Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకి 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడి విధించింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయడు స్కిల్ డెవలప్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సీఐడీ వాదనతో ఏకీభవించింది. దాంతో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ని కొట్టేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి.. దీనిపై జోరుగా చర్చ సాగుతుంది. అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏంటి.. ఎలాంటి సందర్బంలో దాఖలు చేస్తారు.. అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సీఆర్పీసీలో సెక్షన్ 482 కింద సుప్రీం కోర్టులో గానీ హైకోర్టులో గానీ క్వాష్ పిటిషన్ వేసే వెసలుబాటు ఉంది. తన ప్రమేయం లేకపోయినా కేసులో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. అందుకు ప్రధాన కారణాలు ఏంటి అంటే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగింది.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే. ఇందుకు సంబంధించి నాటి ప్రభుత్వం విడుదల చేసిన జీఓల్లో 13 చోట్ల చంద్రబాబు డిజిటల్ సిగ్నేచర్స్ ఉన్నాయి. బడ్జెట్ అనుమతి, కౌన్సిల్ సమావేశానికి కూడా బాబు సంతకం ఉంది. జీఓకు సంబంధించిన నోట్‌ఫైల్స్ కూడా కొన్ని చోట్ల మిస్ అయ్యాయి. పైగా నాటి సీఎం చంద్రబాబు నాయుడు, సీఎస్ చెప్పడం వల్లనే నిధులు విడుదల చేశామని.. పీవీ రమేష్ గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చారు. నిధుల విడుదలకు సంబంధించి కూడా చంద్రబాబు సంతకం పెట్టిన ఆధారాలు ఉన్నాయి.
అంతేకాక గ్లోబల్ సంస్థ సీమెన్స్ ఇంటర్నెల్ టీమ్ కూడా తమ కంపెనీ పేరుమీద మోసాలకు పాల్పడ్డారని.. తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడమే కాక.. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సీఐడీకి అందజేసింది. ఈ కుంభకోణానికి సహకరించిన ఆనాటి అధికారులు కూడా కోర్టుకు ముందుకు వచ్చి స్టేట్‌మెంట్లు ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు ఉండటంతో.. ఏపీ హైకోర్టు.. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఇక బాబుకు కష్టమే అంటున్నారు న్యాయనిపుణులు.