iDreamPost

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన వైస్సార్ పాదయాత్ర

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన వైస్సార్ పాదయాత్ర

ఒక్కసారి వెనక్కి తిరిగి 2004 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచి ఉంటే?అని ఆలోచిస్తే నాడు చంద్రబాబు ఓటమి వెనక ఉన్న కారణాలు అర్ధమవుతాయి…

ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విజన్ 2020 పేరుతో చంద్రబాబు చేసిన ప్రచార ప్రాభవం కావొచ్చు 1500 కోట్లకు పైగా ఖర్చుతో చేసిన “ప్రొఫైల్” నిర్మాణ ప్రభావం కావొచ్చు… 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతాడని చాలా మీడియా సంస్థలు భావించలేదు, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయినట్లే భావించి పోలింగ్ ముగిసిన కౌంటింగ్ గ్యాప్లో అధికారులతో భవిషత్తు కార్యాక్రమాల మీద చర్చలు చేసేవారు…

అన్ని అనుకున్నట్టు జరిగితే ఒక నవీన్ పట్నాయక్,రమణ సింగ్,శివరాజ్ సింగ్ చౌహన్ లాగ వరుస ఎన్నికలు గెలిచి ఉండేవాడు.. మరి బాబు ఊపుకు బ్రేక్ వేసింది ఎవరు?

ముందుగా స్ఫురించేది రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర!…. ఆ పాదయాత్ర 17 ఏళ్ళ కిందట సరిగ్గా ఈరోజే మొదలైంది… వైస్సార్ పాదయాత్రకు అంతటి ఆదరణ రావటానికి కారణాలను విశ్లేషించాలి…

1999 ఎన్నికల వరకు ఒకమేర పాలనలో అణుకువ చూపిన చంద్రబాబు 1999 ఎన్నికల్లో గెలవటంతో తన నాయకత్వానికి ప్రజామోదం లభించిందని భావించటంతో పాలనలో అహంభావపూరిత వైఖరి చూపించాడు.

అభివృద్ది పనులకు నిధుల పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచి ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తీసుకొచ్చారు. ఆ రుణాలను ఏ పథకాలకు వాడుకోవాలనేది కూడా ప్రపంచ బ్యాంకు నిర్దేశించేది. మొదట ఈ విషయాన్ని ప్రజలు పట్టించుకోక పోయినా 2000 సంవత్సరం నాటికి ప్రపంచ బ్యాంక్ షరతుల ప్రభావం ప్రజల మీద చూపటం మొదలైంది.

విద్యార్థుల ఫీజులు ,కరెంట్ చార్జీలు, బస్సు చార్జీలు .. ఇలా ఏ ధరలు పెంచాలన్న ఒక కమిటీ వెయ్యటం.. ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవటం.. ఆ కమిటీ గ్రామసభలు పెట్టటం..ప్రజలు అవును ధరలు పెంచాలని కమిటీకి చెప్పటం… ప్రజలే ధరలు పెంచమంటున్నారు అని చంద్రబాబు వాదించటం .. ఒక తంతులాగా కొనసాగింది… ఒక వైపు వరుస కరువుతో అలమటిస్తున్న రైతులు, నిత్యావసరాల అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ప్రభుత్వ కమిటీల ముందుకు వచ్చి ధరలు పెంచండి అని చెప్పించిన వింత 1999-2002 మధ్య ఉమ్మడి ఆంధ్రాలో జరిగింది.

ధరలు పెరగటం ప్రజలు అష్టకష్టాలపాలయ్యారు, కరువుతో వ్యవసాయం కుంటుపడి రైతులు ఆత్మహత్యలు పెరిగాయి… చంద్రబాబు మాత్రం వీటిని గుర్తించటానికి కూడా ఇష్టపడలేదు.వీటికి తోడు ముఖ్య మంత్రి స్థాయిలో బాబుగారు చేసిన ప్రకటనలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కల్పించాయి.

ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సహాయం చెయ్యండి, నష్టపరిహారం ఇవ్వండి అని అసెంబ్లీలో అడిగిన ప్రతిపక్షానికి “నష్టపరిహారం ఇస్తే ఇతర రైతులు ఆ డబ్బు కోసం ఆత్మహతలు చేసుకోంటారు” అనటం, వ్యవసాయం దండగ అనటం బాబుగారి విధానాల మీద ప్రజలకు స్పష్టత వచ్చింది.

ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వుంది, మరి దాన్ని ఏవిధంగా ఒకతాటి మీదకు తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి? ఈప్రశ్నకు సమాధానంగా కాంగ్రెస్ 9 వామపక్షాలు ఐక్యపోరాటాన్ని మొదలుపెట్టాయి.

అటు ప్రజాసమస్యలు,మరో వైపు కమ్యూనిజం లేదు ,ఏ ఇజం లేదు ఉన్నది టూరిజం అన్న చంద్రబాబు నోటి దురుసు కమ్యూనిస్టులను త్వరగానే కాంగ్రెసుకు దగ్గర చేశాయి. 1999 ఎన్నికల్లో సిపిఐ కి సున్నా స్థానాలు,సీపీఎం కు రెండు స్థానాలు దక్కాయి . ఆ అసెంబ్లీలో సిపిఐని చంద్రబాబు చేసిన అవహేళన ఇప్పుడు సిపిఐ నేతలు నారాయణ, రామకృష్ణలు మర్చిపోయుండొచ్చు కానీ వారి కార్యకర్తలు మర్చిపోలేరు.

మార్పుకు పునాది వేసిన విద్యుత్ ఉద్యమం 
విద్యుత్ చార్జీలు తగ్గించాలని 2000 సంవత్సరం వేసవిలో మొదలైన పోరాటంలో ప్రతిపక్షాలు కొన్ని నెలలపాటు కరెంటు ఆఫీసులను ముట్టడించి దిగ్భంధం చేశాయి. ఆగస్టు నెలలో కాంగ్రెస్ మరియు ముగ్గురు వామపక్ష ఎమ్మెలేలు మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ నాయకత్వంలో 14 రోజులపాటు హైదరాబాదులోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నిరహారదీక్ష చేశారు. అయినా కూడ ప్రభుత్వం దిగిరాలేదు.అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి కనీసం దీక్షాస్థలిని సందర్శించలేదు.

డయాబెటిక్స్ తో నిరాహార దీక్ష కొనసాగించలేక రెండవ రోజు దీక్ష విరమించిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిని చూపించి కాంగ్రెస్ సీనియర్ నేతలే నిరాహార దీక్షను వ్యతిరేకిస్తున్నారని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భద్రాచలం నుంచి గెలిచిన సిపిఎం సున్నం రాజయ్య కు కీటోన్స్ పెరిగి కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు.

ఉద్యమం తీవ్రరూపం దాల్చి ఆగస్టు 28, 2000న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు పిలుపు ఇవ్వగా లక్షల మంది హైదరాబాద్ వచ్చారు,ప్రభుత్వం ఇంతమందిని చూసి కూడ మనసు మార్చుకోకుండ అణిచివేతకు దిగి పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు మరణించారు,కొన్ని పదుల మంది తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసు కాల్పులలో ప్రజలు మరణించినా బాబుగారు అసెంబ్లీలో యదాశక్తిగా వారు “రౌడీ షీటర్లు”, ప్రతిపక్షాలు కుట్రతో రౌడీలను హైదరాబాదుకు తీసుకొచ్చాయి ,వారిని అడ్డుకోవటానికే పోలీసులు కాల్పులు జరిపారు అని ప్రకటించారు. అసవుద్దీన్ ఒవైసి Mr.CM, how do you and your police know that they are rowdy sheeters? Was it written on their foreheads? Are you going to kill all rowdy sheeters those are in Hyderabad? If so start killings from assembly, kill all MLAs who has rowdy sheet on their names…సమాధానం చెప్పలేక బాబు గారు చేష్టలుడిగు కూర్చుండిపోయారు.

కరెంట్ ఉద్యమం తరువాత ప్రతి సమస్య మీద కాంగ్రేస్, వామపక్షాలు ఐక్య పోరాటాలు చేశాయి.ప్రతి ఉద్యమం మీద పోలీసుల దాడి, అంగన్వాడీ కార్యకర్తలను మహిళలు అనికూడా చూడకుండా గుర్రాలతో తొక్కించటం, “గుర్తుతెలియని” వ్యక్తులు ఉద్యమకారుల మీద బ్లేడు దాడులు ఎటు చూసినా దమనకాండ కొనసాగింది .వామపక్షాలు వివిధ సమస్యల మీద కరపత్రాలు , బుక్లెట్లు వెయ్యగా కాంగ్రేసు శ్రేణులు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. వైస్సార్ స్వయంగా కనీసం 25 వామపక్ష సదస్సులకు హాజరయ్యారు,ఎక్కడ విన్నా “ప్రపంచబ్యాకు జీతగాడు చంద్రబాబు మోసగాడు” నినాదం వినిపించేది.

2002 జూలై నెలలో చర్లపల్లి FCI గోడౌన్లను సందర్శించి పనికి ఆహారపథకంలో బాగంగా ప్రజలకు పంచవలసిన బియ్యం మిల్లర్లకు చేరి,కొంత పాలిష్ చేసిన బియ్యం re-cycle FCI కొనుగోలు చేసిన విధానాన్ని బట్టబయలు చేశారు.ఈ సంఘటన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పనికి ఆహార పధకం లబ్ధిధారులు పెద్దయెత్తున పోరాటం చేశారు…దాటవేత సమాధానం చెప్పబోయిన అప్పటి పౌరసరఫరాల మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని “బియ్యం రెడ్డి” అని ప్రతిపక్ష MLAలు నిందించారు.

పోరాట ఉదృతిని పెంచుతు వైస్సార్ 2003 లో 70 రోజుల పాటు ఏప్రిల్-జులై మధ్య 11 జిల్లాల పరిధిలో సుమారు 59 నియోజకవర్గాల్లో 1470 కి.మీ దూరం పాదయాత్ర చేశారు. వైస్సార్ పాదయాత్ర చేసింది కేవలం 59 నియోజకవర్గాల్లో కాని దాని ప్రభావం మొత్తం 294 నియోజకవర్గాల్లో చూపించింది.

వైస్సార్ నాయకత్వానికి ప్రజామోదం .

ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను కన్సాలిడేట్ చేయటంలో వైస్సార్ విజయవంతం అయ్యారు. రోజూ వైఎస్సార్ మీద ఫ్యాక్షన్ నేత,అధికారంలోకి వస్తే రౌడీయిజం పెరుగుతుందని జరిగిన ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. తమ సమస్యలను వినటానికి తమ వద్దకు వచ్చిన వైస్సార్ తో ప్రజలు మమేకం అయ్యారు.

వైఎస్సార్ పాదయాత్ర వస్తుందంటే ఆ ప్రాంతంలో పండగ ఉత్సాహం ఉండేది. మండు వేసవి కావటంతో ప్రతి చోట ప్రజలే పందిళ్లు స్వచ్చందంగా వేసేవారు.

ఆ పాదయాత్ర మొత్తం చాలా సింపులుగా ,రక్షణ పేరుతో ఎలాంటి బారికేడ్స్ లేకుండా ప్రజలకు దగ్గరగా వచ్చే అవకాశం ఇస్తూ పొలాల్లో ,రోడ్డు పక్క నిర్మించిన తాత్కాలిక టెంట్లోనే వైస్సార్ ఉండేవాడు…

యాత్ర సినిమాలోని సన్నివేశాలు …

2004 ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒక సమావేశంలో “నా కోపం నరం తెగిపోయింది” అని వైఎస్సార్ చెప్పాడు. వాస్తవానికి ఆయన కోపం నరం పాదయాత్రతోనే తెగిపోయింది. యాత్ర సినిమాలోని అనసూయ సన్నివేశంలో “గడప తొక్కి సహాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏంటిరా”.. లాంటి డైలాగులు కాంగ్రెస్ నాయకులు వైస్సార్ నోటి నుంచి ప్రత్యక్షంగా విన్నారు. తనను ఇబ్బంది పెట్టిన నేదురుమల్లి, కోట్ల వర్గాలను కలుపుకొని వెళ్ళాడు. టికెట్ల పంపిణీలో కూడా మొత్తం తన వర్గానికే కావాలని పట్టుపట్టకుండా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎన్నికయ్యేలా చూసుకున్నాడు.

అదే యాత్ర సినిమాలో ఒక ఊరిలోకి పాదయాత్ర ను రానీయరు.. ఆలాంటి సన్నివేశాలు ఆ పాదయాత్రలో జరిగాయి. ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద టీడీపీ వర్గం అడ్డుకుంటే ప్రచారం లేకుండా ఊరు దాటి వెళ్ళాడు.. ఇలాంటి ఎన్నో సంఘటనలు ప్రజల్లో ఆయన మీద అనుకూలత పెంచింది.

2002 జనచైతన్యయాత్ర, 2003 ప్రజాప్రస్థానం పాదయాత్ర ,2004 బస్సు యాత్రలలో వైస్సార్ ఎక్కడ తానే ముఖ్యమంత్రిని అని చెప్పలేదు, 2004 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచిన తరువాత ముఖ్యమంత్రి కావటానికి ఒకరిద్దరు చేసిన ప్రయత్నాలను కాంగ్రేస్ అధిష్టానం పట్టించుకోలేదు ..

ఎన్నికలకన్నా ముందే వైస్సార్ ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రి, కాంగ్రేస్ అధిష్టానం నమ్మిన ముఖ్యమంత్రి అభ్యర్ధి!

వైస్సార్ ప్రజలకు నమ్మకం ఇచ్చిన నాయకుడు,అలా ఎదగటానికి 2002,2003, 2004 యాత్రలు ఉపయోగపడ్డాయి. ప్రజల సమస్యలను విన్నాడు కాబట్టే వాటినే ఎన్నికల మానిఫెస్టో తయారు చేశారు.

వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ అన్నప్పుడు బాబుగారు ప్రపంచబ్యాంక్ ఒప్పుకోదు, కొత్త రుణాలు రావన్నా ప్రజలు పట్టించుకోలేదు.చివరికి 2003 చివరిలో “కోటివరాలు” పేరుతో తాయిలాలు ప్రకటించినా ప్రజలు నమ్మలేదు!
వైఎస్సార్ పాదయాత్ర నిజమైన ముగింపు 14-మే-2004 నాడు ఎల్.బి.స్టేడియం లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం చేయటమే!

పాదయాత్ర చేసిన వారందరు ఎన్నికల్లో గెలవలేక పోవచ్చు .కొందరు గెలిచి ఉండొచ్చు కానీ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చిన కీలక ఘట్టం మాత్రం వైస్సార్ పాదయాత్రనే !ఆ పాదయాత్ర సృష్టించిన చరిత్ర మీదనే మీద నేటి రాజకీయాలు నడుస్తున్నాయి…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి