iDreamPost

రెండు పనులూ నిమ్మగడ్డే చేశారు..!

రెండు పనులూ నిమ్మగడ్డే చేశారు..!

కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో.. ప్రజల శ్రేయస్సు, ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే తన లక్ష్యమంటూ సాగుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆయన ప్రవర్తన చిన్నపిల్లాడి మాదిరిగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్‌ కేసులు లేనప్పుడు దాన్ని సాకుగా చూపి ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ.. నేడు లక్షల సంఖ్యలో కేసులు నమోదై.. దాదాపు ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయి, ఇంకా కొత్త కేసులు నమోదువుతున్న సమయంలో.. ఎన్నికలు నిర్వహిస్తానంటూ నానా హడావుడి చేస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

నిండా మునిగాక చలే లేదన్నట్లుగా.. ఎవరేమనుకున్నా నాకేందుకు అనే రీతిలో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రవర్తిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణ ఎందుకు సాధ్యం కాదో చెబుతూ, కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌ అధికారులతో సమావేశం అవసరం లేదని ..బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాసినా కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయాలంటూ మళ్లీ లేఖ రాసిన నిమ్మగడ్డ అందరి నోళ్లలో నానుతున్నారు. ఈ తరహా తీరుతోనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చిన్నపిల్లాడి మాదిరిగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

కలెక్టర్లు, పంచాయతీ రాజ్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని రెండోసారి లేఖ రాసిన నిమ్మగడ్డ.. అందుకు ఏర్పాటు చేసుకున్నానని మీడియాకు లీకులు ఇస్తున్నారు. నిన్న కాదన్న వారు, నేడు అవునంటారా..? ఒక్క రోజులోనే నిర్ణయం మార్చుకుంటారా..? అంటే ఎవరైనా సరే కాదనే అంటారు. అలాంటిది నిమ్మగడ్డ పని గట్టుకుని రెండో లేఖ రాశారు. అవతలి వైపు నుంచి స్పందన ఉండదని తెలిసే.. ఈ లేఖ రాశారని.. తనకు తానుగానే నిమ్మగడ్డ సమావేశం రద్దు చేసుకోవడంతో స్పష్టమైంది. సమావేశం ఏర్పాటు చేయాలని లేఖ రాసిన నిమ్మగడ్డే.. మళ్లీ ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవడంలో మతలబు ఉందంటున్నారు. తాను ఎన్నికలు నిర్వహించాలని యత్నించినా.. ప్రభుత్వం సహకరించడంలేదని రాబోవు రోజుల్లో కోర్టులో వినిపించేందుకే ఈ తతంగం అంతా నడిపిస్తున్నారని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి