iDreamPost

మగాడి అహాన్ని ఎదిరించిన మహిళ – Nostalgia

మగాడి అహాన్ని ఎదిరించిన మహిళ – Nostalgia

మహిళలను ప్రధాన పాత్రల్లో పెట్టి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ. ఎందుకంటే కమర్షియల్ మార్కెట్ లో వీటికి ఎక్కువ బిజినెస్ ఆశించలేం. అందులోనూ సీరియస్ ఇష్యూ మీద కథలు రాసుకుంటే చాలా రిస్క్ ఉంటుంది. నిర్మాతకు అవార్డులు వస్తాయేమో కానీ డబ్బులు రావు. కానీ ఈ సూత్రాన్ని తప్పని ఋజువు చేస్తూ ప్రతిఘటన, మయూరి, అంతులేని కథ లాంటి అద్భుతాలు రాకపోలేదు. అయితే రెగ్యులర్ గా ఇవి తీసేవాళ్ళు లేకపోవడమే వెలితి. కామెడీ చిత్రాలకు బ్రాండ్ అంబాసడర్ గా నిలిచిన దర్శకులు ఈవివి సత్యనారాయణ గారు ఇలాంటి అంశం మీద దృష్టి పెడతారని ఎవరైనా ఊహించగలరా. అది సాధ్యం చేసిన సినిమా ఆమె.

1994 సంవత్సరం. ఈవివి గారి డిమాండ్ మాములుగా లేదు. ఒకపక్క నటకిరీటి రాజేంద్రప్రసాద్ తో సూపర్ హిట్లు, మరోపక్క నాగార్జున, వెంకటేష్ తో బ్లాక్ బస్టర్లు కొట్టేసి మోస్ట్ బిజీ డైరెక్టర్ గా ఉన్న సమయమది. ఆ సమయంలో తన స్టైల్ కి భిన్నంగా సమాజంలో ఆడది ఎలా అణిచివేయబడుతోందనే పాయింట్ మీద ఓ మంచి కథ రాసుకున్నారు ఈవివి. రమణి చిత్రానువాదం చేయగా ఇసుకపల్లి మోహనరావు సంభాషణలతో స్క్రిప్ట్ సిద్ధం చేశారు. విద్యాసాగర్ ని సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. ఊహ అనే కొత్తమ్మాయిని ఎంచుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మాణం పూర్తి చేశారు.

మధ్యతరగతికి చెందిన ఊహ(ఊహ)కు బ్యాంకు ఉద్యోగి ఆంజనేయులు(శ్రీకాంత్)తో పెళ్లవుతుంది. కానీ అతను మొదటి రోజే చనిపోతాడు. కోడలు ఉద్యోగం చేస్తే ఆదాయం వస్తుందన్న దురాశతో ముందు వద్దనుకున్న పిసినారి మామ(కోట శ్రీనివాసరావు) తర్వాత ఇంటికి తీసుకెళతాడు. ఊహను ఇష్టపడిన కోటీశ్వరుడు విక్రమ్(నరేష్)తనను రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడతాడు. అక్కడి నుంచి అసలైన డ్రామా మొదలవుతుంది. పేదరికంతో నలిగిపోయే సగటు అమ్మాయిగా ఊహ అద్భుత నటన, నటీనటుల పెర్ఫార్మన్స్ ఆమెకు ప్రశంసలే కాదు బోలెడు డబ్బులు కూడా తెచ్చి పెట్టాయి. ఇంత డెప్త్ ఉన్న కథలోనూ కామెడీని మిస్ చేయలేదు ఈవివి. 1994 డిసెంబర్ 9న బాలకృష్ణ టాప్ హీరోతో పాటు ఒకేరోజు రిలీజైన ఆమె దాన్ని దాటేసి మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి