iDreamPost

మరీ ఇంత దారుణమా పవన్‌..?

మరీ ఇంత దారుణమా పవన్‌..?

రోజుల వ్యవధిలో ఎంత తేడా..? నిన్న మొన్నటి వరకు ఒకరికి ఒకరంటే ప్రాణం. కలసి ఉన్నా.. విడిగా ఉన్నా.. ఒకరిపై మరొకరు ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. ఒకరు మునుపటిలాగే ఉన్నారు. కానీ మరొకరు పూర్తిగా మారిపోయారు. ఎంతలా అంటే.. ఇంత దారుణమా..? అనేలాగ. సినిమాల్లో మాదిరిగా నిమిషాల్లో మనుషుల మధ్య స్నేహాలు మాయమైపోయేలాగా.. ఇంతకూ వారెవరో కాదు.. నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పవన్‌ గురించే ముచ్చటించుకుంటున్నారు.

నిన్న విశాఖ ఎయిర్‌పోర్టులో ఉత్తరాంధ్ర వాసులు చంద్రబాబును అడ్డుకున్నారు. మనుషులు తీసుకొచ్చి వైఎస్సార్‌సీపీ వారే ఇదంతా చేయించారని టీడీపీ ఆరోపించింది. ఏది ఏమైనా బాబుకు ఘోర పరాభవం జరిగింది. టీడీపీ నేతలు భగ్గుమన్నారు. చివరకు కోర్టుకెక్కారు కూడా. కానీ ఒకప్పటి తన మిత్రుడు పవన్‌ కళ్యాణ్‌ స్పందించలేదని టీడీపీ శ్రేణులు తెగ బాధపడిపోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ను చంద్రబాబు నెత్తిపెట్టుకుని చూసుకున్నారని, పవన్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా పక్కన పెట్టారనీ అయినా.. పవన్‌ కళ్యాణ్‌ కనీసం విశ్వాసం చూపించలేదంటున్నారు.

2014 ఎన్నికలకు ముందు నుంచి చంద్రబాబు, పవన్‌ మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం మాటల్లో వర్ణించలేనిది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిపోయి పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించేవారు. ఏం.. సమస్యలు పరిష్కరించాలంటే అధికారమే కావాలా అంటూ వితండవాదం చేసేవారు. చంద్రబాబుకు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన వాలిపోయేవారు. బాబుపై ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా సరే.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు లేవు. అలాంటి పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఒకప్పటి పార్టనర్‌కు ఇంత అవమానం జరిగితే.. కనీసం ఖండిస్తూ నోట్‌ కూడా విడుదల చేయలేదు.

పవన్‌ మౌనం వెనుక బీజేపీతో పొత్తే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీతో పొత్తుకు ముందు పవన్‌ వ్యవహార శైలికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోందట. అమరావతిపై గతంలో మాదిరిగా స్పందించడంలేదు. ఏ విషయమైన ఆచితూచి స్పందిస్తున్నారని ఇటీవల అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను గమనిస్తే అర్థమవుతోంది. ఏమైనా దాదాపు ఆరేళ్లుగా తమకు నమ్మకమైన మిత్రుడు నుంచి కనీసం స్పందన లేకపోవడంతో చంద్రబాబుకు ఫీల్‌ అయ్యే ఉంటారని పరిశీలకులు ఊహిస్తున్నారు. ఇటీవల అమరావతిలో ముళ్ల కంచె వేసి పవన్‌ను పోలీసులు అడ్డుకున్నప్పుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు పవన్‌కు బాసటగా వచ్చారు. కనీసం అది గుర్తు చేసుకునైనా పవన్‌ స్పందించాల్సిందని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.

Read Also : ఏపీలో వేట మొదలవబోతోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి