iDreamPost

ముగిసిన ఆంధ్రా బ్యాంక్ ప్రస్థానం…

ముగిసిన ఆంధ్రా బ్యాంక్ ప్రస్థానం…

‘ఆంధ్రా బ్యాంక్’ తెలుగు వారి జీవితాలతో పెనవేసుకు పోయిన పేరు. కోట్లాది మందికి జీవనోపాధి కల్పించిన సంస్థ …. వేలాది మంది ఉద్యోగులకు జీవితం ప్రసాదించిన సంస్థ ….

1923 నవంబరు 28 న మచిలీపట్నంలో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో గాంధీ మహాత్ముని ప్రియ శిష్యుడైన డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిచే మచిలీపట్నం కేంద్రంగా ప్రారంభమయింది. అనతి కాలంలోనే శాఖోపశాఖలుగా విస్తరించి తెలుగు నేలపై ఎవరూ పోటీకి రాలేనంతగా ఎదిగింది.1963 లో కేంద్ర కార్యాలయం మచిలీపట్నం నుండి హైదరాబాద్ కు మారడంతో వ్యాపార అవకాశాలు మరింతగా మెరుగుపడ్డాయి.

ఖాతా దారులకు వినూత్నమైన సేవలు అందించడంలో ఆంధ్రా బ్యాంక్ ఎప్పుడూ కూడా మిగతా బ్యాంకులకు దిక్సూచిగా నిలబడింది.

భారత దేశంలో మొట్టమొదటి సారిగా క్రెడిట్ కార్డ్ ను ప్రవేశపెట్టింది ఆంధ్రా బ్యాంక్.

అనేక రకాలైన ఇన్సూరెన్స్ తో కలసిన ఖాతాలను అన్ని బ్యాంకులకంటే ముందు ప్రవేశపట్టింది ఆంధ్రా బ్యాంక్. అభయ సేవంగ్స్, అభయ జీవన్ వంటివి ఆ కోవలోకే వస్తాయి. అలాగే రైతులకు క్యాష్ క్రెడిట్ ఖాతాలను ప్రవేశపట్టింది కూడా ఆంధ్రా బ్యాంకే. ఆ మరుసటి సంవత్సరంలో కేంద్రం ఈ తరహా ఖాతాలను అన్ని జాతీయ బ్యాంకులకు విస్తరించింది.

1969 లో ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణలో మిగిలిపోయిన ప్రైవేటు బ్యాంకులలో అతి పెద్దది ఆంధ్రా బ్యాంక్. 1980 లో జాతీయకరణ అయిన తరువాత ఆంధ్రా బ్యాంక్ మరింత ప్రభుత్వ పెట్టుబడితో అభివృధ్ధి పధంలో నడిచింది. అనతి కాలంలోనే జాతీయ బ్యాంకులలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నది ఆంధ్రా బ్యాంక్. ఒక్క తెలుగు నేలపైనే కాకుండా దేశంలోని 27 రాష్ట్రాలలో మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలోనే కాకుండా తెలుగు వారు ఎక్కువ మంది నివసించే దుబాయ్, న్యూజెర్సీలలో రిప్రజంటేటివ్ శాఖలను 2008 లో ప్రారంభించింది. 2019 డిసెంబర్ నాటికి ఆంధ్రా బ్యాంక్ వ్యాపారం దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మైలు రాయి చేరుకుంది

ఐతే పారు బాకీల భారంతో కుదేలైన అనేక జాతీయ బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు కూడా ఉండటంతో కేంద్రం కొన్ని జాతీయ బ్యాంకులను కలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. దాని ఫలితమే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం.

96 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత వసంతాల వైపు పరిగెడుతున్న తరుణంలో తెలుగు వారి ఆత్మ అయిన ఆంధ్రా బ్యాంక్ కనుమరుగవడం బాధాకరం.

విలీనం నాటికి 2876 శాఖలు, 3797 ATM లతో దేశం నలు మూలలా వ్యాపించింది ఆంధ్రా బ్యాంక్.

Written by – Murali Krishna

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి