iDreamPost

నిమ్మగడ్డ నిర్ణయానికి బ్రేక్‌.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌

నిమ్మగడ్డ నిర్ణయానికి బ్రేక్‌.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఒంటెద్దు పోకడలతో వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌సీఈ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఏపీ హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ జరపాలని ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆ అధికారం ఎస్‌ఈసీకి లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు వెంటనే డిక్లరేషన్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా లైన్‌ క్లియరైనట్లే.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బెదిరింపుల వల్ల పలువురు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని, ప్రలోభాలు, బెదిరింపుల వల్ల పలువురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని ఓ వర్గం మీడియాలో కథనాలు వచ్చాయి. టీడీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించారు. అందుకే నోటిఫికేషన్‌ను రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని ఆయా పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఎస్‌ఈసీకి వినతి పత్రాలు ఇచ్చాయి. వీటిపై స్పందించిన ఎస్‌ఈసీ.. గత నెలలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏకగ్రీవమైన స్థానాలపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బెదరింపుల వల్ల నామినేషన్లు వేయలేని వారు, నామినేషన్లు ఉపసంహరించుకున్న వారు ఆధార సహితంగా ఫిర్యాదులు చేయాలని సూచించారు. మీడియాలో వచ్చిన కథనాలను కూడా పరిగణలోకి తీసుకుని విచారణ జరపాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా.. ఆయా చోట్ల నామినేషన్లు దాఖలుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Also Read : మున్సిపల్‌ ఎన్నికలు.. నాడు– నేడు.. ఎంత వ్యత్యాసం..?

ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైన పలువురు ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ అధికారం ఎస్‌ఈసీకి లేదని పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. పలుమార్లు విచారణ తర్వాత.. ఇటీవల తీర్పును రిజర్వ్‌ చేసింది. ఆ తీర్పును నేడు వెల్లడించింది. ఇంతకు ముందే.. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అప్పుడే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కూడా ఎస్‌ఈసీకి ఎదురుదెబ్బ తగులుతుందనే అంచనాలు తాజాగా నిజమయ్యాయి.

Also Read : నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి