iDreamPost

ఫ్యామిలి ఆహా సెంటిమెంట్ స్వాహా – Nostalgia

ఫ్యామిలి ఆహా సెంటిమెంట్ స్వాహా – Nostalgia

మొత్తం కుటుంబాన్ని టార్గెట్ చేసి తీసే సినిమాల్లో ఎమోషన్లకు ఎంతకి ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే కాఫీలో పాలు చక్కర ఎలాగైతే సమపాళ్ళలో ఉంటేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందో అదే ఫార్ములా సినిమాలకూ వర్తిస్తుంది. ఏది బ్యాలన్స్ తప్పినా ఫలితం గాడి తప్పుతుంది. అదెలాగో చూద్దాం. 1997 తమిళంలో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆహా’ అరవంలో పెద్ద హిట్టు. వంద రోజులు ఆడింది. రాజీవ్ కృష్ణ, సులేఖ నటించిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులకు విపరీతంగా ఎక్కేసింది. బాషా లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఇలాంటి ఫీల్ గుడ్ ఎమోషన్ ని చూపించిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది.

దీన్ని చూసిన అక్కినేని నాగార్జునకు తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ముందుగా తనే హీరోగా చేద్దామనుకున్నారు. అయితే ఆ సమయంలోనే సురేష్ కృష్ణతో ‘ఆటో డ్రైవర్’ సినిమా నిర్మాణంలో ఉంది. అందుకే జగపతిబాబుని ఒప్పించారు. ఇలాంటి సినిమాలు చేయడం ద్వారా అప్పటికే అతనికి విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉంది. మంచి ఫామ్ లో ఉన్న సంఘవిని హీరోయిన్ గా లాక్ చేసుకున్నారు. తెలుగు వెర్షన్ కూ దర్శకుడిగా వ్యవహరించడానికి సురేష్ కృష్ణనే ముందుకొచ్చారు. అలా గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద ఆహా నిర్మాణం వేగంగా చేశారు. వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు సమకూర్చారు.

తమిళ వెర్షన్ లో నటించిన రఘువరన్, విజయ్ కుమార్ ఇందులోనూ కంటిన్యూ కాగా కథకు కీలకమైన ఒక పాత్రలో అక్కడ జయసుధ నటించగా ఇక్కడ భానుప్రియ చేశారు. జయసుధకూ వేరే క్యారెక్టర్ దక్కింది. కోటీశ్వరుల ఇంట్లో చివరి కొడుగ్గా బాధ్యత లేకుండా తిరిగే యువకుడు చెల్లి పెళ్లి సందర్భంగా ఎదురైన అతి విపత్కర పరిస్థితిని ఎలా ఎదురుకున్నాడనే పాయింట్ మీద ఆహా రూపొందింది. సెకండ్ హాఫ్ డ్రామా కాస్త శృతి మించింది. రఘువరన్ చనిపోయాడని హై ఎమోషన్ ని బిల్డ్ చేసి తమ చేత కన్నీళ్లు పెట్టించి చివరికి బ్రతికించడం పబ్లిక్ కి నచ్చలేదు. ఇంత అతి ఆరవ ప్రేక్షకులకు నచ్చింది కానీ ఇక్కడ వర్కౌట్ కాలేదు. 1998 నవంబర్ 20న రిలీజైన ఆహా మరీ బ్యాడ్ మూవీ అనిపించుకోలేదు కానీ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. ఆడియో మాత్రం పెద్ద హిట్టే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి