iDreamPost

విశాఖ దాకా ఎందుకు బాబు గారు..!

విశాఖ దాకా ఎందుకు బాబు గారు..!

అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు, ఇతర వ్యవహారాలు ప్రతిపక్షంలో కూర్చోవడంతో మరచిపోతారేమో రాజకీయ నాయకులు. అవన్నీ మరిచి స్పీచ్‌లు దంచుతుంటారు. అయితే ప్రజలు వాటిని మరచిపోరన్న సంగతి వారికి తెలియంది కాదు. అయినా సరే తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తుంటారు. అధికార పార్టీపైన విరుచుకుపడుతుంటారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కూడా గతాన్ని మరిచిపోయిన మాట్లాడుతున్నట్లుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రజాచైతన్య యాత్రలో భాగంగా నిన్న సోమవారం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ నేతల విశాఖ భూ భాగోతాన్ని బయటపెడతానన్నారు. అందు కోసం త్వరలో విశాఖపట్నం వెళతారట. అంతేకాదు విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమైన నగరం అని కూడా బాబు సెలవిచ్చారు. ఇంత వరకు భాగానే ఉంది. ఒక ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై, ఆ పార్టీ నేతల అక్రమ దందాలపై పోరాడడం ప్రతిపక్ష నేత కర్తవ్యం. ప్రజలు కూడా హర్షిస్తారు.

అయితే విశాఖలో భూ భాగోతం బయటపెట్టేందుకు చంద్రబాబు విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేదని విశ్లేషకలు చెబుతున్నారు. తన ప్రభుత్వ హయాంలో విశాఖలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇతర టీడీపీ నేతలు సాగించిన లక్ష ఎకరాల భూ దందాపై వేసిన సిట్‌ విచారణ నివేదికను బయటపెడితే చాలంటున్నారు. సిట్‌ నివేదిక ఇచ్చినా.. సీఎంగా ఉన్న బాబు దాన్ని బయటకు రానీయలేదు. అందుకే జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా మరో సిట్‌ను ఏర్పాటు చేశారు. అది మధ్యంతర నివేదిక కూడా ఇచ్చింది. దర్యాప్తు ముమ్మరంగా చేస్తోంది. రేపో మాపో.. భూ బండారం అంతా బయటకొస్తుంది.

ఇలా కాకపోతే.. తన పార్టీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఒక ప్రెస్‌ మీట్‌ పెట్టమన్నా.. చాలు.. అయ్యన్నే అంతా వెల్లడిస్తారు. పైగా అయన స్థానిక నేతే కావడంతో ఎలాంటి ఆలస్యమవదు. ఎందుకంటే.. అయ్యన్న చేతిలో సమస్త సమాచారం ఉంటుంది. బయట నుంచి వచ్చిన నేతలు విశాఖలో భూములు కొల్లగొడుతున్నారంటూ.. మంత్రి హోదాలోనే అయ్యన్న అప్పట్లో ఫైర్‌ అయిన విషయం ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఆ తర్వాత గంటా.. అయ్యన్నపై ఆరోపణలు చేయడం… తిరిగి అయ్యన్న ప్రత్యారోపణలు చేయడం.. చినబాబు ఎంటరవ్వడం, వారిద్దరి మధ్యా రాజీ కుదర్చడం ఇవన్నీ జరిగింది గత ప్రభుత్వ హయాంలోనే. కాబట్టి విశాఖలో భూ భాగోతం బయటపెట్టేందుకు కష్టపడాల్సిన అవసరం లేదని, బాబు ఈ దిశగా ఆలోచించాలని పరిశీలకులు సలహా ఇస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి