iDreamPost

రాష్ట్రానికి మూడు రాజధానులు సాధ్యమా?

రాష్ట్రానికి మూడు రాజధానులు సాధ్యమా?

రోమ్ నగరం ఒక రోజులో నిర్మించబడలేదు, Rome wasn’t built in a day, అని ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది. ఏదైనా గొప్ప పని చేయాలంటే ఒక్కసారిగా జరిగిపోదు అని చెప్పడానికి ఆ సామెత వాడుతారు. అయితే ఆ పాతచింతకాయ కబుర్లు తన లాంటి విజన్ ఉన్న నాయకులకు వర్తించవు అని నిరూపించాలని, రోమ్ తలదన్నే రాజధాని నగరం ఒక్కసారిగా నిర్మించి, ప్రపంచానికి చూపించాలని వేలాది ఎకరాల సాగుభూమి అమరావతి కోసం సేకరించారు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

అయితే అయిదేళ్ళ కాలంలో చిన్నపాటి వర్షానికి ఇన్ డోర్ జలాశయాలు, జలపాతాలు తయారయ్యే నాలుగు తాత్కాలిక భవనాలు, ఎక్కడక్కడ చీలికలు ఇచ్చే రోడ్లు తప్ప రోమ్ నగరంలో ఒక వీధిని పోలిన నిర్మాణాలు కూడా పూర్తి చేయలేకపోవడం వారి దారుణ పరాజయానికి కారణాలలో ఒకటి అని చెప్తారు విశ్లేషకులు.

Read Also: మూడు రాజధానులు?

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని భవితవ్యం మీద అనేక అనుమానాలు లేవనెత్తారు మీడియా వర్గాలు. అయితే శ్రీ చంద్రబాబు గారు మొదలు పెట్టిన అభివృద్ధి కేంద్రీకరణ అనే పొరపాటు జగన్ మోహన్ రెడ్డి కొనసాగించకుండా ఉంటే బాగుంటుందని చాలా మంది మేధావులు భావించారు.అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు, విద్యా, వైద్య సంస్థలు అన్నీ అమరావతిలో అనడం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తప్పు పునరావృతం అవుతోందని ఎందరు మొత్తుకున్నా శ్రీ చంద్రబాబు గారు వినిపించుకోలేదు.

రాజధాని మీద ఎటువంటి తొందరా చూపకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న జగన్ మీద ప్రతిపక్షం విమర్శలు ఎక్కుపెట్టింది. భూతల స్వర్గం లాంటి నగర నిర్మాణం తాము అధికారంలో ఉండగా మొదలుపెడితే దాన్ని జగన్ కొనసాగించలేదని విమర్శలు చేయడంతో పాటు మందీమార్బలాన్ని వేసుకుని చంద్రబాబు అమరావతికి బస్సు యాత్ర కూడా చేశారు. ఈలోగా అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి బినామీలు రాజధాని ముసుగులో చేసిన రియల్ ఎస్టేట్ దందా అసెంబ్లీ సాక్షిగా సాక్ష్యాధారాలతో బయటపెట్టి, అమరావతి మీద ఆ పార్టీకున్న తొందర వెనుకున్న కారణం ప్రజలకు తెలియజేసింది అధికార పక్షం.

మూడు రాజధానులు
———————————–
ఈ నేపథ్యంలో రాజధాని అంశం మీద అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కూడా ఉండవచ్చు అని అన్నారు. శాసనసభ అమరావతిలో, సెక్రటేరియట్ విశాఖపట్నంలో, హైకోర్టు కర్నూలులో పెట్టుకోవచ్చు అంటూ దక్షిణాఫ్రికా దేశాన్ని ఉదాహరణగా చూపించారు. ఆ దేశంలో పార్లమెంటు కేప్ టౌన్ లో, సచివాలయం ప్రిటోరియాలో, సుప్రీంకోర్టు బ్లూమ్ ఫోంటైన్ లో ఉంటాయి.

Read Also: తెలుగుదేశం బినామీలకు జగన్ స్ట్రోక్ !

అయితే రాజధాని మీద వేసిన కమీషన్ నివేదిక అందిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినా, ఈ విషయం మీద అధికారికంగా జీవో వచ్చేసినట్టే భావించి ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి.

తన కలల రాజధాని తను ఆశించిన స్థాయిలో ఉండదేమో అన్న నిరాశలోనో, తనవారి ఆస్తులన్నీ కేంద్రీకృతం అయిన చోట తాను అశించిన అభివృద్ధి ఉండదేమో అన్న భావనతోనో “ఇది తుగ్లక్ చర్య” అన్నారు చంద్రబాబు. ఇక తెలుగుదేశం పార్టీ ఏ రాగం తీస్తే ఆ రాగానికి కోరస్ పాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ “తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే కొడుకు పరమాన్నం అడిగాడట” అని ఒక సామెత చెప్పి, ఒక అమరావతికే దిక్కు లేకపోతే మూడు అమరావుతులు ఎలా కడతారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Read Also: మూడు రాజధానులు– ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే

మూడు రాజధానులు అని చెప్పారు కానీ, మూడు అమరావతులు కాదని ఇక్కడ గమనించాలి. రాజధాని అంటే ప్రభుత్వ భవనాలు, అందులో పనిచేసే సిబ్బందికి నివాస గృహాలు, విద్యాలయాలు, వైద్యశాల లాంటివి కట్టి, రోడ్లు,రవాణా నీటి సరఫరా, పార్కుల లాంటి పబ్లిక్ ప్లేసులూ కట్టి వదిలేస్తే మిగిలిన సౌకర్యాలు వాటంతట అవే ఏర్పడుతాయి. మల్టిప్లెక్సులు, షాపింగ్ మాల్సూ, రెస్టారెంట్లూ లాంటివి ప్రభుత్వం నిర్మించవలసిన పని లేదు. అవి చేయడానికి వ్యాపార వర్గాలు సిద్ధంగా ఉంటాయి.

వేల ఎకరాల్లో, లక్షల కోట్లు పెట్టి, ప్రపంచంలో టాప్-5 నగరాలలో ఒకటి ఇప్పటికిప్పుడు అర్జంటుగా కట్టిపారేయాలని గ్రాఫిక్స్ కలలు కనకుండా, వాస్తవికంగా అలోచించి ముందుకి పోతే మూడు చోట్ల మూడు రాజధానులు నిర్మించుకోవడం అంత కష్టతరమైన విషయం కాదు.

Written By Dr.Sannapa Reddy Krishna Reddy

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి