iDreamPost

కరోనా కట్టడికి కొత్త వ్యూహం.. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

కరోనా కట్టడికి కొత్త వ్యూహం..  అంతర్రాష్ట్ర  బస్సు సర్వీసుల పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కొత్త రకం వ్యూహం రూపొందించింది ఏపీ సర్కారు. అటు ప్రజలు ఇబ్బందులు పడుకుండా.. ఇటు వైరస్ వ్యాప్తి చెందకుండా కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, వ్యాపారాలకు అనుమతించింది. మధ్యాహ్నం నుంచి ఉదయం 5 గంటల దాకా ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేస్తోంది. 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దూరప్రాంత బస్సు సర్వీసులు ఆగిపోనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

నిజానికి జగన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అంతర్రాష్ట్ర సర్వీసులు దాదాపుగా నిలిచిపోనున్నాయి. నిజానికి మధ్యాహ్న తర్వాత అన్ని బస్సు సర్వీసులను నిలిపేసింది. ఆ లెక్క ప్రకారం రాష్ట్రంలో కూడా 300 కిలోమీటర్ల పైన ఉన్న రూట్లలో బస్సులు బంద్ అయినట్లే భావించాలి. ఉదయం 6 నుంచి 12 దాకా బస్సులు తిరిగే సమయం దాదాపు 6 గంటలు. 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే.. 6 గంటల పైనే పడుతుంది. ఉదయం 6 గంటలకే బయలుదేరినా గమ్య స్థానాలకు చేరుకోవడం దాదాపు అసాధ్యం. దీంతో హైదరాబాద్¬-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-అనంతపురం, హైదరాబాద్-అనంతపురం తదితర ప్రధాన రూట్లలో బస్సులు బంద్ కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రయాణాలు భారీగా తగ్గిపోనున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిచిపోనున్నాయి. అంతిమంగా కేసులు కూడా తగ్గనున్నాయి.

సరిహద్దుల్లో కరోనా టెస్టులు

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. కరోనా వచ్చిన కొత్తలో పాటించిన పద్ధతిని ఇప్పుడు పాటించనుంది. టెస్టింగ్, ట్రీట్ మెంట్ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు చేతులెత్తేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. రాష్ట్రంలోకి వచ్చేవారికి కరోనా టెస్టును తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్ పోర్టుల్లోని పరీక్షలు చేస్తారు. నెగటివ్ వస్తే ఇంటికి పంపిస్తారు. పాజిటివ్ వస్తే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు. రోడ్డు మార్గంలో వచ్చేవారికి కూడా టెస్టులు తప్పనిసరి. ఇందుకోసం బోర్డర్లలో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

కేసులు పెరుగుతుండటంతో..

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 20 వేలు దాటి నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ముందుగా రాత్రి కర్ఫ్యూ విధించింది. రాష్ట్రంలోనూ ప్రజలందరూ విధిగా కర్ఫ్యూను పాటిస్తున్నారు. రాత్రి 10 దాకా టైం ఉన్నా.. సాయంత్ర 6, 7 కాగానే రోడ్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పగటి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎండలు మండిపోతున్న వేళ.. మధ్యాహ్నం నుంచి ఆంక్షలు విధించడం వల్ల జనాలకూ పెద్ద సమస్య ఉండదు. ఇప్పటికే పల్లెలు, పట్టణాల్లో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు అసలు బయటికి రావడం లేదు. ఉదయం పూటనే అన్ని పనులు చూసుకుంటున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి మొదలయ్యే కర్ఫ్యూతో జనాలకు పెద్దగా సమస్య ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విడతల వారీగా ఆంక్షలు విధిస్తుండటంతో.. జనాలు అలవాటు పడిపోతున్నారని, భవిష్యత్తులో లాక్ డౌన్ పెట్టినా ఎలాంటి ఇక్కట్లు ఉండవని అంటున్నాయి.

Also Read : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలలో 6,500 కోట్లు ఖాతాల్లో జమ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి