iDreamPost

అమరావతి ‘గ్రామాలు’.. నగరం కాదు..!!

అమరావతి ‘గ్రామాలు’.. నగరం కాదు..!!

ప్రపంచంలో గొప్ప నాగరాల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుంది. దేశంలో మొదటి మూడు నగరాల్లో అమరావతి ఉంటుంది. ఢిల్లీని తలదన్నేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తా. 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటి నుంచి అప్పటి సీఎంగా, ఇప్పుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వల్లెవేస్తున్న మాట. అమరావతి నగరం… నగరం.. అంటూ ఆయన చెబుతున్న మాటలు చేతల్లో చూపకుండా మీడియాలో చూపించారు.

అమరావతి రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతులు తమ భూములు ఇచ్చి త్యాగం చేశారని, ఇప్పుడు వారికి అన్యాయం చేస్తే ఊరుకోనని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబే వారికి అన్యాయం చేశారు. 29 గ్రామాలతో కూడిన రాజధానిగా అమరావతిని ప్రకటించిన సీఎం చంద్రబాబు వాటి మొత్తాన్ని కలిపి నగరంగా మాత్రం అధికారికంగా గుర్తించలేదు. తన హయాంలో అమరావతి పేరు పలికిన ప్రతి సారి గొప్ప నగరంగా చేస్తా.. ప్రపంచ పంటలో పెడతానని డాంభికాలు పలికిన బాబు కనీసం మున్సిపాలిటీగా కూడా ఆ ప్రాంతాన్ని గుర్తించకపోవడం ఆయనకున్న విజన్‌కు నిదర్శనం.

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో రాజధాని 29 గ్రామాల్లో కూడా పంచాయతీ ఎన్నికలే జరుగనున్నాయి. మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌గా ప్రకటించి అధికారికంగా గుర్తించి ఉంటే పంచాయతీ ఎన్నికలు బదులు, కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగేవి. కానీ చంద్రబాబు 29 గ్రామాలను గ్రామ పంచాయతీలుగానే ఉంచి రైతులు చేసిన త్యాగానికి తగిన గుర్తింపు ఇచ్చారు.

ఒక పంచాయతీని అప్‌గ్రేడ్‌ చేసేందుకు కేవలం మూడు లేదా నాలుగు నెలల సమయం పడుతుంది. ఒక ప్రాంతాన్ని మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌గా మార్చేందుకు ఆ ప్రాంత ప్రజా ప్రతినిధి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ లేఖ రాస్తే చాలు. వెంటనే ప్రభుత్వం తన పని మొదలు పెడుతుంది. పంచాయతీ తీర్మానంతో పంచాయతీ రాజ్‌ శాఖ వాటిని డీనోటిఫై చేస్తుంది. పట్టణ, పురపాలక శాఖ ఆ ప్రాంతాన్ని జనాభా సంఖ్య ఆధారంగా మున్సిపాలిటీ, లేదా కార్పొరేషన్‌గా గుర్తిస్తుంది. మూడు లక్షల లోపు జనాభా ఉంటే మున్సిపాలిటీ ఆ పై ఉంటే కార్పొరేషన్‌గా గుర్తిస్తారు.

అమరావతిని సెప్టెంబర్‌లో ప్రకటించారు. 29 గ్రామాల్లో రాజధాని పెడుతూ అది రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)గా 2014 డిసెంబర్‌లో ప్రకటించారు. అప్పటి నుంచి 2019 మేలో ఎన్నికలు జరిగే వారకు దాదాపు నాలుగున్నరేళ్ల కాలంలో ఆ ప్రాంతాన్ని మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌గా చేసేందుకు చంద్రబాబుకు తీరికలేకుండా పోయినట్లుంది. తీరిక లేక చేయలేదా..? లేక మళ్లీ అధికారంలోకి వస్తే చేద్దామనుకున్నారో…? తెలియదు కాని మూడు రాజధానులు వద్దు రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని అందోళనలు చేస్తున్న వారు ముందు తమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన ఘనకార్యాన్ని గమనించే సమయం ఆసన్నమైంది. అప్పుడు శాపనార్థాలు సీఎం జగన్‌కు బదులు మాజీ సీఎం చంద్రబాబుకు పెట్టడం మాత్రం తధ్యం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి