iDreamPost

జగన్‌ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం

జగన్‌ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం

ఇచ్చిన హామీలు, ప్రజా సంక్షేమం పట్ట ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు తన చిత్తశుద్ధిని చాటుకుంటూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అవకాలు చవాకులు పేలినా.. వ్యతిరేక మీడియా ఎన్ని కథనాలు ప్రచురించినా వాస్తవం ప్రజలకు గుర్తిస్తారనే ఉద్దేశంతో సీఎం జగన్‌ తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా మద్యనిషేధంలో మరో అడుగు ముందుకు వేశారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో మరో 13 శాతం దుకాణాలు మూసివేశారు. ఫలితంగా 3500 ఉన్న దుకాణాలు ఇకపై 2,965కు తగ్గాయి. దీంతో ఇప్పటి 33 శాతం దుకాణాలు తగ్గించినట్లైంది.

తాను అధికారంలోకి వస్తే మూడు విడతల్లో మద్యపాన నిషేధం చేస్తానని, దుకాణాలు తగ్గిస్తూ, ధర లు షాక్‌ కొట్టేలా పెంచుతూ ప్రజలను మద్యం నుంచి దూరం చేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికల సభల్లో పలుమార్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు తన ఎన్నికల మెనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 20 శాతం దుకాణాలను తగ్గించి 3500కు పరిమితం చేశారు. తాజాగా ఏడాది పూర్తయిన సందర్భంగా మరో 13 శాతం దుకాణాలను తగ్గించారు. ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేపడుతూ.. బెల్ట్‌ దుకాణాలు, అనధికారిక విక్రయాలను పూర్తిగా నిర్మూలించింది. విక్రయాల వేళలను కుదించిన వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపుగా వేగంగా అడుగులు వేస్తోంది.

ఒకే రోజు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు మద్యం విషయంలో వేర్వేరు నిర్ణయాలు తీసుకోవడం యాదృచ్చికంగా చెప్పవచ్చు. ఏపీలో దుకాణాలు తగ్గించి మద్యపాన నిషేధం వైపుగా అడుగులు వేయగా.. తెలంగాణ మాత్రం దుకాణాల పని వేళలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ఐదో దశ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. సడలింపులలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాత్రి వేళ కర్ఫ్యూను కుదించింది. గతంలో రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ ఉండగా.. తాజాగా ఆ వేళలను రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు పరిమితం చేసింది.

ఫలితంగా వచ్చిన వెలుసుబాటుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై ఈ రోజు నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ నడపవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా మరో రెండు గంటలు విక్రయాలు జరుగుతాయి. అటు మద్యం ప్రియులకు రాత్రి పూట కూడా మద్యం దొరుకుతుంది.. ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి