iDreamPost

సుశాంత్‌ది ఆత్మహత్యే- పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడి..

సుశాంత్‌ది ఆత్మహత్యే- పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడి..

బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.కానీ సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని అతడి కుటుంబం ఆరోపించింది. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు సుశాంత్ కాదని సీబీఐతో విచారణ జరిపించాలని సుశాంత్‌ మామ ఆర్‌.సి.సింగ్‌ డిమాండ్‌ చేశారు.

కాగా తాజాగా సుశాంత్‌ది ఆత్మహత్యే అని పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చింది. అతనిది హత్య కాదని ఆత్మహత్య చేసుకున్నారని పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చడంతో ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. గత కొన్ని నెలలుగా సుశాంత్ మానసిక క్రుంగబాటులో ఉన్నారని అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆరు రోజుల క్రితమే సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిషా సలియన్‌(28) భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటనకి సుశాంత్ మరణానికి ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

బాలీవుడ్‌లో ఎలాంటి అండదండలు లేకుండా ఎదిగిన కథానాయకుడిగా సుశాంత్ పేరు తెచ్చుకున్నారు. స్వతహాగా తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న సుశాంత్ నటుడు కావాలన్న లక్ష్యంతో చదువును వదిలి ముంబై వెళ్లారు. నెస్లే మంచ్ యాడ్ తో పాటుగా కిస్‌ దేశ్‌ మే హై మేరా దిల్‌’, ‘పవిత్ర రిశ్తా’ షోలు ఆయనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. 2013లో ‘కై పో చె’తో కథానాయకుడిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత చేసిన శుద్ధ్‌ దేసీ రొమాన్స్‌ మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఎమ్‌.ఎస్‌.ధోని-ది అన్‌టోల్డ్‌ స్టోరిలో చేసిన ధోని పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నారు. ధోనీ పాత్రలో సుశాంత్ జీవించాడని అభిమానుల ప్రశంసలు దక్కాయి.

కాగా ఇలా అర్దాంతరంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న.. కాగా సుశాంత్ ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలను పరిశోధించే క్రమంలో పోలీసులు సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ని పరిశీలిస్తున్నారు. కానీ సుశాంత్ ఫ్లాట్ లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి