iDreamPost

25 ఏళ్ళ ప్రేమించుకుందాం రా !

25 ఏళ్ళ ప్రేమించుకుందాం రా !

సరిగ్గా ఇదే రోజు పాతికేళ్ల క్రితం రిలీజైన ప్రేమించుకుందాం రా ఇప్పుడు చూసినా అంతే ఫ్రెష్ గా ట్రెండ్ సెట్టర్ గా అనిపిస్తుంది. అందుకే వెంకటేష్ ఫ్యాన్స్ కే కాదు టీవీలో వచ్చిన ప్రతిసారి, యుట్యూబ్ లో చూసిన ఎన్నోసార్లు కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటుంది. దీని వెనకున్న ప్రత్యేక విశేషాలు చూద్దాం. 1993లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న జయంత్ సి పరాన్జీకి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చేందుకు సురేష్ బాబు మాటిచ్చారు. అందులో భాగంగానే ముందుగా ఒక కథ అనుకుని సౌందర్య, మాలాశ్రీ, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా వెంకటేష్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. ఏఆర్ రెహమాన్ కు సంగీతం కోసం అడ్వాన్స్ ఇచ్చారు. తీరా రషెస్ చూసుకున్న జయంత్ సురేష్ లకు ఏదో తేడా కొట్టేసింది. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి బ్రేక్ ఇచ్చారు.

అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కట్ చేస్తే రచయిత దీనరాజ్ చెప్పిన స్టోరీ బాగుందంటూ సురేష్ బాబు యాడ్ షూటింగ్ లో ఉన్న జయంత్ కు కబురు పెట్టారు. నచ్చింది కానీ హీరో ఇంకొకరి ప్రేమకు హెల్ప్ చేయడం ప్రేక్షకులకు నచ్చదేమోనన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమయింది. చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. పరుచూరి బ్రదర్స్ తో కలిసి కూర్చుని హీరోకి ఫ్యాక్షనిస్ట్ కూతురైన హీరోయిన్ కి ప్రేమకథను సెట్ చేశారు. అందరికీ సంతృప్తిగా అనిపించింది. సూపర్ పోలీస్ కి అచ్చి రాలేదు. ఇప్పుడేమో ప్రాజెక్ట్ ఆగిపోయింది. దానికి తోడు బిజీగా ఉన్నాడు. మళ్ళీ అడిగితే ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దీంతో రెహమాన్ ను డ్రాప్ చేశారు. మ్యూజిక్ కి కోలీవుడ్ నుంచి మహేష్ ని తీసుకొచ్చారు. తర్వాత అది ఎంత గొప్ప నిర్ణయమో ఆడియో రుజువు చేసింది.

విలన్ కోసం చాలా కసరత్తు జరిగింది. తర్జనభర్జనలు, వెతుకులాటల తర్వాత వేషాలు లేక స్వంతూరు వెళ్ళిపోయిన జయప్రకాశ్ రెడ్డికి కబురు వెళ్ళింది. ఆయన అప్పటికే సురేష్ సంస్థలో ప్రేమఖైదీ, బొబ్బిలి రాజా లాంటి బ్లాక్ బస్టర్స్ లో నటించారు. మేకప్ టెస్ట్ లో బ్రహ్మాండంగా పాసయ్యారు. రాయలసీమ యాస కోసం కర్నూలు శ్రీశైలం నంద్యాల తదితర ప్రాంతాలు ఓ రౌండ్ వేసొచ్చారు. ఆయన పక్కన శివుడి పాత్రకు శ్రీహరి ప్రాణం పోశారు. రెండు పాటలు రికార్డింగ్ అయ్యాక మహేష్ కు క్యాన్సర్ వస్తే మిగిలిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ ఇచ్చారు. కర్నూలు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. 1997 మే 9న విడుదలైన ప్రేమించుకుందాం రాను ప్రేక్షకులు మనసారా దగ్గరకు తీసుకున్నారు. శతదినోత్సవాన్ని కానుకగా ఇచ్చి వెంకీకి బెస్ట్ లవ్ క్లాసిక్ ని ఇచ్చారు.