iDreamPost

నోరు జారిన బాలయ్యకు చైతు అఖిల్ కౌంటర్

నోరు జారిన బాలయ్యకు చైతు అఖిల్ కౌంటర్

తన వయసు హోదా మర్చిపోయి వీరసింహారెడ్డి వేడుకలో అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్లు మాములు రచ్చ చేయలేదు. ఏఎన్ఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు వీడియోలు చాలానే పెట్టారు. ఒక ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన బాలయ్య అనాల్సిన మాటలు కాదంటూ, తక్షణమే క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు మరోలా ఉంటాయంటూ చేసిన హెచ్చరికలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటిదాకా వీటికి నందమూరి హీరో స్పందించలేదు కానీ నాగచైతన్య అఖిల్ లు ట్విట్టర్ వేదికగా తమ ఆవేదనను చాలా హుందాగా వ్యక్తం చేసి చిన్న వయసే అయినా పెద్ద పరిణితి చూపించారు.

నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు ముగ్గురు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని వీళ్ళలో ఎవరిని అవమానించినా మనల్ని మనమే కించపరుచుకోవడం అవుతుందని మెత్తని చురక వేశారు. ఇక్కడ ఎన్టీఆర్ కు పెద్ద పీఠ వేసి వరసలో ముందుగా ప్రస్తావించడం ఆ సంస్కారాన్ని సూచిస్తోంది. నాగార్జున వైపు నుంచి ఎలాంటి స్పందన ఇంకా రాలేదు కానీ ఆయన అనుమతితోనే ఇద్దరు పిల్లలు తమ ఉద్దేశాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారని అర్థమవుతోంది. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారిపోయింది. చిన్నపిల్లాడి మనస్తత్వం అంటూ వెనకేసుకొచ్చే బాలయ్య అభిమానుల దగ్గర సైతం ప్రస్తుతం మాటలు లేవు.

వీలైనంత త్వరగా బాలకృష్ణ సారీ చెప్పేస్తే మంచిది. లేదూ నేనేమి అనలేదు ఏదో పొరపాటుగా అయ్యింది ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మొండిపట్టు చూపిస్తే ఈ వివాదం ఇంకా ముదరడం తప్ప ఇంకేమి జరగదు. గతంలో అమ్మాయిలకు ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అంటూ అర్థం లేని కామెంట్లు చేసిన బాలయ్య ఇప్పుడు ఏకంగా తండ్రితో సమానంగా భావించాల్సిన అక్కినేని లెగసిని అవమానపరచడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి పద్నాలుగు సినిమాలు చేయడం బహుశా మర్చిపోయారేమో. అయినా ముప్పై వయసు పిల్లలతో చెప్పించుకునే దాకా తేకపోయి ఉంటే ఇంకా గౌరవంగా ఉండేది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి