iDreamPost

అమ్మఒడి, ఇళ్ల స్థలాల పంపిణీ పై నిమ్మగడ్డ పడగ ..!

అమ్మఒడి, ఇళ్ల స్థలాల పంపిణీ పై నిమ్మగడ్డ పడగ ..!

ఊహించిందే జరిగింది. ఎన్నికల కోడ్ పేరుతో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాల పై వేటు వేసే ప్రయత్నం చేస్తారని అందరూ ఊహించినదాన్ని నిజం చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్. దేశ రాజకీయ చరిత్ర చూస్తే ఎన్నికల కోడ్ అమలు సమయంలో కొత్త పథకాల ప్రకటన , వాటి నిర్వహణ జరగకుండా ఏ ఎన్నికల కమిషనర్ అయినా ఆదేశాలు ఇవ్వడం మనం చూస్తుంటాం . కానీ ప్రస్తుత ఏపీ కమిషనర్ మాత్రం ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వ వ్యతిరేక దృక్పధంతో వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఇక్కడ స్పష్టం .

అమ్మఒడి పథకం గత ఏడాది ప్రకటించి వరుసగా ఐదేళ్లు నిర్వహించటానికి తగ్గ కార్యాచరణ రూపొందించి మొదటి సంవత్సరం లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. రెండవ యాడాది కూడా విద్యా సంవత్సరం ముగింపు సమయంలో స్కూల్స్ లో ఫీజు బకాయిల చెల్లింపులు చేయాల్సిన సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటంతో పాటు కొనసాగింపులో ఉండి పంపిణీ తేదీ కూడా ఇచ్చిన పథకాన్ని ఆపమని స్టేట్ చీఫ్ సెక్రటరీకి సర్క్యులర్ జారీ చేయడం ఖచ్చితంగా కుట్ర పూరితమైన చర్యే .

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కూడా పసుపుకుంకుమ పేరిట మహిళల ఖాతాలో సొమ్ము జమచేసిన చంద్రబాబు అది ఎన్నికల కోడ్ అమలులోకి రావటానికి ముందే ప్రకటించిన పధకం అని చెప్పారు . ఎన్నికల కోడ్ అమలులోకి రావటానికి ముందు ప్రకటించిన పధకమే నోటిఫికేషన్ విడుదల తర్వాత అమలు చేయడం చట్టబద్ధమైనప్పుడు , గత యాడాది నుండి అమలవుతున్న ప్రస్తుతం నిధుల విడుదల తేదీ ముందే ప్రకటించిన అమ్మవడి , గత నెల 25 నుండి అమలు జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ పధకాలు అడ్డుకొనే ప్రయత్నంలో ఏమాత్రం ఔచిత్యం లేదని చెప్పొచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లోనే కొన్ని సార్లు సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం కొత్త పథకాలు ప్రకటించకూడదు , అమలు చేయకూడదు కానీ నోటిఫికేషన్ విడుదల చేసేనాటికి అమలవుతున్న పధకాలు అడ్డుకోరాదు అనే విషయాన్ని కూడా నిమ్మగడ్డ ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారు .

అంతే కాకుండా వైసీపీ ప్రభుత్వం ఇల్లు లేని పేదవారి కోసం ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ చేసే లక్ష్యంతో చేపట్టిన పథకాన్ని గత ఏడాది కాలంగా టీడీపీ పలు కేసులు వేసి అడ్డుకోవడం అందరికీ తెలిసిందే . అన్ని అవాంతరాలు దాటుకుని గత డిసెంబర్ 25 న ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించి కొనసాగిస్తున్న పథకాన్ని హఠాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో అడ్డుకునే ప్రయత్నం వెనక నిమ్మగడ్డకు టీడీపీతో ఉన్న రహస్య , బహిరంగ సంబంధాల ఫలితమే అని చెప్పొచ్చు .

వైసీపీ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల పై విషం చిమ్మే ప్రయత్నం చేసి విఫలమైన టీడీపీ , కోర్టు కేసుల ద్వారా వీలైనంత కాలం అడ్డుకొని ఇప్పుడు అదీ సాధ్యం కాక నిమ్మగడ్డని మరోసారి పావుగా వాడి అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు , ఇళ్ల స్థలాల , అమ్మవడి లబ్ది దారులు మండిపడుతున్నారు .

గత ఏడాది కూడా ఎన్నికల కోడ్ పెట్టి ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ , వాయిదా తర్వాత కూడా తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ కోడ్ ఉంటుందని ప్రకటించి వివాదాస్పదం అయ్యారు . పిమ్మట వైసీపీ కోర్టుద్వారా కోడ్ ఆదేశాలు కొట్టివేయించుకొని సంక్షేమ పథకాలు అమలు చేసుకోవాల్సి వచ్చింది . ఈసారి కూడా ఎన్నికలు జరిగినా ఆగినా కోడ్ పేరిట సంక్షేమ పథకాలు , కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు , అత్యవసర నిర్ణయాలు అడ్డుకొని వికృతానందం పొందటమే తప్ప మరొకటి కాదు .

ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికల నిర్వహణ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా , ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి , పంచాయితీ రాజ్ కార్యదర్శి , ఆరోగ్య శాఖ కార్యదర్శి ముగ్గురు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పినా నిన్న ఏకపక్షంగా ఎలెక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ , ఈ రోజు అమలులో ఉన్న పధకాలను కూడా ఆపివేయాలని ముఖ్య కార్యదర్శికి సర్క్యులర్ జారీ చేసి మరో వివాదానికి తెర తీశారు .

అసలు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని , కోవిడ్ నిబంధనలు అమలులో ఉండటంతో పాటు , కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ నెల వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఉండొచ్చని ప్రభుత్వం విముఖత చూపగా , ప్రస్తుతం ఎన్నికల నిర్వహణతో తమ ప్రాణాలు పణంగా పెట్టొద్దని ఏపీ ఉద్యోగ సంఘాల వినతుల్ని బుట్ట దాఖలు చేస్తూ తీసుకొన్న ఈ నిర్ణయం అమలయ్యే అవకాశాలు తక్కువే అయినా ఈ నోటిఫికేషన్ పేరిట సంక్షేమ పథకాలు ఆపి రాష్ట్రంలో మరో గందరగోళానికి తెర తీయటమే ఎస్ఈసీ , టీడీపీ ల ఉమ్మడి ఉద్దేశ్యమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి