iDreamPost

మాయమైన బాపు మొగలిజడ – ఫ్లాష్ బ్యాక్ – Nostalgia

మాయమైన బాపు మొగలిజడ – ఫ్లాష్ బ్యాక్ – Nostalgia

సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన విలువ గౌరవం ఉంటుంది. ముఖ్యంగా హీరో దర్శకుడి విషయంలో. అందులోనూ టాలెంటెడ్ యాక్టర్ వర్సటైల్ డైరెక్టర్ అయితే ఇంక చెప్పేదేముంది. కాని కొన్నిసార్లు ప్రకటించిన సినిమాలు తెరకెక్కకుండానే ఆగిపోతే అభిమానులు పడే బాధ అంతాఇంతా కాదు. అలాంటి ఉదాహరణే ఇది. అందాల నటుడు శోభన్ బాబు దర్శకులు బాపు గారి మధ్య మొదటి నుంచి మంచి ర్యాపో ఉండేది.

1969లో బుద్దిమంతుడు ద్వారా మొదటిసారి ఈ ఇద్దరూ కలిశారు. అప్పటికి శోభన్ బాబు అప్ కమింగ్ స్టేజి లోనే ఉన్నారు. అది ఘన విజయం అందుకుంది. కొంతకాలం తర్వాత ఈ ఇద్దరు కలిసి చేసిన సంపూర్ణ రామాయణం సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ గాధను ఆధారంగా చేసుకున్న గొప్ప సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత కమర్షియల్ టచ్ తో బాపు చేసిన జాకీ పర్వాలేదు అనిపించుకోగా చివరిగా వచ్చిన కళ్యాణ తాంబూలం నిరాశ పరిచింది.

తిరిగి 1995లో బాపు గారు శోభన్ బాబుతో శ్రీకృష్ణ సంసారలీలలు అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మీడియాకు సైతం సమాచారమిచ్చారు. కాని అది కార్యరూపం దాల్చేలోపు టైటిల్ మారిపోయి అది కాస్తా మాష్టారు మొగలిజడగా పోస్టర్ కూడా వచ్చేసింది. రమ్యకృష్ణ హీరొయిన్ గా కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి పాటలకు మ్యూజిక్ సిటింగ్స్ కూడా జరిగాయి. ముళ్ళపూడి వెంకటరమణవారు సంభాషణలు సిద్ధం చేశారు. కాని ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీని తర్వాత బాపు గారు రాజేంద్రప్రసాద్ రాంబంటులో బిజీగా అయిపోగా శోభన్ బాబు దొరబాబు, అడవిదొర, హలో గురు చిత్రాలకు డేట్స్ ఇచ్చారు. ఇప్పటికీ మాష్టారు మొగలిజడ ఎందుకు ఆగిపోయిందో శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. జవాబు చెప్పేందుకు బాపు రమణలు ఇద్దరూ లేరు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి