iDreamPost
android-app
ios-app

ఎస్‌ఐని అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌!

ఎస్‌ఐని అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కూనవరం పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కూనవరం ఎస్‌ఐ వెంకటేష్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయనకు మెడల్‌ కూడా ఇవ్వాలని అన్నారు. ముఖ్యమంత్రి ఎస్‌ఐని ఎందుకు ప్రశంసించారంటే.. వరదలు వచ్చినపుడు ఎస్‌ఐ వెంకటేష్‌ ఎంతో చాకచక్యంగా రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. ఎంతో నేర్పుతో దాదాపు 5 వేల మంది స్థానికుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. నాటు పడవ వేసుకుని వెళ్లి మరీ జనాల్ని కాపాడారు.

దాదాపు వారం రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్నారు. అక్కడి ప్రజలకు సేవలు చేశారు. ఈ విషయాన్ని కూనవరం వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు స్థానికులు చెప్పారు. దీంతో వైఎస్‌ జగన్‌ ఎంతో సంతోషించారు. ఎస్‌ఐ వెంకటేషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. శభాష్‌ అంటూ ప్రశంసించారు. ఆగస్టు 15న మెడల్‌ సైతం ఇవ్వాలని, ఆ లిస్టులో పేరు కచ్చితంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా, వరదలు, వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు కూడా అందిస్తోంది.

అంతేకాదు! వరద నీరు ఇళ్లలోకి వచ్చిన కుటుంబాలకు కూడా 2 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. నిన్న వరద బాధితులను సీఎం జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ తాపత్రయమన్నారు. ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించామని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి, వరదల నేపథ్యంలోనే ప్రజలకు సేవలు చేసిన ఎస్‌ఐ వెంకటేష్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.