iDreamPost

పతాక స్థాయికి నిమ్మగడ్డ వైఖరి.. సజ్జలను తొలగించాలంటూ లేఖ..!!

పతాక స్థాయికి నిమ్మగడ్డ వైఖరి.. సజ్జలను తొలగించాలంటూ లేఖ..!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వివాదాస్పద వ్యవహార శైలి పతాక స్థాయికి చేరుకుంది. నిన్నటి వరకు ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలని, విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ రోజు మరో అడుగు ముందుకు వేశారు. తనపై విమర్శలు చేస్తున్నారంటూ.. ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యానారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి లక్షణ రేఖ దాటి తనపై రాజకీయంగా దాడి చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్న నిమ్మగడ్డ.. సజ్జలను ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని కోరి సరికొత్త వివాదానికి తెరలేపారు.

విచక్షణ మరుస్తున్నారా..?

ప్రతి రాజ్యాంబద్ధ సంస్థకు స్వతంత్రతోపాటు పరిధి ఉంటుంది. అధికారాలకు హద్దులు ఉంటాయి. కానీ ఈ విషయం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గమనించడం లేదా..? అనే సందేహాలు ఇప్పటికే వ్యక్తమయ్యాయి. పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను అభిసంశిస్తూ ఆదేశాలు జారీ చేయడంతోనే నిమ్మగడ్డ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని వెల్లడైంది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సలహాదారునే ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌కు లేఖ రాయడం విచిత్రంగా కనిపిస్తోంది. అధికారులతో మొదలు పెట్టిన నిమ్మగడ్డ, ప్రభుత్వ సలహాదారుల వరకు వచ్చారు. రేపు మంత్రులను కూడా తొలగించాలని లేఖ రాసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు రాసిన లేఖలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణలు తనపై రాజకీయ విమర్శలు చేస్తూ.. లక్ష్మణ రేఖ దాటారని ఫిర్యాదు చేయడం గమనించాల్సిన అంశం.

లక్ష్మణ రేఖ దాటేశారు..!

పైన చెప్పుకున్నట్లు ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థకు అధికారాలు, పరిధి, పరిమితులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ అధినేత గవర్నర్‌. రాష్ట్ర ముఖ్యమంత్రి సలహా మేరకు ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. ఫలానా వారిని మంత్రులుగా ముఖ్యమంత్రి చేసిన సిఫార్సు మేరకు వారి చేత గవర్నర్‌ ప్రమాణం చేయిస్తారు. ప్రభుత్వ సలహాదారులను రాష్ట్ర ముఖ్యమంత్రి సూచన మేరకే గవర్నర్‌ నియమిస్తారు. మంత్రులను, ప్రభుత్వ సలహాదారులను ముఖ్యమంత్రి సూచన మేరకే గవర్నర్‌ తొలగిస్తారు. మంత్రులు కూడా తమ రాజీనామా లేఖను ముఖ్యమంత్రికే సమర్పిస్తారు. వాటిని సీఎం గవర్నర్‌కు పంపుతారు. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియ. ప్రభుత్వాలు మారినా.. విధానం మారదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా ఎవరు ఉండాలో కూడా ముఖ్యమంత్రే నిర్ణయిస్తారు. సీఎం సిఫార్సు మేరకు గవర్నర్‌ ఎస్‌ఈసీని నియమిస్తారు. ఈ విషయం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు తెలియదని చెప్పలేము. అయినా ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనేందుకు కారణాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. వచ్చే నెల 31వ తేదీన పదవీ విరమణ చేయబోతున్న నిమ్మగడ్డ.. ఆ లోపు వీలైనంత గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సామాన్యులకు కూడా అర్థమవుతోంది.

Read Also : అమరావతి ఎక్కడ బాబు గారు..?