iDreamPost

కొత్త సంవత్సరం కానుకలు ఇచ్చేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

కొత్త సంవత్సరం కానుకలు ఇచ్చేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం కానుకలు ఇచ్చేందుకు జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీకి అంతా సిద్ధమైంది. సమావేశం అజెండాను ఇప్పటికే సిద్ధం చేశారు. పలు సంక్షేమ పథకాలతోపాటు, అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.

ఏడాది ముగింపులో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇళ్లు/ ఇళ్ల స్థలం కలను నిజం చేయబోతోంది. కొత్త ఏడాదిలోనూ నగదు రూపేనా కానుకలు అందిచబోతోంది. అమ్మఒడి, వైఎస్సార్‌రైతు భరోసా పథకాల కింద నూతన సంవత్సరం ప్రారంభంలో, సంక్రాంతి పండగకు ముందు నగదును ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది. ఈ అంశాలను ఈ రోజు మంత్రివర్గంలో చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. జనవరి 9వ తేదీన అమ్మ ఒడి పథకం నగదు 15 వేల రూపాయలను పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సంక్రాంతి పండగకు రెండు రోజుల ముందు వైఎస్సార్‌రైతు భరోసా పథకం కింద చివరి విడద నగదు రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

కరోనా వైరస్‌ ప్రభావం వల్ల 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మినహా దేశం మొత్తం ఇబ్బందులు పడింది. లాక్‌డౌన్‌ వల్ల జనజీవన స్తంభించింది. పనులు లేక పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులు పడ్డారు. కానీ ఏపీలో మాత్రం ప్రజలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురుకాలేదు. సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదును జగన్‌సర్కార్‌ జమ చేస్తుండడంతో కరోనా ప్రభావం ఏపీ ప్రజలపై పడినట్లు కనిపించలేదు. ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బంది పడలేదు. వైఎస్సార్‌రైతు భరోసా, అమ్మ ఒడి, వైఎస్సార్‌ నేతన్న హస్తం, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ చేదోడు తదితర పథకాల ద్వారా జగన్‌ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదును జమ చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి