iDreamPost

రాజకీయాలకు దేవుడిని సైతం వదలని ఎల్లో మీడియా

రాజకీయాలకు దేవుడిని సైతం వదలని ఎల్లో మీడియా

ఇన్ని వార్తా పత్రికలు, వాటిలో అధికార పార్టీకి చెందింది ఒకటి; పదుల సంఖ్యలో టీవీ ఛానెళ్ళు, వాటిలోనూ అధికార పార్టీకి చెందింది ఒకటి; లెక్కకు మించి వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్ళు, అన్నిటికి మించి దాదాపు ప్రతీ ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉన్న రోజులివి. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలతో పాటు వాటి పూర్వోత్తరాలను సైతం పది నిముషాల్లో ఇంటర్నెట్ ద్వారా కనుక్కోగల వెసులుబాటు ప్రతీ వ్యక్తికి ఉంది. అంత సమాచారం అందరికీ అందుబాటులో ఉండే ప్రస్తుత పరిస్థితుల్లోనే ఇలా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారంటే కేవలం ఒక వర్గం మీడియా ఏకఛత్రాధిపత్యంగా ఉన్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

ఒక వర్గం మీడియా నిన్న ‘తిరుమల తిరుపతి దేవస్థానం'(టీటీడీ) వారి ఆస్తుల వేలం అనేది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా తీసుకున్న నిర్ణయమన్నట్టు పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ చేశారు. 1974 నుంచి 2014 దాకా టీటీడీ వారు వేలంలోనే 120 కు పైగా ఆస్తుల్ని వేలంలో అమ్మినట్టు; గత ప్రభుత్వ హయాంలోనే పక్క రాష్ట్రాల్లో ఉన్న టీటీడీకి చెందిన ఆస్తుల్ని వేలమేసి అమ్మాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు లోపలి పేజీల్లో ప్రచురించారు. ఈ టీటీడీ ఆస్తుల వేలం అనేది దాదాపు యాభై ఏళ్ళుగా ఉన్న ప్రక్రియ అనే విషయం భావితరాలకు ఎక్కడా తెలియకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తపడ్డారు.

Also Read: ఏడాదిలోనే సి.ఎం జగన్ పై ఇన్ని మతతత్వ దాడులా?

ఒక వైపు దశాబ్దాల చరిత్ర కలిగిన జాతీయ మీడియా ఒకటి ‘టీటీడీ నిరర్ధక ఆస్తుల వేలం కొత్తగా తీసుకున్న నిర్ణయమేమి కాద’ని ఈ వార్తకు సంబంధించిన శీర్షికలోనే పెట్టింది. మరో జాతీయ మీడియా 2002 నుంచి 2020 వరకు టీటీడీ అమ్మిన 42 ఆస్తులకు సంబంధించిన విషయం గురించి ప్రత్యేక వార్త కూడా ఇచ్చింది. ఆ వార్త ప్రకారం – చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2002 జులైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులు అమ్మేందుకు కొత్త నిబంధనలతో కూడిన జీవో (నెంబర్ 405) కూడా విడుదల చేసింది. ఆ జీవోను పక్కన పెట్టవలసిందిగా హై కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ అయినప్పటికీ టీటీడీ మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 28, తమిళనాడులో 10, కర్ణాటకలో 4 ఆస్తుల్ని అమ్మేశారు. అప్పటి తిరుమల ఆలయ న్యాయ అధికారి ఈ విషయం పై స్పందిస్తూ “ఇవి టీటీడీకి చెందిన ఆస్తులు, వీటిని అమ్మడానికి కోర్టు అనుమతి అవసరం లేదు” అన్నారని ఆ వార్తలోనే పేర్కొంది. మన తెలుగు మీడియా వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం జల్లుతుంటే – జాతీయ స్థాయిలోని ఆంగ్ల మీడియా తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన ఘనకార్యాలన్నీ బట్టబయలు చేస్తోంది. బహుశా ఈ ఆంగ్ల పత్రికల ద్వారా చంద్రబాబు గారి పనికిమాలిన పాలనకు సంబంధించిన చరిత్ర మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల వరకు ఎక్కడ చేరిపోతుందోనని కాబోలు – వారిని ఏకంగా ఆంగ్ల మాధ్యమానికే దూరం పెట్టాలని తెలుగుదేశం వారు చూస్తున్నట్టున్నారు.

తాము ఏది పడితే అది రాస్తే నమ్మేసే గత పరిస్థితి ఇప్పుడు లేదని కొన్ని పత్రికల యాజమాన్యాలు ఇకనైనా తెలుసుకోవాలి. తమ ‘చదువు’ను మెయిన్ పేజిలోని హెడ్ లైన్స్ కే పరిమితం చేయకుండా – లోపలి పేజీల్లోని వార్తల్లో చిన చిన్న అక్షరాల్లో ఉండే వివరాలు కూడా చదివే వారు, నిజానికీ అందులోనే అసలు మర్మం దాగుంటుందని నమ్మేవారు పెరిగారన్న విషయం ఇంకా ‘ఎల్లో మీడియా’కు బోధపడినట్టులేదు. ఒక వర్గం మీడియా తమ వ్యాపార ప్రయోజనాలకు ఏ మాత్రం అనుకూలంగా ఉండని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తుందో చెప్పేందుకు వారి నిన్నటి అనవసర రాద్ధాంతమే ఉదాహరణ. ఇంత నిస్సిగ్గుగా నిజాల్ని దాస్తూ, అనవసరంగా ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నాలు చేస్తుంటారు కనుకనే వైఎస్ జగన్ ఎన్నికల ముందు “మన పోరాటం తెదేపా మీద మాత్రమే కాదు, ఎల్లో మీడియా మీద కూడా” అని ప్రజలకు పిలుపునిచ్చారు.

వైఎస్ జగన్ క్రైస్తవమతాన్ని ఆచరిస్తాడు కనుక తిరుమలలో పాలక మండలి తీసుకునే ప్రతీ నిర్ణయానికి మతం రంగు పులిమి, దాని ద్వారా రాజకీయలబ్ధి పొందాలని చూసే రాజకీయపార్టీల కుట్రకు ఒక వర్గం మీడియా కూడా తమ వంతు సాయం చేస్తుండటం పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని అర్ధం చేసుకోవచ్చు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఏడుకొండల గురించి తాను అనని మాటను అన్నట్టుగా ప్రచారం చేసి/ఇప్పటికీ చేస్తూ వైఎస్సార్ కుటుంబం మీద మతముద్రను వేసేందుకు విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రచారాల్ని నమ్మేవారు/ వారి కంటే ఎక్కువగా అది నమ్మించాలని చూసేవారు “ఏడుకొండల వాడి జోలికి వెళితే…” అంటూ మరో కొత్త పాట అందుకుంటారు. నిజానికీ వారి నమ్మకమే నిజమైతే ఈ రోజుకీ వైఎస్సార్ జనం గుండెలో నిలిచిపోయుండడు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని ఘనవిజయాన్ని వైఎస్ జగన్ కు చేకూర్చేవారు కాదు.

ఏది ఏమైనా – 1974 నుంచి 2014 వరకు నలభై ఏళ్ళలో జరిగిన 129 ఆస్తుల విక్రయానికి సంబంధించిన వివరాలు; 2016లో ‘తిరుమల తిరుపతి దేవస్థానం'(తితిదే)కు చెందిన వివిధ ప్రాంతాల్లోని 50 ఆస్తుల్ని ఏ ప్రాతిపదికన నిరర్ధకమైనవిగా గుర్తించారు; వాటిని అప్పుడు విక్రయించాలని ఎందుకు నిర్ణయించారు ? తదితర వివరాలపై తితిదే బోర్డు ఒక ప్రకటన విడుదల చేయాలి. ఇది ఎప్పటినుంచో ఉన్న ప్రక్రియ అనే విషయం జనానికి అర్ధమయ్యేలా చెప్పాలి. అలాగే గతంలో అమ్ముడుపోయిన తితిదే ఆస్తులు కొన్న వాళ్ళ జాబితాను కూడా తితిదే అధికార వెబ్సైట్లో బహిరంగపరచాల్సిన అవసరముందనిపిస్తోంది. సాక్షి మీడియా ఈ విషయంలో చొరవ చూపి గతంలో వేలంలో అమ్ముడుపోయిన ఆ 120కు పైగా స్థలాల్లో ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఏ కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయాల్ని వెలికితీసి ప్రతీరోజు ప్రసారం చేయాలి. అలాగే గత ప్రభుత్వంలో భూములు అమ్మాలన్న నిర్ణయం తీసుకున్న సమావేశంలో పాల్గొన్న పాలకమండలి సభ్యులు, అప్పుడు మౌనంగా ఉన్న మాజీ దేవాదాయశాఖ మంత్రి ప్రస్తుతం ఎందుకు ఇప్పుడు రాజకీయాలు చేయాలని చూస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి