iDreamPost

డాక్టర్‌ రమేష్‌కు షాక్.. మూడు రోజుల పాటు కస్టోడియల్‌ విచారణ..

డాక్టర్‌ రమేష్‌కు షాక్.. మూడు రోజుల పాటు కస్టోడియల్‌ విచారణ..

విజయవాడ రమేష్‌ హాస్పిటల్‌ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది చనిపోయిన ఘటనలో ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న రమేష్‌ హాస్పిటల్స్‌ యజమాని డా.రమేష్‌బాబును కస్టోడియల్‌ విచారణకు ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు అగ్ని ప్రమాద ఘటనపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

డా. రమేష్‌బాబు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు కస్టోడియల్‌ విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. విచారణలో భౌతిక దూరం పాటించాలని సూచించింది. విజయవాడలోని అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో పోలీసులు రమేష్‌బాబును విచారించనున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ సెంటర్‌లో అగ్రి ప్రమాదం జరిగింది. పది మంది కోవిడ్‌ పేషంట్లు మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు దర్యాప్తు చేశారు. రమేష్‌ ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉన్నత స్థాయి సిబ్బందిని అరెస్ట్‌ చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి రమేష్‌ హాస్పిటల్స్‌ యజమాని పరారిలో ఉన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినా ఆయన జాడ నెలలు తరబడి కనిపించలేదు. ఈ క్రమంలో రమేష్‌బాబుకు అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు వారెంట్‌ జారీ చేశారు.

అజ్ఞాతంలో ఉంటూనే రమేష్‌బాబు తనపై పోలీసులు చేస్తున్న విచారణను ఆపాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు అగ్రిప్రమాద ఘటనపై పోలీసులు చేస్తున్న విచారణపై స్టే విధించింది. రమేష్‌బాబుపై తదుపరి ఎలాంటి విచారణ, అరెస్ట్‌లు జరపరాదంటూ ఆదేశించింది.

ఏపీ హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్‌ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని, స్వర్ణప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రిం కోర్టు ఇరు పక్షాల వాదనలను విన్నది. ఏపీ ప్రభుత్వ వాదనను సమర్థించిన సుప్రిం కోర్టు.. పూర్వాపరాలు విచారించకుండానే కేసును మూసివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను కొట్టివేస్తూ సెప్టెంబర్‌ 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది.

Read Also : మోదీ నోట.. జమిలి మాట.. సాధ్యమేనా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి