iDreamPost

Alluda Majaka : తిట్టించుకున్నా కలెక్షన్లు దక్కించుకున్న మెగా మూవీ – Nostalgia

Alluda Majaka : తిట్టించుకున్నా కలెక్షన్లు దక్కించుకున్న మెగా మూవీ – Nostalgia

కమర్షియల్ స్టార్ హీరోలను ఫలానా మీటర్ లోనే చూపించాలన్న రూలేమీ లేదు కానీ దీనికీ పరిమితులు ఉంటాయన్న సంగతి మర్చిపోకూడదు. ముఖ్యంగా సమాజ పరంగా ఉన్న కొన్ని కట్టుబాట్లు, సభ్యత సంస్కృతికి సంబంధించిన అంశాలను మాత్రం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే విజయం దక్కినా కూడా విమర్శలు తప్పవు. దానికి ఉదాహరణగా అల్లుడా మజాకా గురించి చెప్పుకోవచ్చు. 1992 ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్ తర్వాత నిర్మాత దేవీవరప్రసాద్ మళ్ళీ చిరంజీవితో తప్ప మరో హీరోతో సినిమా చేయనని రెండేళ్లకు పైగా వెయిటింగ్ లోనే ఉన్నారు. అప్పుడు ఈవివి సత్యనారాయణ మంచి ఊపులో ఉన్నారు. నాగార్జునతో వారసుడు – హలో బ్రదర్, వెంకటేష్ తో అబ్బాయిగారు ఇలా అగ్ర హీరోలతో సూపర్ హిట్స్ అందుకుని మెగా ఆఫర్ కోసం చూస్తున్నారు

అదే సమయంలో రచయిత పోసాని కృష్ణమురళి చెప్పిన కథ చిరుతో పాటు టీమ్ మొత్తానికి బాగా నచ్చేసింది. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు తరహా ఎంటర్ టైన్మెంట్ తో పాటు యాక్షన్ కు సైతం స్కోప్ ఉండటంతో చిరు వెంటనే ఎస్ చెప్పేశారు. టైటిల్ కూడా ముందు వేరేది అనుకున్నారు. తర్వాత అల్లుడా మజాకాకు షిఫ్ట్ అయ్యారు. రమ్యకృష్ణ, రంభ హీరోయిన్లుగా సీనియర్ నటి లక్ష్మిని ప్రధాన పాత్రకు ఎంచుకున్నారు. ఆవిడ భర్తగా తొలుత సత్యనారాయణను తీసుకుని కొన్ని సీన్లు తీశారు. ఏవో కారణాల వల్ల గిరిబాబుని రీప్లేస్ చేశారు. ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సంగీత దర్శకులు కోటి మాస్ కి ఫుల్ కిక్కిచ్చే పాటలు సిద్ధం చేశారు. కథ మాటలు స్క్రీన్ ప్లే మొత్తం పోసాని సమకూర్చగా కెఎస్ హరి ఛాయాగ్రహణం అందించారు.

ఒళ్ళంతా పొగరుతో మిడిసిపడే తల్లి, వయసొచ్చిన ఇద్దరు కూతుళ్లకు సీతారాముడు అనే పల్లెటూరి యువకుడు ఎలా బుద్ది చెప్పాడనేదే కథలో మెయిన్ పాయింట్. దీనికి చెల్లి సెంటిమెంట్, తండ్రి చావు లాంటి ఎమోషనల్ పాయింట్స్ ని జోడించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి డ్రామాతో నడిపించిన ఈవివి సెకండ్ హాఫ్ లో ఎక్కువ బూతులు అశ్లీలత జోడించడంతో విమర్శల జడివాన కురిసింది. ప్రదర్శన ఆపాలంటూ మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. 1995 ఫిబ్రవరి 24న విడుదలైన అల్లుడు మజాకా విజయాన్ని ఇవేవి అడ్డుకోలేకపోయాయి. బయ్యర్లకు లాభాల వర్షం కురిసింది. దిగ్విజయంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. కలెక్షన్ల సంగతి పక్కనపెడితే ఇలాంటి సినిమా చేసిండకూడదనే మెజారిటీ అభిప్రాయాన్ని చిరంజీవి పరిగణనలోకి తీసుకుని మళ్ళీ ఆ పొరపాటు చేయలేదు

Also Read : Classic Movie : భారతీయ సినిమాను ప్రభావితం చేసిన క్లాసిక్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి