iDreamPost
android-app
ios-app

APలో వారికి జగన్‌ సర్కార్‌ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15వేలు జమ

  • Published Sep 16, 2023 | 8:26 AM Updated Updated Sep 16, 2023 | 8:26 AM
  • Published Sep 16, 2023 | 8:26 AMUpdated Sep 16, 2023 | 8:26 AM
APలో వారికి జగన్‌ సర్కార్‌ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15వేలు జమ

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి దోహదపడేలా సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు సీఎం జగన్‌. కుల, మత, పార్టీలతో సంబంధం లేకుండా.. లబ్ధిదారులందరికి.. సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుందంటే.. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరు ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా మరో సంక్షేమ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. దీనిలో భాగంగా ఒక్కొక్కరి ఖాతాలో 15 వేలు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

ఏపీలోని కాపు మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వరుసగా నాలుగో ఏడాదీ వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఆ వేదిక మీదుగా బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నేరుగా డబ్బుల్ని జమ చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం అర్హులైన 3,57,844 మంది మహిళల ఖాతాలో.. సుమారు రూ.536.77 కోట్లను జమ చేయనున్నారు.

వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు జగన్‌ ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఈ ఐదేళ్లలో వారు ఒక్కొక్కరికి.. మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందజేయనుంది. ఇవాళ అందజేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు.

కాపు నేస్తం పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలకు ఆర్జిక సహాయాన్ని అందిస్తోంది. అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15,000/- వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తోంది ప్రభుత్వం. మొత్తం ఐదేళ్ల పాలనలో రూ.75,000/- వేల రూపాయల ఆర్దిక సహాయాన్ని అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం రూ.10వేలలోపు ఉండాలి.. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12వేలు ఉండాలి.

ఎవరు అర్హులంటే..

ఈ పథకానికి అర్హులు కావాలంటే.. లబ్ధిదారులు కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి మెట్ట రెండూ కలిపి పది ఎకరాలకు మించకూడదు. అలానే నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారైతే.. 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. అలానే జీవనోపాధి నిమిత్తం.. ఆటో, టాటాఏస్‌, ట్రాక్టర్‌ వంటి వాహనాలను కలిగి ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులు. అంతేకాక కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్‌ తీసుకుంటున్నప్పటికీ ఈ పథకానికి అర్హులే.

వీరు అనర్హులు..

ఉపాధి నిమిత్తం కాకుండా.. కారు ఉన్న వారు.. ఈ పథకానికి అనర్హులు. అలానే కుటుంబంలో ఎవ్వరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వారు ఉంటే.. అలాంటి వారు కూడా ఈ పథకానికి అనర్హులు. కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తే ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవాళ్లు ఆధార్ కార్డు, కుల, ఆదాయ, నివాస, వయసు నిర్థారణ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.