iDreamPost

ఆసియా గేమ్స్​లో పారుల్ చౌదరి సంచలనం.. తొలి భారత మహిళగా రికార్డు!

  • Author singhj Published - 09:16 PM, Tue - 3 October 23
  • Author singhj Published - 09:16 PM, Tue - 3 October 23
ఆసియా గేమ్స్​లో పారుల్ చౌదరి సంచలనం.. తొలి భారత మహిళగా రికార్డు!

పొరుగు దేశం చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్​లో భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన రెండు ఈవెంట్లలో ఇండియాకు అమ్మాయిలు గోల్డ్ మెడల్స్ అందించారు. జావెలిన్ త్రో విభాగంలో అన్ను రాణి అత్యధిక దూరం బల్లెం విసిరి స్వర్ణం కైవసం చేసుకుంది. బల్లాన్ని 62.92 మీటర్లు దూరం విసిరి ఫస్ట్ ప్లేసులో నిలిచి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. మరో భారత అథ్లెట్ పారుల్ చౌదరి సంచలనం సృష్టించింది. ఇవాళ సాయంత్రం జరిగిన 5000 మీటర్ల రన్నింగ్ రేసు ఫైనల్​ను కేవలం 15 నిమిషాల 14.75 సెకన్లలో ఆమె కంప్లీట్ చేసింది.

5 వేల మీటర్ల పరుగు పందెంలో ఫైనల్లో తొలి స్థానంలో నిలిచిన పారుల్ చౌదరి భారత్​కు మరో గోల్డ్ మెడల్ అందించింది. ఆసియా క్రీడల్లో ఆమెకు ఇది రెండో పతకం కావడం విశేషం. అక్టోబర్ 2న జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్​లో పారుల్ చౌదరి సిల్వర్ మెడల్ నెగ్గిన విషయం తెలిసిందే. మంగళవారం మరింత ఎఫర్ట్ పెట్టి గోల్డ్ మెడల్​తో దేశం గర్వించేలా చేసిందామె. ఆసియా క్రీడల్లో 5 కిలోమీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్​గా పారుల్ చరిత్ర సృష్టించింది.

5 వేల మీటర్ల రన్నింగ్ రేసు ఫైనల్లో ఒక సమయంలో జపాన్ అథ్లెట్ హిరోనికా రిరికా గెలుస్తుందని అనిపించింది. కానీ ఆఖరి క్షణాల్లో వేగం పెంచిన పారుల్ చౌదరి.. బుల్లెట్ స్పీడుతో దూసుకెళ్లింది. ఫినిషింగ్ లైన్​కు కొంత దూరంలో హిరోనికాను దాటేసి వెళ్లిపోయింది పారుల్. దీంతో జపాన్ అథ్లెట్ హిరోనికా (15 నిమిషాల 15.34 సెకన్లు) సిల్వర్ మెడల్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీళ్లిద్దరి తర్వాత స్థానంలో కజకిస్థాన్ అథ్లెట్ కరోలిన్ చెప్​కోయిచ్ నిలిచింది. 15 నిమిషాల 23.12 సెకన్లలో రేసును ముగించి థర్డ్ ప్లేసులో నిలిచిన కరోలిన్ బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. గోల్డ్ మెడల్ సాధించిన పారుల్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. దేశం గర్వించేలా చేశావంటూ ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​కు ముందు భారత్​కు భారీ ఎదురుదెబ్బ! బీసీసీఐ ఏం చేస్తోంది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి