iDreamPost

ఆ రోజు సచిన్‌ విశ్వరూపం చూసిన లోకం! క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఘట్టం

  • Published Feb 24, 2024 | 10:22 AMUpdated Feb 24, 2024 | 10:22 AM

Sachin Tendulkar Double Century: సాక్ష్యాత్తు క్రికెట్‌ దేవుడే దిగి వచ్చి ఆ చరిత్ర సృష్టించేంత వరకు.. అలాంటి ఆట ఆడొచ్చని, ఆ రికార్డు సాధించవచ్చని మరె క్రికెటర్‌ కలలో కూడా అనుకోని ఉండడు. అలాంటి అరుదైన ఘట్టం జరిగి నేటితో 14 ఏళ్లు. మరోసారి ఆ క్రికెట్‌ దేవుడి విశ్వరూపం గురించి తెలుసుకుందాం..

Sachin Tendulkar Double Century: సాక్ష్యాత్తు క్రికెట్‌ దేవుడే దిగి వచ్చి ఆ చరిత్ర సృష్టించేంత వరకు.. అలాంటి ఆట ఆడొచ్చని, ఆ రికార్డు సాధించవచ్చని మరె క్రికెటర్‌ కలలో కూడా అనుకోని ఉండడు. అలాంటి అరుదైన ఘట్టం జరిగి నేటితో 14 ఏళ్లు. మరోసారి ఆ క్రికెట్‌ దేవుడి విశ్వరూపం గురించి తెలుసుకుందాం..

  • Published Feb 24, 2024 | 10:22 AMUpdated Feb 24, 2024 | 10:22 AM
ఆ రోజు సచిన్‌ విశ్వరూపం చూసిన లోకం! క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఘట్టం

సచిన్‌ టెండూల్కర్‌.. క్రికెట్‌ ఒక మతమైతే దానికి దేవుడు అతనే. రెండు దశాబ్దాలకు పైగా బ్యాట్‌ పట్టి క్రికెట్‌ను శాసించిన వీరుడు. టన్నుల కొద్ది పరుగులు.. లెక్కలేనన్ని రికార్డులు.. చెప్పుకుంటూ పోతే జీవితకాలం సరిపోని చరిత్ర సచిన్‌ సొంతం. 100 కోట్ల జనాభా ఉన్న ఒక పెద్ద దేశాన్ని క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోయేలా చేసిన ఒక మాయాజాలం పేరే సచిన్‌. కేవలం అతని ఆటను చూసేందుకు మాత్రమే స్టేడియానికి జనం వచ్చేవారంటే, సచిన్‌ అవుట్‌ కాగానే టీవీలు కట్టేసేవారంటే ఇప్పటి తరం వారు నమ్ముతారో లేదో కానీ.. అలాంటి దృశ్యాలు ఓ తరానికి జీవితకాల జ్ఞాపకాలు. సచిన్‌ అంటే ఓ గొప్ప క్రికెటరే కాదు.. ప్రపంచ క్రికెట్‌కు ముఖచిత్రంగా నిలిచి ఓ లెజెండ్‌. ప్రస్తుతం భూమిపై తిరుగుతున్న.. క్రికెట్‌ దేవుడు. అలాంటి సచిన్‌ ఓ 14 ఏళ్ల క్రితం క్రికెట్‌ చరిత్రలో అంతకు ముందు కనీవినీ ఎరుగని ఓ అద్భుతం సృష్టించాడు. క్రికెట్‌ లోకానికి తన విశ్వరూపం చూపిస్తూ.. ఆ మహాద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించాడు. ఆ రోజును మరోసారి స్మరించుకుంటూ.. సచిన్‌ మాయాజాలంలో మునిగిపోదాం రండీ..

2010 ఫిబ్రవరి 24.. గ్వాలియర్‌ వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ 9 పరుగులు మాత్రమే చేసి.. పార్నెల్‌ బౌలింగ్‌లో స్టెయిన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అనూహ్యంగా వన్‌డౌన్‌లో దినేశ్‌ కార్తీక్‌ రావడంతో.. సచిన్ అతనితో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 194 పరుగుల భారీ పార్ట్నర్‌షిప్‌ నమోదు చేశారు. 79 పరుగులు చేసిన కార్తీక్‌ 34వ ఓవర్‌లో అవుట్‌ అయ్యాడు. తర్వాత యూసుఫ్‌ పఠాన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. అతను కూడా 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 36 పరుగుల చిన్న క్యామినో ఆడాడు. 42వ ఓవర్‌లో పఠాన్‌​ అవుట్‌ అయిన తర్వాత ధోని బ్యాటింగ్‌కి వచ్చాడు. అప్పటికే సచిన్‌ సెంచరీ పూర్తి చేసుకుని.. చరిత్ర సృష్టించేందుకు దూసుకెళ్తున్నాడు. టీమిండియా స్కోర్‌ కూడా అప్పటికే 300 దాటింది.

కానీ, క్రీజ్‌లోకి వచ్చిన ధోని కూడా సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సులతో అలరిస్తున్నాడు. కానీ, భారత క్రికెట్‌ అభిమానులకు మాత్రం కోపం వస్తోంది. ఎందుకంటే.. మరో ఎండ్‌లో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌.. డబుల్‌ సెంచరీకి దగ్గర్లో ఉన్నాడు. అలాంటి టైమ్‌లో సచిన్‌కి స్ట్రైక్‌ ఇవ్వకుండా.. ధోనినే బ్యాటింగ్‌లో రఫ్ఫాడిస్తున్నాడు. ధోని బ్యాటింగ్‌తో పరుగులు వస్తున్నా.. అందరికి కావాల్సింది మాత్రం సచిన్‌ డబుల్‌ సెంచరీ. ఆ అరుదైన ఘట్టానికి సచిన్‌ దగ్గరగా వస్తున్న క్రమంలో.. క్రికెట్‌ అభిమానులతో పాటు.. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న భారత క్రికెటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే.. అంతకు ముందెన్నడు వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏ బ్యాటర్‌ కూడా డబుల్‌ సెంచరీ కొట్టలేదు. డబుల్‌ సెంచరీ అంటే టెస్టు క్రికెట్టే.. వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప. అలాంటిది సచిన్‌ ఆ చరిత్రను మార్చడానికి మరింత దగ్గరయ్యాడు.

అందరిలో నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్కో పరుగుకు స్టేడియం మారుమోగిపోతోంది. మ్యాచ్‌ చూస్తున్న వారంతా..  సీట్‌ ఎడ్జ్‌కి వచ్చేశారు. చాలా మంది సచిన్‌ 190ల్లోకి ప్రవేశించిన వెంటనే ఇక సీట్‌లో కూర్చోలేక లేచినిల్చున్నారు. చూస్తుండగానే.. ఆ ఘటియా రానే వచ్చింది. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో పాయింట్‌ దిశగా ఆడి సింగిల్‌ తీసి సచిన్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. 147 బంతుల్లోనే 25 ఫోర్లు, 3 సిక్సులతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సచిన్‌ డబుల్‌ సెంచరీ సాధించిన సమయంలో ‘ది ఫస్ట్‌ మ్యాన్‌ ఆన్‌ ద ప్లానెట్‌ టూ రీచ్‌ టూ హండ్రెడ్‌ అండ్‌ ఇట్స్‌ ది సూపర్‌ మ్యాన్‌ ఫ్రమ్‌ ఇండియా సచిన్‌ టెండూల్కర్స్‌ 200 ఫ్రంమ్‌ 147. టేక్‌ ఏ బౌవ్‌ మాస్టర్‌’ అంటూ ప్రముఖ కామెంటేటర్‌ రవిశాస్త్రి చెప్పిన మాటలు ఇప్పటికీ సచిన్‌ అభిమానుల్లో చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.

డబుల్‌ సెంచరీ చేసిన తర్వాత సచిన్‌ అలా హెల్మెట్‌ తీసి.. చెమటతో తడిసిన జుట్టుతో.. బ్యాట్‌ ఒక చేత్తో, హెల్మెట్‌ ఒక చేత్తో పట్టుకుని ఆకాశానికేసి చూసే ఐకానిక్‌ విజువల్స్‌.. క్రికెట్‌ అభిమానుల గుండెల్లో అలా నిలిచిపోయాయి. క్రికెట్‌ చరిత్రలో మొట్టమొదటి డబుల్‌ సెంచరీని సచిన్‌ భారతీయులందరికీ అంకితం ఇవ్వడం విశేషం. సచిన్‌ సాధించి చూపించిన తర్వాత.. సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ, మార్టిన్‌ గప్టిల్‌, క్రిస్‌ గేల్‌, మ్యాక్స్‌వెల్‌, ఇషాన్‌ కిషన్‌ ఇలా చాలా మంది క్రికెటర్లు డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. కానీ, సచిన్‌ కంటే ముందు కనీసం ఏ బ్యాటర్‌ కూడా వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేయొచ్చని కలలో కూడా అనుకోని ఉండారు. ఎవరూ సాధించలేనిది సాధించాడు కాబట్టే.. సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌ క్రికెట్‌ లోకానికి దేవుడైయ్యాడు. మరి సచిన్‌ డబుల్‌ సెంచరీ చేసి నేటికి 14 ఏళ్లు పూర్తి అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి