iDreamPost

కరోనా బారిన పడి సిక్కోలు వాసి మృతి…

కరోనా బారిన పడి సిక్కోలు వాసి మృతి…

కరోనా అంతకంతకూ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే 145 దేశాలకు వ్యాపించిన ఈ కరోనా కారణంగా ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు భారతీయులు కరోనా కారణంగా మృతి చెందారు. కాగా తాజాగా మరో భారతీయుడు బహ్రయిన్ లో కరోనా లక్షణాలతో మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే మూడురోజుల క్రితం కోవిడ్19(కరోన) లక్షణాలతో బహ్రయిన్ లోని ఆసుపత్రిలో చేరిన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం గ్రామానికి చెందిన బొడ్డపు చంద్రశేఖర్ నేడు మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అక్కడి అధికారులు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా కరోనా నివారణకు తెలుగు రాష్ట్రాలు ముందస్తు చర్యలు ప్రారంభించాయి. జగన్‌ ప్రభుత్వం బ్రిటీష్ ప్రభుత్వ కాలం నాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టానికి ఆంధ్రప్రదేశ్ అంటు వ్యాధి కోవిడ్ -19 రెగ్యులేషన్ 2020గా నామకరణం చేశారు. ఈ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. శుక్రవారం నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఏడాది పాటు ఈ చట్టం అమల్లో ఉంటుంది.ఈ చట్టాన్ని బట్టి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు, ఆస్పత్రులు కరోనా వైరస్ నియంత్రణ కోసం పనిచేయాలి. అవసరమైన చోట ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలి. కరోనా లక్షణాలతో ఉన్న అనుమానితులకు స్క్రీనింగ్, చికిత్స అందించాలి.

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 31 వరకూ ,విద్యాసంస్థలు,మాల్స్, థియేటర్లు మూసివేయాలని నిర్ణయించింది.తెలంగాణాలో ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు మాత్రం యధావిధిగా జరగనున్నాయి. ఇప్పటికే కర్ణాటక,మహారాష్ట్ర,ఒరిస్సా,ఢిల్లీ,ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్,పశ్చిమబెంగాల్,గోవా,బీహార్,పంజాబ్ తో సహా పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసాయి. ఏప్రిల్ 15 వరకు విదేశియులకు వీసాలు ఇవ్వడాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి