iDreamPost

టీడీపీని వీడిన బాబు చిరకాల మిత్రుడు..

టీడీపీని వీడిన బాబు చిరకాల మిత్రుడు..

అధికారం బీరకాయ పీచు సంబంధాలను కూడా రక్త సంబంధాలంత  దగ్గర చేస్తే ఓటమి దగ్గరి వారిని కూడా ఏమి కాని వారిగా మారుస్తుంది …గెలుపు ఓటములతో బంధాలలో మార్పు ఆది నుంచి ఉన్నదే అయిన 2014 ఎన్నికల నుంచి పరాకాష్టకు చేరింది. జగన్ సొంత మనుష్యులు అనుకున్నవారు పార్టీ ఫిరాయించారు.. 2019 టీడీపీ ఓటమి తరువాత సుజనా చౌదరి,సీఎం రమేష్ ,గరికపాటి తో సహా అనేక మంది చంద్రబాబు సొంత మనుష్యులు అనుకున్నవారు ఆయనకు దూరమయ్యారు.ఈ కోవలోనే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కాలేజీ రోజుల నుంచి మిత్రుడైన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ గురువారం టీడీపీకి రాజీనామా చేశారు.

ఏఎస్ మనోహర్ టీడీపీని వీడటం కన్నా పార్టీకి రాజీనామా చేసిన సమయం,సందర్భం ఆశ్చర్యకరం. మున్సిపల్,జడ్పీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి..మండలి రద్దు నిర్ణయంతో ఎమ్మెల్సీ ఆశలు లేవు మరి ఎందుకు ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేయటం?రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ఏమి ప్రకటించలేదు…

ఎవరు ఈ  ఏఎస్ మనోహర్?

మనోహర్ టీడీపీ తరుపున 1994లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి CK బాబు(జయ చంద్రారెడ్డి) మీద ఓడిపోయారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 26 స్థానాలే గెలిచింది, చిత్తూరు జిల్లాలోని 15 శాసనసభ స్థానాలలో 14 సీట్లు టీడీపీ గెలవగా కాంగ్రెస్ ఒక్క చిత్తూరు నియోజకవర్గం మాత్రమే గెలిచింది.ఆ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది అనటం కన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే సీకే బాబు సొంత బలంతోనే గెలిచారు అన్నది నిజం.

చిత్తూర్ జిల్లాలో 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకే ఒక సీట్ గెలవగా 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్క సీటే గెలవటం ..చంద్రబాబు జిల్లా మీద పట్టు కోల్పోయాడన్న విషయాన్ని నిరూపిస్తుంది.

Also Read:అచ్చెం నాయుడికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఎలా వొచ్చింది?

1994లో మనోహర్ ఓడిపోయిన తర్వాత సంవత్సరం జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఎన్టీఆర్ చెప్పటంతో మనోహర్ చిత్తూరు మున్సిపల్‌ చైర్మన్ గా పోటీ చేసి 26,000 మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జితేంద్రనాథ్ కు సీకే బాబు సహకరించకుండా తన శ్రీమతి లావణ్యను రెబల్ అభ్యర్థిగా పోటీకి పెట్టటంతో మనోహర్ విజయం నల్లేరు మీద నడక అయ్యింది.

చంద్రబాబుతో ప్రయాణం

ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ చదివే రోజుల్లో మనోహర్‌కు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ బ్యాచ్ మేట్స్,అక్కడే చంద్రబాబుతో పరిచయం ఏర్పడింది.

చదువుకునే రోజుల నుంచే రాజకీయ లక్ష్యాలు ఉన్న మనోహర్ సమితి ఎన్నికలలో నామినేషన్ వేసి కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వారి తండ్రి ఒత్తిడితో నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

కడపలో బోర్ వెల్ వ్యాపారం చేసి ఆర్ధికంగా స్థిరపడి,నాటి టీడీపీ నాయకుడు సి.రామచంద్రయ్య(1985 కడప ఎమ్మెల్యేగా గెలిచారు) తో సన్నిహిత్యం పెంచుకున్నారు.అప్పటి నుంచి ఎన్టీఆర్, చంద్రబాబు,గాలి ముద్దుకృష్ణమ నాయుడులను కలుస్తూ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. 1994లో టికెట్ దక్కిన గెలవలేకపోయారు.

వైశ్రాయ్ ఎపిసోడ్

ఎన్టీఆర్ దేవుడు అంటూనే చంద్రబాబు వైపు వెళ్లిన ఎమ్మెల్యేలు,ఎంపీలు,నాయకులలో మనోహర్ ఒక్కరు. మనోహర్‌కు 1999 ఎన్నికలలో మరోసారి టీడీపీ టిక్కెట్ దక్కినా ఓటమే ఎదురయ్యింది.కానీ చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో చిత్తూరు నియోజకవర్గంలో డీ ఫ్యాక్టో ఎమ్మెల్యేగా వ్యవహరించి పట్టు సాధించారు.

2004లో కలిసొచ్చిన అదృష్టం

1989,1994 మరియు 1999 ఎన్నికలలో చిత్తూరు నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించిన సీకే బాబుకు 2004లో కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఒక టీడీపీ మహిళా నాయకురాలి కొడుకు హత్య విషయంలో సీకే బాబు మీద కేసు నమోదయ్యింది. దానితో కాంగ్రెస్ సీకే బాబుకు టికెట్ నిరాకరించినప్పటికీ వైఎస్ఆర్ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన సీకే బాబు మీద మనోహర్ 3,888 ఓట్ల మెజారిటీతో గెలిచారు.. దాని గుర్తుగా మనోహర్ తన కార్ నెంబర్ 3888 పెట్టుకున్నారు.

Also Read:రాసి పెట్టుకో జగన్ అనేంత ధైర్యం,ఉమాకు ఎలా వొచ్చింది? దేవినేని సోదరుల రాజకీయ ప్రస్థానం

ఆవిధంగా మనోహర్ మూడవ ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలిచారు .. ఆ ఎన్నికల్లో టీడీపీ తరుపున చిత్తూర్ లోక్ సభ కు డీకే ఆదికేశవుల నాయుడు పోటీచేయటం కూడా మనోహర్ కు కలిసొచ్చింది.

2009లో వెక్కిరించిన కుల సమీకరణాలు

టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన తొమ్మిది ఎన్నికలలో చిత్తూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీచేసిన కమ్మ సామాజిక వర్గం చెందిన వారు ఒకే ఒక సారి గెలిచారు.1983 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేసిన NP ఝాన్సీలక్ష్మి తన మరిది (భర్త చిన్నాయన కొడుకు) మాజీ ఎమ్మెల్యే NP వెంకటేశ్వర్ చౌదరి మీద గెలిచారు.

1985లో రాజసింహులు(దొర బాబు,ప్రస్తుత ఎమ్మెల్సీ),1989లో హరిప్రసాద్ ,2009లో బాలాజీ నాయుడు … ముగ్గురు కమ్మ నాయుడులే కానీ ఎవరు గెలవలేక పోయారు.

2009లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మనోహర్‌ను కాదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన బాలాజీ నాయుడుకి టీడీపీ టికెట్ ఇచ్చారు కానీ గెలవలేకపోయారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున సీకే బాబు గెలవగా,పీఆర్పీ అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులు 1700 ఓట్ల తేడాతో ఓడిపోయారు,టీడీపీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

ఆ ఎన్నికల్లో సి.రామచంద్రయ్య ఇంటికి వెళ్లి అడిగినా మనోహర్ ప్రజారాజ్యంలో చేరకపోవడం విశేషం. డీకే ఆదికేశవుల నాయుడు కొడుకు ప్రజారాజ్యం తరుపున రాజంపేట ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. తన గురువులులాంటి రామచంద్రయ్య, ఆదికేశవులనాయుడు (ఈయన మాత్రం కాంగ్రెసులోనే ఉంటూ కొడుకు కోసం ప్రజారాజ్యానికి పనిచేశారు) మాట విని మనోహర్ పీఆర్పీ ఆవిర్భావంలోనే చేరి ఉంటే టికెట్ దక్కివుండేది,బహుశా గెలిచి ఉండేవారు కూడా.

మనోహర్ వైసీపీ ప్రయాణం

ఆ విధంగా సామాజిక వర్గం లెక్కలలో 2009 ఎన్నికలలో టిడిపి టికెట్ కోల్పోయిన మనోహర్ వైసీపీ ఆవిర్భావం తరువాత అందులో చేరారు.అప్పటికి సీకే బాబు,పెద్ది రెడ్డి కుటుంబం వైసీపీలో లేకపోవడంతో మనోహర్ బలమైన నేతగా ఎదిగారు. 2014 టికెట్ తనకే అనుకుంటున్న తరుణంలో నామినేషన్లు మొదలైన తరువాత జంగాలపల్లి శ్రీనివాసులుకు వైసీపీ టికెట్ దక్కింది.

జంగాలపల్లి శ్రీనివాసులది డబ్బు బలం..దానికి తోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మేయర్ ఎన్నికలలో ఖర్చుల కోసం వైసీపీ పార్టీని డబ్బులు అడగటం మనోహర్ అవకాశాలను దెబ్బకొట్టింది.మరో వైపు మేయర్ ఎన్నికల సందర్భంలో వైసీపీ పార్టీలో చేరిన సీకే బాబు తన శ్రీమతి లావణ్యకు మేయర్ పదవి దక్కేలా హామీ పొందారు… మేయర్ ఎన్నికల్లో లావణ్య ఓడిపోయారు.. ఎమ్మెల్యేగా జంగాలపల్లి శ్రీనివాసులు ఓడిపోయారు…

మనోహర్‌కు టికెట్ రాకపోవటానికి సీకే బాబు వ్యతిరేకించటం కూడా ఒక కారణం. 2004 హత్య కేసు విషయంలో నాడు ఎమ్మెల్యేగా ఉన్న మనోహర్ పోలీసుల మీద పెట్టిన ఒత్తిడి వలెనే కేసు బలంగా తయారైందని,దాదాపు 2 నెలలు జైల్లో ఉండవలసి వచ్చిందన్న కోపం సీకే బాబుకు ఉండి ఉండొచ్చు.

2014-2019 మధ్య కప్పదాట్లు

ఒక సమయంలో చిత్తూరు టైగర్ అనిపించుకున్న సీకే బాబు మొదట బీజేపీలోకి, 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు… చిత్తూరు మార్కెట్ తరలింపులో జరిగిన హై డ్రామాలో టీడీపీ నేత దొర బాబు “ఎవుర్రా ఇక్కడ జయ చంద్రారెడ్డి,రచ్చ చేస్తున్నాడంటా ?” అంటూ సీకే బాబు మీద దాడికి వెళ్ళటం ఉద్రికత్తలకు దారితీసింది.. తనకు బీజేపీ వలన ఉపయోగం లేదనుకొన్న సీకే బాబు ఎన్నికల నాటికి ఏకంగా టీడీపీలో చేరారు.. చిత్తూరు జిల్లాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్గానికి సేనానిగా వ్యవహరించిన సీకే బాబు టీడీపీలో చేరటాన్ని ఆయన వర్గం కూడా జీర్ణించుకోలేకపోయింది.

2019 ఎన్నికలు

చంద్రబాబు అనేక లెక్కలు వేసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే డీకే ఆదికేశవులనాయుడు శ్రీమతి సత్య ప్రభను రాజంపేట ఎంపీ బరిలోకి దించారు.. దీనితో ఖాళీ అయిన చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ కోసం అనేక మంది పోటీపడ్డారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులిపర్తి నాని మొదటి నుంచి చిత్తూరు టికెట్ కోసమే పనిచేశారు కానీ బలమైన చెవిరెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు ఆర్ధికంగా బలమైన పులిపర్తి నానిని చంద్రగిరి బరిలో దించారు.

Also Read:చంద్రబాబు టీడీపీ రంగప్రవేశం.. ఆ ఎమ్మెల్యే నిష్క్రమణ ..అంతా 100 రోజుల్లోనే !!!

చంద్రబాబు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ రాజకీయంగా స్తబ్దుగా ఉన్న ఏఎస్ మనోహర్‌కు పిలిచి ఇచ్చారు.. మొన్న ఎన్నికలలో అనేక నియోజకవర్గాలలో టీడీపీకి సరైన అభ్యర్థులు దొరకక, ఆర్ధికంగా బలమైన కొందరు ఎమ్మెల్యేలను లోక్ సభ బరిలోకి దించటం, మరోవైపు జగన్ వైసీపీ తరుపున పోటీచేసే మొత్తం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను,25 మంది ఎంపీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించటంతో చంద్రబాబు మీద ఒత్తిడి పెరగటం.. ఇలా అనేక కారణాలతో చివరి నిముషంలో చాలామందికి పిలిచి టికెట్ ఇవ్వవలసి వచ్చింది.. ఆ విధంగా మనోహర్‌కు 2004 తరువాత అంటే మూడు ఎన్నికల తరువాత 2019లో పోటీచేసే అవకాశం వచ్చింది.. కానీ ఈసారి అదృష్టం వైసీపీ తరుపున పోటీచేసిన జంగాలపల్లి శ్రీనివాసులుని వరించింది..

ఇక్కడ ఒక పాత సంగతి చెప్పాలి,1983 ఎన్నికలలో టీడీపీ తరుపున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఝాన్సీ లక్ష్మిని 1984 లోక్ సభ ఎన్నికలలో టీడీపీ తరుపున పోటీచేయించారు. ఆ ఎన్నికలలో ఆవిడ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి ,మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మీద గెలిచారు.కానీ 1989 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ ఝాన్సీ లక్ష్మిని కాదని చంద్రబాబు కోసం కుప్పం సీట్ ను త్యాగం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే రంగ స్వామి నాయుడుకి చిత్తూరు లోక్ సభ టికెట్ ఇచ్చారు..ఆయన ఓడిపోయారు.. రంగస్వామి నాయుడు, ఝాన్సీ లక్షి ఇద్దరికీ మరోసారి పోటీచేసే అవకాశం రాలేదు..

2019 ఎన్నికల తరువాత

చిత్తూరు నియోజక వర్గం టీడీపీలో మొదటి నుంచి కమ్మ నాయుడులు,బలిజ నాయుడుల మధ్య ఆధిపత్యపోరు ఉన్నది. మనోహర్ ఓడిపోవటంతో ఆయనని టీడీపీ సమావేశాలకు పిలవటం కూడా మానేశారు. ప్రస్తుతంఎమ్మెల్సీ దొరబాబు(కమ్మ నాయుడు) నాయకత్వంలో టీడీపీ పనిచేస్తుంది. స్వతహాగా నిదానస్తుడైన మనోహర్ దొరబాబుతో పోటీపడి రాజకీయాలు చేసే పరిస్థితి లేదు.

2019లో అనుకోకుండా దక్కిన టీడీపీ టికెట్ 2024లో మరోసారి దక్కుతుందన్న నమ్మకం మనోహర్‌కు లేదు. మనోహర్ వెనక ఉన్న సామాజిక వర్గం మొత్తం జంగాలపల్లి శ్రీనివాసులు వైపు వెళ్ళిపోయింది. ఏ పార్టీలో ఉన్నా తనకు అండగా ఉన్న డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం ఇప్పుడు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు.. మొత్తానికి భవిష్యత్ ఆశాజనంగా లేదు .. ఈ పరిస్థితులలో క్రియాశీలక రాజకీయాలలో కొనసాగటం ఎందుకన్న ఆలోచన మనోహర్ రాజీనామాకు ముఖ్య కారణం.

Also Read:టీడీపీ తరువున విజయనిర్మల పోటీచేశారా?కృష్ణ మద్దతు ఇచ్చారా?

1999 ఎన్నికల వరకు చిత్తూరు నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారులదే హవా..ఆ తరువాత అందరు గ్రానైట్ వ్యాపారంలో దిగారు. చిత్తూరు రూరల్, తవణంపల్లె మరియు ఐరాల మండలంలో ఉన్న గ్రానైట్ క్వారీలలో ఎక్కువ శాతం రాజకీయ నాయకులవే.. మనోహర్,జంగాల పల్లి,దొరబాబు,పులిపర్తి నాని అందరు గ్రానైట్ వ్యాపారులే.. క్వారీలు,గ్రానైట్ వ్యాపారంలో జరిగే అవకతవకలు అందరికి తెలిసిందే.. ఈ దశలో అధికారపార్టీకి టార్గెట్ అయి వ్యాపారం దెబ్బ తీసుకోవటం ఎందుకు అన్న ఆలోచన కూడా మనోహర్ రాజీనామాకు మరో కారణం కావచ్చు.

కారణాలు ఏమైనా మనోహర్ దారిలో ఇంకా చాలా మంది నాయకులు రాజకీయాలను వదిలి వేయటమో లేక రెండు మూడు సంవత్సరాలు దూరంగా ఉండటమో ఖాయం..

మనోహర్ నిష్క్రమణ టీడీపీకి చేసే నష్టం పెద్దగా ఏమి ఉండదు కానీ చంద్రబాబుకు ఒక పాత మిత్రుడు దూరం అయినట్లు…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి