Venkateswarlu
Venkateswarlu
విద్యా బుద్దులు నేర్పే ఉపాధ్యాయులపైనే కొంతమంది విద్యార్థులు దారుణాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉపాధ్యాయులపై దారుణాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా, ఓ ఇద్దరు విద్యార్థులు ఓ టీచర్‌ను తుపాకితో కాల్చి చంపే ప్రయత్నం చేశారు. తుపాకితో ఆయన్ని కాల్చిన తర్వాత ఓ వీడియోను సైతం చిత్రీకరించారు. ఆ వీడియోలో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని, ఆగ్రాకు చెందిన ఓ ఇద్దరు బాలురు అక్కడి ఓ స్కూల్లో చదువుతున్నారు. కొద్దిరోజుల క్రితం వీరికి క్లాస్ టీచర్‌తో గొడవైంది. దీంతో ఈ ఇద్దరు ఆయనపై పగ పెంచుకున్నారు. ఎలాగైనా టీచర్‌ను చంపాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఓ తుపాకిని సంపాదించారు. ఒంటరిగా వెళుతున్న టీచర్‌పై చాటునుంచి తుపాకితో కాల్పులు జరిపారు. ఓ బులెట్ ఆయనకు తగలటంతో కుప్పకూలాడు. అక్కడున్న వారు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.
టీచర్‌ను తుపాకితో కాల్చిన తర్వాత ఆ ఇద్దరు విద్యార్థులు ఓ వీడియో చేశారు. ఆ వీడియోలో.. ‘‘ ఆ టీచర్ కాలుకు బులెట్ తగిలింది. గాయాలతో బయటపడ్డాడు. ఇంతటితో ఆగం మళ్లీ కాలుస్తాం. ఇప్పుడు ఆయన మీద 40 బుల్లెట్లు కాల్చాల్సింది. కానీ, ఒకటే కాల్చాం. 39 మిగిలిపోయాయి’’ అని అన్నారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి అధికారుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.