iDreamPost

సంక్షేమంలో కొత్త పుంతలు, అన్నింటా జగన్ మార్క్

సంక్షేమంలో కొత్త పుంతలు, అన్నింటా జగన్ మార్క్

ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ మార్క్ పాలన సాగుతోంది. ఏడాది కాలంలోనే జగన్ తానేంటో నిరూపించుకున్నారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాల అమలులో కొంత పుంతలు తొక్కిస్తున్నారు. గతంలో వైఎస్సార్ పాలనా తీరు ప్రజల్లో నేటికీ చెరిగిపోని ముద్రగా మిగిలింది. ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్ మెంట్ వంటి పథకాల పుణ్యాన ఆయన ప్రజల్లో నిలిచిపోయారు. ఇప్పుడు అదే పంథాను ఆయన తనయుడు అందిపుచ్చుకున్నారు. నాన్న రెండడుగులు వేస్తే నేను పది అడుగులు వేస్తానని ప్రకటించినట్టుగానే పాలన సాగిస్తున్నారు. పలు పథకాలకు శ్రీకారం చుట్టి, చెప్పాడంటే చేస్తాడంతే అన్నట్టుగా మారారు. మ్యానిఫెస్టోకి కట్టుబడిన నేతగా మారారు. జగన్ ఏడాది పాలనలో సంక్షేమానికి పెద్ద పీట వేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో అభివృద్ధికి సంబంధించిన అడుగులకు ప్రాధాన్యతనివ్వబోతున్నట్టు కనిపిస్తోంది.

జగన్ తాను చెప్పినట్టుగా నవరత్నాల అమలు చేసి చూపించారు. అనేక అడ్డంకులు, ఆర్థిక ఒడిదుడుకులు, ఇతర సమస్యలు తలెత్తినా తాను చెప్పింది మాత్రం యధాతథంగా అమలు చేసేందుకు శ్రమించారు. అధికార పక్ష నేతలు చెబుతున్నట్టుగా 80శాతం కాకపోయినా సగానికి పైగా మ్యానిఫెస్టోని తొలి ఏడాదిలోనే పూర్తి చేసేశారు. ఇక సంక్షేమానికి తోడుగా అభివృద్ధి వైపు దృష్టి సారించే దిశలో ఏపీ ప్రభుత్వం ఉందనే చెప్పవచ్చు. ఇప్పటికే రాజధానుల విషయంలో అడుగులు వేస్తోంది. త్వరలో అది కొలిక్కి రాబోతోంది. విశాఖ కేంద్రంగా అభివృద్ధి కొంత పుంతలు తొక్కబోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూలన్నీ కార్యరూపం దాల్చితే త్వరలో పారిశ్రామిక విశాఖ మరింత పురోభివృద్ధి సాధించడం ఖాయం. దానికి తగ్గట్టుగా విశాఖలో మెట్రో సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు డీపీఆర్ లు సిద్ధం చేసే పనిలో జగన్ ఉన్నారు.

అదే సమయంలో అమరావతి కేంద్రంగా ఉన్న అవకాశాలను కూడా సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని జగన్ ఆశిస్తున్నారు. అగ్రికల్చర్ హబ్ గా ప్రస్తుతం రాజధాని ప్రాంతంగా ఉన్న చోట వివిధ కార్య్రక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తద్వారా విజయవాడ, గుంటూరు మధ్య కొత్త పరిశ్రమలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విలువైన భూములు అందుబాటులో ఉండడంతో ప్రభుత్వానికి వెసులు బాటు అవుతుందని భావిస్తున్నారు. ఇక రాయలసీమ నీటి వనరుల విషయంలో జగన్ స్పష్టతతో అడుగులు వేస్తున్నారు. ఓవైపు గోదావరి జలాల వినియోగం కోసం భారీ ప్రణాళిక సిద్ధం చేస్తూనే మరో వైపు కృష్ణా నదిలో వరద జలాల వినియోగంపై దృష్టి పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టెండర్ల వ్యవహారం కొలిక్కి రావడంతో పనులు సాగుతున్నాయి, ప్రణాళిక ప్రకారం వచ్చే ఏడాదికి కాలువల ద్వారా నీటిని అందించాలనే సంకల్పంతో సాగుతున్నారు. నిర్వాసితుల సమస్య మీద కేంద్రీకరించిన పనిచేస్తున్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రీకరణ కాకుండా అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు అనుగుణంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 9 మినీ హార్బర్లు, జెట్టీలు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం కొలిక్కి వస్తోంది. కాకినాడ సమీపంలో గేట్ వే పోర్ట్ నిర్మాణానికి పూనుకుంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కూడా వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకునేందకు, ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమలకు అదనపు అవకాశాలు కల్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. తద్వారా రాజధాని నగరంగా భావిస్తున్న విశాఖను తూర్పు తీరంలో మరో ముంబై స్థాయికి చేర్చాలనే సంకల్పంతో సాగుతున్నారు.

సంక్షేమం విషయంలో జగన్ సర్కార్ కి తిరుగులేదనే గుర్తింపు సాధించారు. అభివృద్ధి పరంగా నాడు నేడూ అంటూ విద్యా, వైద్య రంగాలను సమూలంగా మార్చేసే పథకాలను చేపట్టారు. వాటితో పాటుగా కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల స్థాపనకు నడుంకట్టారు. ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. తద్వారా ప్రజావైద్యం మరింత విస్తృతపరిచే యోచనలో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా స్థానిక యువతను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఉపాధి విషయంలో తొలి ఏడాదిలోనే 4లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలిచిపోతుంది.

త్వరలో మరిన్ని ఉద్యోగాలకు మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సమగ్ర దృక్పథంతో, భవిష్యత్ తరాల ప్రయోజాలనకు అనుగుణంగా సాగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజలందరి ప్రయోజనాలు కాపాడే దిశలో సాగుతున్నీ ప్రయత్నాలన్నీ ఫలిస్తే అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ అందరినీ ఆకర్షించే స్థాయికి చేరుతుందనడంలో సందేహం లేదు. వనరులను వినియోగించుకుంటూ, అట్టహాసాలు కాకుండా ఆచరణాత్మకంగా సాగుతున్న ప్రభుత్వ విదానాలు అందుకు దోహదపడుతాయనే అశాభావం సర్వత్రా కనిపిస్తోంది. ఏమయినా తొలి ఏడాదిలోనే జగన్ తానేంటో నిరూపించుకోవడంతో రాబోయే కాలంలో మరింత అభివృద్ధి మార్గాలు అన్వేషించేందుకు దోహదపడుతోందని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి