iDreamPost
android-app
ios-app

6 నెలల క్రితం చోరీ చేసిన ఇంట్లో మళ్లీ కన్నం.. ట్విస్ట్ ఇచ్చిన యజమాని..!

6 నెలల క్రితం చోరీ చేసిన ఇంట్లో మళ్లీ కన్నం.. ట్విస్ట్ ఇచ్చిన యజమాని..!

‘దొంగ దొంగ వచ్చాడోయ్ అన్ని దోచుకుపోతాడోయ్‘ అన్న చందంగా.. ఒకసారి దొంగ ఇంట్లోకి చొరబడ్డాడా.. ఇల్లంత గుల్ల చేయడం ఖాయం. అయితే చాక చక్యంగా దొంగతనాలు చేస్తూ ఎవ్వరి కంటికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతుంటారు చోరులు. ఎందుకంటే పోలీసులకు దొరికిపోయామా.. ఇక నలుగు పెట్టేస్తారన్న భయం. అలా అని దొంగతనం చేయడం మానేస్తారా అంటే.. ఒకసారి అలవాటు పడ్డ ప్రాణం కదా.. వెంటనే వదిలేయాలంటే చేతనవ్వాలి కదా. నొక్కేయాలన్నా థాట్ వచ్చినప్పుడల్లా చేతులు దురద పెడుతూ ఉంటాయి. అందరి కన్నుగప్పి చటుక్కున దొంగతనం చేసేస్తారు.  అందుకే  ఒకసారి కన్నం వెేసిన ఇంటికి, ప్రాంతానికి మళ్లీ పోరు. కానీ ఈ దొంగకు తెలియదేమో.. చోరుల సూత్రాలు, సిద్దాంతాలు. అందుకే ఒకసారి కన్నం వేసిన ఇంటికి మళ్లీ పోయి.. చిక్కుల్లో పడ్డాడు. అడ్డంగా దొరికిపోయాడు.

ప్రశాంతతకు పట్టుకొమ్మగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోని పలాసలోని ఎల్లమ్మ వీధిలో బుల్లు పాడి అనే వ్యక్తి నివాసం ఉంది. అతడి ఇంట్లో అర్ధరాత్రి సమయంలో ఓ దొంగ ప్రవేశించి.. బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు చేసిన శబ్దాలకు పక్క గదిలో నిద్రిస్తున్న ఓనర్‌కు మెళుకువ రావడంతో.. ఏం జరుగుతుందా అని మెల్లిగా బీరువా ఉన్న గదిలోకి తొంగిచూశాడు. కాగా, గదిలో దొంగ ఉన్నట్లు గుర్తించిన యజమాని.. వెంటనే ఆ గదికి తలుపులు వేసి గడియపెట్టాడు. వెంటనే ఇరుగు, పొరుగుకు సమాచారం ఇచ్చాడు. వారంతా కలిసి దొంగకు బడిత పూజ చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, అతడిని అప్పగించారు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడు చెప్పిన విషయం తెలిసి విస్తుపోవడం పోలీసుల వంతైంది.

కాగా, సరిగ్గా ఆరు నెలల క్రితం అదే ఇంట్లోకి చొరబడినట్లు, అప్పట్లో పట్టుకోలేకపోవడంతో మళ్లీ అదే ఇంటికి కన్నం వేసేందుకు వెళ్లినట్లు చెప్పాడు. అయితే ఈ సారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఒకసారి అనుభవం ఎదురవ్వడంతో అలర్ట్ గా ఉన్న యజమాని ఈ సారి దొంగను దొరకపుచ్చుకుని పోలీసులకు అప్పగించాడు. కాగా, పట్టుబడిన దొంగ పలాసకి చెందిన మణిగా గుర్తించారు. పగలంతా కార్పెంటర్ పనులు చేస్తూ.. రాత్రి అయితే దొంగతనాలను ప్రవృత్తిగా మలుచుకుని చోరీలకు పాల్పడుతుంటాడు. అయితే గతంలో అదే ఇంట్లో చొరబడ్డానని చెప్పడంతో.. అప్పటి సీసీటీవీ ఫుటేజ్ ఫీడ్ పరిశీలించారు పోలీసులు. గేట్ నుండి ఓ దొంగ లోపలికి వెళుతూ కనిపించాడు. ఆ దొంగ ఈ దొంగ అన్న నిర్ధారణకు వచ్చారు.