iDreamPost

2022 Sankranthi Releases : థియేటర్ల సర్దుబాటు జరిగే పనేనా

2022 Sankranthi Releases : థియేటర్ల సర్దుబాటు జరిగే పనేనా

2022 సంక్రాంతికి ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమాలన్నీ మాట మీదే ఉంటే కనక టాలీవుడ్ హిస్టరీలోనే ఇది అతి పెద్ద సీజన్ గా మారినా ఆశ్చర్యం లేదు. రెండు పాన్ ఇండియా సినిమాలు, ఒక పవన్ కళ్యాణ్ మూవీ, అజిత్ డబ్బింగ్ చిత్రం, నాగార్జున ఎంటర్ టైనర్ ఇలా ఇన్నేసి పోటీ పడితే థియేటర్ల సమస్య రాదా అంటే ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఎవరూ వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. జనవరి 12 నుంచి తప్పుకుంటుందేమో అని భావిస్తున్న భీమ్లా నాయక్ వెనక్కు వెళ్లడం లేదు. ఇవాళ రానా బర్త్ పోస్టర్ లో కూడా టీమ్ మళ్ళీ విడుదల తేదీని ధృవీకరించింది. సాయంత్రం రాబోయే వీడియో అప్డేట్లోనూ ఇదే ఉంటుంది తప్ప మారదు.

రాధే శ్యామ్ 14కి ఫిక్స్ చేసుకుని ఆల్రెడీ థియేటర్లను లాక్ చేసుకునే పనిలో పడింది. నార్త్ లోనూ స్క్రీన్లను భారీగా కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దర్శకుడు రాధా కృష్ణ హీరో హీరోయిన్ల కంటే ముందుగానే ప్రమోషన్ ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. ఇక అందరికంటే ముందు జనవరి 7 రాబోతున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూడు వారాలకు థియేటర్ ఒప్పందాలు చేసుకుంటోందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇవి చాలదన్నట్టు నాగార్జున బంగార్రాజు కూడా రేస్ లో ఉందట. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ అన్నపూర్ణ టీమ్ మాత్రం నాన్ స్టాప్ గా పబ్లిసిటీ చేస్తూ లిరికల్ వీడియోలను రిలీజ్ చేస్తోంది.

వీటికే డిస్ట్రిబ్యూటర్లు కిందా మీదా పడుతుంటే అజిత్ వలిమై కూడా పొంగల్ కే వస్తోంది. 10 నుంచి 14 తేదీల మధ్యలో ఉండొచ్చు. తమిళనాడులో అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయట. అజిత్ కు తెలుగులో మరీ భారీ మార్కెట్ బిజినెస్ ఆశించలేం కానీ ఎంతో కొంత శాతం థియేటర్లు దానికీ పంచాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా డ్రాప్ అవుతారేమో అని ఎదురు చూస్తున్న పంపిణీదారులు ఆశలు ప్రస్తుతానికి నెరవేరే సూచనలు కనిపించడం లేదు. మరీ ఇంత కాంపిటీషన్ అయితే వసూళ్ల మీద ప్రభావం పడుతుందని, కొంత గ్యాప్ ఉంటే నిర్మాతలతో పాటు తమకూ లాభాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో

Also Read : Pahuna : ప్రణయ్ అమృతల నేపాలీ Pahuna

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి