iDreamPost

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం.. రాజకీయ ప్రత్యర్థులపై సీఎం జగన్ ఫైర్

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం.. రాజకీయ ప్రత్యర్థులపై సీఎం జగన్ ఫైర్

తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మంచి చేయడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. పేదలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, ఎల్లో మీడియా, ఎల్లో దత్తపుత్రుడు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ఒంగోలులో అమలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. వివిధ సామాజికవర్గాల్లోని పేదలకు తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించిన సీఎం జగన్‌.. అదే సమయంలో ఆయా పథకాలపై ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టారు.

” తొలి ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1258 కోట్లు చెల్లించాం. రెండో ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1096 కోట్లు చెల్లించాం. వరుసగా మూడో ఏడాది రూ. 1261 కోట్లు చెల్లిస్తున్నామని అన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.3165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు చెల్లించాం. కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగింది. గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని గత ప్రభుత్వం ఆలోచించలేదు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నాం.

మన ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల సంఖ్య 80 లక్షల నుంచి కోటీ 2 లక్షలకు పెరిగింది. అక్కచెల్లెమ్మలను అప్పుల ఊబిలోంచి బయటకు లాగాం. పొదుపు సంఘాల సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం. టీడీపీ హయాంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. మన హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. రూ.2500 అవ్వాతాత చేతుల్లో పెడుతున్నాం.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద ఏటా రూ.2వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసిన ప్రభుత్వం మనది. వైఎస్సార్‌ చేయూతతో రూ.9,180 కోట్లు చెల్లించాం. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద రూ.589 కోట్లు చెల్లించాం. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నాలుగింట ఒకవంతు మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం.

చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదు. జగనన్న విద్యాదీవెనలో 21.55లక్షల మందికి సాయం చేశాం. పిల్లల చదువులకు పూర్తి పీజు రీఎంబర్స్‌మెంట్‌ చేశాం. జగనన్న విద్యాదీవెనలో రూ.6,966 కోట్లు ఇచ్చాం. పాతబకాయిలను కూడా మనమే తీర్చాం.

సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాం. ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగింది. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు. మీ ఇబ్బందులే నా ఇబ్బందులుగా భావించాను.

ఇంత మంచి జరుగుతున్నా కూడా బాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోంది. దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఏబీఎన్‌, రామోజీరావు, టీవీ5. ఉచితంలో ఆర్థిక విధ్వంసం అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. ఏపీని మరో శ్రీలంకగా మారుస్తున్నారని అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకాలను ఆపేయాలని టీడీపీ నేతలు అంటున్నారు. పేదలకు మంచి చేయొద్దని అంటున్నారు. ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో మనం యుద్ధం చేస్తున్నాం.

అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే అక్కచెల్లెమ్మల విజయగాథ ఇది. ప్రభుత్వంపై నమ్మకమున్న అక్కచెల్లెమ్మల విజయగాథ ఇది. మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉంది. మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచింది. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టింది..” అని సీఎం జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి