతమీపుత్ర శాతకర్ణి ఇదే డేట్ కి వచ్చింది. అప్పుడూ పోటీలో ఉన్న మెగాస్టార్ తన ఖైదీ నెంబర్ 150ని ఒక రోజు ముందు తీసుకొచ్చారు. రెండూ విజయం సాధించాయి కానీ కలెక్షన్ల లెక్కలో మిత్రుడి కంటే చిరంజీవిదే బాగా పైచేయి అయ్యిందన్న మాట వాస్తవం. కంబ్యాక్ తర్వాత ఏకంగా వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించడం గురించి పెద్ద చర్చే జరిగింది. అప్పుడు జరిగిన క్లాష్ కమర్షియల్ మూవీకి పీరియాడిక్ డ్రామాకు. ఇప్పుడు వీరయ్య వీరసింహాలు రెండూ మాస్ బొమ్మలే. బిసి సెంటర్లలో ఒకే రకమైన డిమాండ్ ని ఏర్పరుచుకున్నాయి. మరి ముందే వస్తున్న అడ్వాంటేజ్ ని వీరసింహారెడ్డి ఏ మేరకు వాడుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం చివరిగా మిగిలిన కొంత భాగాన్ని పూర్తి చేసుకునే పనిలో పరుగులు పెడుతున్న వీరసింహారెడ్డి టీమ్ ఈ నెలాఖరులోగా ఫస్ట్ కాపీని సిద్ధం చేసి వెంటనే సెన్సార్ కు వెళ్ళిపోతుంది. అంతకు వారం ముందే కంప్లీట్ చేసేలా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నాడు కానీ ఇంకో డ్యూయెట్ లో పాల్గొనాల్సి ఉన్న శృతి హాసన్ డేట్ల మీద ఇది ఆధారపడి ఉంటుంది. దునియా విజయ్ మెయిన్ విలన్ గా నటించిన ఈ ఫ్యాక్షన్ డ్రామాలో వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి నెగటివ్ షేడ్స్ ఉన్న వేషం వేయడం విశేషం. జై బాలయ్య పాట విషయంలో విమర్శలు అందుకున్న తమన్ రాబోయే పాటలతో బెస్ట్ ఆల్బమ్ ఇచ్చి అదరగొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి