iDreamPost

వాలంటీర్లకు సంక్షేమ లక్ష్యాలు.. విస్తుబోతున్న ప్రజలు

వాలంటీర్లకు సంక్షేమ లక్ష్యాలు.. విస్తుబోతున్న ప్రజలు

పేరుకే సంక్షేమ పథకాలు.. కానీ ప్రజలకు అందేది శూన్యం. అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించలేదు. మాకు పథకం రాకుండా మా ఊరి నాయకుడు అడ్డుకుంటున్నాడు… ఇదీ నిన్న మొన్నటి వరకూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో తరచూ వినిపించే మాట. ఈ మాటల్లో వంద శాతం వాస్తవం ఉంది. పథకం ప్రవేశపెట్టి.. బడ్జెట్‌ కేటాయించి.. అందులో ఎలా కోత వేద్దామనేలా గత ప్రభుత్వాలు ఆలోచించేవి. దరఖాస్తు చేసుకున్నా రకరకాల కారణాలు చెప్పి అధికారులు తిరస్కరించేవారు. ఇక అర్హత ఉన్నా.. ఊరి నాయకుడు సిఫార్సు లేదని అధికారులు మొండిచేయి చూపేవారు. ఈ తరహా పరిపాలనకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లుచీటి పాడింది.

రాజకీయం ప్రమేయం, సిఫార్సులు లేకుండా అర్హత ఉన్న వారికి పథకాలు అందిచేందుకు ప్రవేశపెట్టిన వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా అద్భుత ఫలితాలను ఇప్పటికే రాబట్టింది. ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలు ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పార్టీలతో సంబంధం లేకుండా పథకాలు అందుతుండడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వాలంటీర్ల ద్వారా కేవలం అర్హులకు పథకాలు అందించడమే కాదు.. అర్హులను గుర్తించే పనిని కూడా ప్రభుత్వం వారికి అప్పగించింది. ఆయా పథకాలను వీలైనంత ఎక్కువ మంది అర్హులకు అందించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో పథకాలు అందించడంలో గ్రామ, వార్డు వాలంటీర్ల మధ్య, సచివాలయాల మధ్య పనితీరును పోలుస్తూ అధికారులు లక్ష్యాలను విధిస్తున్నారు.

గ్రామ సచివాలయాలపై పర్యవేక్షణను మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో)కి ప్రభుత్వం అప్పగించింది. తన పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని తరచూ తనికీ చేసి సచివాలయ సిబ్బంది పనితీరు, వాలంటీర్ల పనితీరును ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేసేందుకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు పూచికత్తు, వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా పదివేల రూపాయల రుణం ఇవ్వనుంది. ఇందుకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వికరిస్తోంది.

ఈ పథకంపై ఎంపీడీవోలు గ్రామ సచివాలయాలకు వద్దకు వెళ్లి సంక్షేమ అధికారి, వాలంటీర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. సంక్షేమ అధికారి తన సచివాలయం పరిధిలో ఎంత మంది చేత జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేయించారో చెక్‌ చేస్తున్నారు. అదే విధంగా వాలంటీర్లు ఎవరు.. ఎంతెంత మందితో దరఖాస్తులు చేయించారనేది కూడా తనిఖీ చేస్తున్నారు. ప్రతి పథకానికి రికార్డు మెయింటెన్‌ చేస్తున్నారు. ఆ రికార్డును పరిశీలిస్తున్న ఎంపీడీవోలు ఒక్క దరఖాస్తు కూడా చేయించని వాలంటీర్లు, తక్కువ దరఖాస్తులు చేయించిన వారిని పక్కవారితో పోల్చుతూ క్లాస్‌ పీకుతున్నారు. ఇదే తరహా ట్రీట్‌మెంట్‌ సంక్షేమ సహాయకుడికి ఇస్తున్నారు. సమీప సచివాయలంలో సదరు పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయో చెబుతూ.. ఆ మేరకు మీరు కూడా పని చేయాలని సంక్షేమ సహాయకుడికి, వాలంటీర్లకు ఎంపీడీవోలు లక్ష్యాలు విధిస్తున్నారు.

సచివాలయానికి వెళ్లిన స్థానికులు ఈ తతంగం అంతా చూసి విస్తుబోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. గత ప్రభుత్వ పాలనకు ఇప్పటి ప్రభుత్వ పరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని పోల్చుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి