iDreamPost

సీమ కక్షల్లో ప్రేమ యజ్ఞం – Nostalgia

సీమ కక్షల్లో ప్రేమ యజ్ఞం – Nostalgia

విలన్ గా బలమైన ముద్ర వేశాక హీరోగా ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. హీరోలు విలన్ గా చేస్తే మార్పు అనుకోవచ్చు కానీ ప్రతినాయకులను రివర్స్ లో చూపిస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నవరసనటనా సార్వభౌమగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ ట్రెండ్ ని మార్చి చూపించారు. అల్లుడుగారుతో మొదలుపెట్టి దశాబ్దం పైగా సోలో హీరోగా బలమైన మార్కెట్ ని ఏర్పరుచుకున్నారు. అలా మరో చెప్పుకోదగ్గ ఉదాహరణ గోపీచంద్. సుప్రసిద్ధ అభ్యుదయ చిత్రాల దర్శకుడు టి కృష్ణ వారసుడిగా వచ్చిన ఈ పవర్ హౌస్ ప్రయాణం ఆసక్తికరం.

2001లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ‘తొలివలపు’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. తనను హీరోగా జనం యాక్సెప్ట్ చేయలేదని గుర్తించిన ఇతను ముందు నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని ఒక ఛాలెంజ్ గా జయం, నిజం, వర్షంలో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం తన కెరీర్ లో గొప్ప ఘట్టం. వాటిలో హీరోలను సైతం డామినేట్ చేసే స్థాయిలో గోపీచంద్ చూపించిన ఎనర్జీ ఇండస్ట్రీనే కాదు ప్రేక్షకులనూ ఆశ్చర్యపరిచింది. దాంతో ఈతరం ఫిలింస్ పోకూరి బాబురావుకి గోపిచంద్ ని మళ్ళీ హీరోగా రీ లాంచ్ చేయాలనే ఆలోచన కలిగింది. అదే సమయంలో దర్శకుడు ఎఎస్ రవికుమార్ రెడ్డి చెప్పిన లైన్ ఒకటి బాగా నచ్చింది.

ఫ్యాక్షన్ లీడర్ రెడ్డెప్పకు నమ్మిన బంటుగా ప్రాణాలకు తెగించి మరీ కాపాడే శీను అతని కూతుర్నే ప్రేమిస్తాడు. విషయం తెలిసిన దొర వాడిని చంపబోతాడు. దీంతో తనకు మానసిచ్చిన శైలు(మూన్ బెనర్జీ)ని తీసుకుని శీను సిటీకి పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్న పరిణామాలను రవికుమార్ ఆసక్తికరంగా మలుచుకున్నారు. ,మరుధూరి రాజా సంభాషణలు, మణిశర్మ సంగీతం యజ్ఞంకు అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా గోపీచంద్ నటన మాస్ కి పిచ్చగా నచ్చేసింది. తమకో కొత్త హీరో దొరికాడని సంబరపడ్డారు. 2004 జులై 2న విడుదలైన యజ్ఞం సూపర్ హిట్ కొట్టేసి వంద రోజులు పూర్తి చేసుకుంది. దేవరాజ్, ధర్మవరపు, విజయరంగరాజు, ప్రకాష్ రాజ్, రఘుబాబు, సుమన్ శెట్టి తదితరుల క్యాస్టింగ్ యజ్ఞం స్థాయిని మరింత పెంచింది. అక్కడినుంచి గోపిచంద్ కు వెనక్కు చూసుకోవాల్సిన అవసరమే పడలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి