iDreamPost

ధోనీపై మరోసారి ధ్వజమెత్తిన యువరాజ్ సింగ్ తండ్రి…

ధోనీపై మరోసారి ధ్వజమెత్తిన యువరాజ్ సింగ్ తండ్రి…

భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ జార్ఖండ్ డైనమెట్ ఎంఎస్ ధోనీపై మరోసారి విమర్శలు గుప్పించాడు.కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ తరహాలో తనకి ధోనీ, విరాట్ కోహ్లీ నుంచి సపోర్ట్ లభించలేదని ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ చెప్పినప్పటి నుండి యోగరాజ్ ధోనీపై విమర్శలతో చెలరేగి పోతున్నాడు. గత రెండు రోజుల క్రితం టీమిండియాకి ధోనీ బదులు యువరాజ్ సింగ్ కెప్టెన్ కావాల్సిందని వెల్లడించి సంచలనం రేపాడు.

తాజాగా మరోసారి ధోని గురించి యోగరాజ్ మాట్లాడుతూ ” నేను అతనిని అడగాలనుకుంటున్నాను, అతను భారతదేశం కోసం చాలా సంవత్సరాలు ఆడాడు. కానీ అతను ఏ క్రికెటర్ కోసం ఏమి చేసాడు…? అతను ఇతర క్రికెటర్ల కోసం ఏదైనా చేసి ఉంటే క్రికెటర్లు అతనిని ప్రశంసించేవారు.అయితే సౌరవ్ గంగూలీ కూడా కేవలం తన గురించే ఆలోచించుకుని ఉంటే అతని గణాంకాలు చాలా బాగుండేవి.అతను తన వ్యక్తిగత ప్రయోజనాల గురించి కంటే దేశం,అలాగే జట్టు సభ్యుల గురించి ఆలోచించాడు” అని ధ్వజమెత్తాడు.

ఇంకా ధోని రిటైర్మెంట్ గురించి యోగరాజ్ మాట్లాడుతూ “తన పదవీ విరమణ గురించి ధోని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకడు. అతను సాధించినది అతని గొప్పతనాన్ని చూపుతాయి. అతని అభిమానవాదం భారతదేశంలో ఇప్పటికీ ఉంది. ఎవరైతే ఉన్నతాధికారుల బూట్లు నాకుతూ వారితో మంచి సంబంధాలు కలిగి ఉంటారో అప్పటి వరకు మీయొక్క కోరికలు నెరవేరుతాయి. అలాగే ధోని ఎక్కువ ఆడాలనుకుంటున్నారా లేదా అనేది సెలెక్టర్లు మరియు బోర్డు ఏమనుకుంటున్నారో దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. అతను కోరుకుంటే తిరిగి జట్టులోకి వస్తాడు,అతను కోరుకోకపోతే అతను తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో ధోని భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ధోని భారత్ తరఫున చివరిసారి మైదానంలో కనిపించాడు. అప్పటి నుండి తొమ్మిది నెలలుగా మిస్టర్ కూల్ క్రికెట్‌కు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఐపిఎల్ 2020 కోసం అతను చెన్నై సూపర్ కింగ్స్ కొరకు గత మార్చిలో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.ఐపీఎల్ టోర్నీలో రాణించి ఐసిసి టీ-20 ప్రపంచ కప్ జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని కోరుకున్నాడు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐపిఎల్ 2020 నిరవధికంగా వాయిదా పడటంతో భారత జట్టులో ధోని స్థానం ప్రశ్నార్థకంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి