iDreamPost

ఏపీ రాజ‌ధాని వికేంద్రీకరణ ప్ర‌క్రియ‌ ప్రారంభం

ఏపీ రాజ‌ధాని వికేంద్రీకరణ  ప్ర‌క్రియ‌ ప్రారంభం

ఏపీ రాజ‌ధాని వికేంద్రీకరణ ప్ర‌క్రియ‌కు ముహూర్తం సిద్ధం అవుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా అడుగులు ప‌డుతున్నాయి. అమ‌రావ‌తితో పాటుగా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న కార్య‌రూపం దాల్చ‌డానికి కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే సీఎం ప్ర‌తిపాద‌న‌, జీఎన్ రావు క‌మిటీ రిపోర్ట్ తో పాటుగా బీసీజీ రిపోర్ట్ దానిని బ‌ల‌ప‌ర‌చ‌డంతో ఇక ప్ర‌భుత్వానికి అడ్డంకి తొల‌గిన‌ట్టేన‌ని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా నియ‌మించిన హైప‌వ‌ర్ క‌మిటీ తొలి స‌మావేశం సీఆర్డేయే కార్యాల‌యం వేదిక‌గా నిర్వ‌హించ‌బోతున్నారు. ఈనెల 18లోగా హైప‌వ‌ర్ క‌మిటీ నివేదిక అందించే అవ‌కాశం ఉంది.

తుది క‌మిటీ నివేదిక రాగానే జ‌న‌వ‌రి 18న జ‌ర‌గ‌బోయే క్యాబినెట్ భేటీలో దానిని ఆమోదించే అవ‌కాశం ఉంది. అనంత‌రం అసెంబ్లీ స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నారు. రాజ‌ధాని విష‌యంపై ప్ర‌త్యేకంగా జ‌ర‌ప‌బోతున్న ఈ స‌మావేశంలో తీర్మానం చేసిన త‌ర్వాత విశాఖ నుంచి కార్య‌నిర్వాహ‌క రాజ‌ధాని ప్రారంభించే అవ‌కాశం ఉంది. అందులో భాగంగా ఈ ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు వేదిక‌గా విశాఖ‌ను ఎంపిక చేశారు.

Also Read : 20 న విశాఖ లో సచివాలయం ..?

ప్ర‌భుత్వం తొలిద‌శ‌లో కీల‌క శాఖ‌ల‌కు చెందిన ప‌లు విభాగాల‌ను త‌ర‌లించ‌డానికి ఇప్ప‌టికే యంత్రాంగానికి స‌మాచారం అందించింది. వీల‌యినంత త్వ‌ర‌గా స‌చివాల‌య వ్య‌వ‌హారాలు సాగ‌ర‌న‌గ‌రం నుంచి సాగించే దిశ‌లో వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతుండ‌డం ఆస‌క్తిక‌క‌రం. సాధారణ పరిపాలనశాఖ, పంచాయితీరాజ్‌, పట్టణాభివృద్ధి, ఆర్ అండ్ బీ, విద్యా వంటి నాలుగైదు కీలక శాఖలను మొద‌టి ద‌శ‌లో తరలిరచాలని నిర్ణ‌యించారు. ఆ తరువాత మిగిలిన శాఖల తరలింపు ప్రక్రియ చేపట్టి ఏప్రిల్‌ చివరికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

ఇక ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు కూడా విశాఖ‌లో నిర్వ‌హించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప‌లు కీల‌క శాఖ‌ల ప్ర‌ధాన విభాగాల‌తో పాటుగా సీఎం క్యాంప్ ఆఫీసు కూడా విశాఖ‌లో ప్రారంభించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నెలాఖ‌రు నాటికి ఈ విష‌యంలో క్లారిటీ వ‌స్తుంద‌ని అధికారులు చెబుతున్నారు. దానికి అనుగుణంగా బీచ్ రోడ్ లో ఓ హోట‌ల్ ని ప‌రిశీలిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే తాత్కాలికంగా ప్రైవేటు వ‌స‌తి చూసిన‌ప్ప‌టికీ శాశ్వ‌త క్యాంప్ ఆఫీస్ కోసం త‌గిన స్థ‌లం రిషికొండ ప్రాంతంలో ఖ‌రారు చేసిన‌ట్టుగా భావిస్తున్నారు.

Also Read:-విశాఖలో కొత్త సచివాలయం ఇదేనా ??

ఇప్ప‌టికే స‌చివాల‌య విభాగాల‌కు సంబంధించిన త‌ర‌లింపు ప్ర‌క్రియ‌లో సిబ్బందికి ఆదేశాలు అందాయి. రాత‌పూర్వ‌కంగా ఉత్త‌ర్వులు రావాల్సి ఉంద‌ని చెబుతున్నారు. అవి కూడా మూడోవారంలో విడుద‌ల కాగానే సిబ్బంది వ‌చ్చే నెల మొద‌టి వారం నాటికి విశాఖ‌లో వాలిపోవాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. మొత్తంగా ఏపీ రాజ‌ధాని సంద‌డి సాగ‌ర‌న‌గ‌రంలో మొద‌ల‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి