iDreamPost

కరోనాపై ఏపీ అప్రమత్తత.. ఏ రాష్ట్రం చేయలేని పని చేసిన జగన్‌ సర్కార్‌..

కరోనాపై ఏపీ అప్రమత్తత.. ఏ రాష్ట్రం చేయలేని పని చేసిన జగన్‌ సర్కార్‌..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వెలుగుచూసిన ఈ మహామ్మరి ఇప్పటికే 145 దేశాలకు వ్యాపించింది. ఒక్క అంటార్కిటికా ఖండం మినహా అన్ని ఖండాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. ప్రపంచ మహమ్మరిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మన దేశంలో కూడా కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా ఇద్దరు మరణించారు. ఇందులో ఒకరు హైదరాబాద్‌లో మరణించడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. ఈ నెల 31 వరకు తెలంగాణలో జన సంచారం అధికంగా ఉండే అన్ని వ్యవహారాలను బంద్‌ చేస్తూ కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు నగరంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి ఈ వైరస్‌ సోకింది. దీంతో జగన్‌ సర్కార్‌ అప్రమత్తమైంది. దేశంలో ఏ రాష్ట్రమూ చేయలేని పనిని ఏపీలో జగన్‌ ప్రభుత్వం చేసింది. ఇతర దేశాల నుంచి వస్తున్న వారి ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. సమస్య మూలాల్ని గుర్తించిన సీఎం జగన్‌.. విదేశాల్లో ఊంటూ ఏపీకి వచ్చిన వారి వివరాలను సేకరించారు. గ్రామ, వార్డు వాలంటీర్లను వారి పరిధిలోని ఇళ్లకు పంపించి సర్వే చేయించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, వారి వివరాలను వాలంటీర్లు సేకరించారు. కరోనా వైరస్ పై సర్వే సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ శక్తి సామర్ధ్యాలు ఏమిటో మరోసారి రుజువైంది.

రాష్ట్రానికి కరోనా ప్రభావిత దేశాల నుంచి 675 మంది వచ్చినట్లు వాలంటీర్లు గుర్తించారు. ఆ సమాచారం ద్వారా వారందరికీ ఏపీ ప్రభుత్వం స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించింది. వారిలో అనుమానితులైన 61 మంది శాంపిల్స్‌ సేకరించింది. వీరిలో నెల్లూరు వాసికి పాజిటివ్‌ రాగా, 52 మందికి నెగిటివ్‌ వచ్చింది. మరో 8 మందికి సంబంధించిన రిపోర్టులు వెల్లడికావాల్సి ఉంది.

కరోనా నివారణకు జగన్‌ ప్రభుత్వం బ్రిటీష్ ప్రభుత్వ కాలం నాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టానికి ఆంధ్రప్రదేశ్ అంటు వ్యాధి కోవిడ్ -19 రెగ్యులేషన్ 2020గా నామకరణం చేశారు. ఈ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. శుక్రవారం నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఏడాది పాటు ఈ చట్టం అమల్లో ఉంటుంది.

ఈ చట్టాన్ని బట్టి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు, ఆస్పత్రులు కరోనా వైరస్ నియంత్రణ కోసం పనిచేయాలి. అవసరమైన చోట ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలి. కరోనా లక్షణాలతో ఉన్న అనుమానితులకు స్క్రీనింగ్, చికిత్స అందించాలి.

విదేశాల నుంచి ఎవరైనా రాష్ట్రానికి వస్తే… వారికి వ్యక్తులకు దగ్గు, జలుబు, శ్వాస సంబంధ వ్యాధులు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటిలోనే ఐసోలే‌షన్‌లో ఉండాలి. ఆ సమయంంలో కుటుంబ సభ్యుల్ని , బయట వ్యక్తుల్ని కలవడానికి వీల్లేదు. విదేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే… కాల్ సెంటర్ 0866 2410978 నెంబర్‌కు లేదా 104 హెల్ప్ లైన్ నంబర్‌కు సమాచారం అందించాలి.

కరోనాను జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. అనుమానితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వార్డులు సిద్ధంగా ఉంచుకోవాలి ఆదేశించింది. అనుమానితులకు వైద్యం అందిస్తే.. ఖర్చుకు అదనంగా 10 వేలు, పాజిటివ్ కేసులకు వైద్యం అందిస్తే 20 వేలు ఇస్తామని ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు సర్కులర్ జారీ చేసి కరోనా పై అత్యంత అప్రమత్తంగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి