iDreamPost

నాడు వై.యస్ పై, నేడు జగన్ పై – అదే తరహ దాడి

నాడు వై.యస్ పై, నేడు జగన్ పై – అదే తరహ దాడి

2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన వై.యస్ జగన్ గతంలో ఎప్పుడు లేనంతగా మతతత్వ శక్తులనుండి దాడులని ఎదుర్కుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై మతతత్వ శక్తుల పేరున దాడులకు పాల్పడుతుంది తెలుగుదేశం , జనసేన, బిజేపి లాంటి ప్రతిపక్ష శక్తులు అనేది సుస్పష్టం. ప్రజాభిమానం లో వెనకబడిన ఈ ప్రతిపక్ష పార్టీలు తమూ రాజకీయంగా లబ్దిపొందాలి అంటే అభూత కల్పనలను సృష్టించి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి మతతత్వ దాడులకు పాల్పడటమే తాము నిర్ధేసించుకున్న లక్ష్యంగా వారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే అర్ధం అవుతుంది.

జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుండే తాను మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగానే అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ , ఏడాదిలోనే అనేక సంక్షేమ పదకాలు అమలు చేసి రాష్ట్రంలో ఇప్పటికే నేరుగా 3 కోట్ల 50 లక్షల మందికి లబ్ది చేకూర్చినట్టు , దీనికోసమై ప్రభుత్వం 40,139 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే నేరుగా ఇంత పెద్ద మొత్తంలో లబ్దిదారులకి లబ్ది చేకూర్చిన ప్రభుత్వం మరొకటి లేదు. ఇలా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల మన్ననలు పొందుతు సాగుతున్న సిఎం జగన్ పై తన మతం ఆదారం చేసుకుని ఒక ప్రణాళికా బద్దంగా ప్రజల మతవిశ్వాసాలను రెచ్చకొట్టే విధంగా అసత్యాలు సృష్టించి తీవ్రమైన ద్వేషపూరిత ప్రచారాన్ని అందుకున్నారు.

అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వారు లక్ష్యంగా ఎంచుకున్నట్టు జరుగుతున్న పరిణమాలు గమనిస్తే స్పష్టం అవుతుంది.తిరుమల కొండపై జగన్ వచ్చాకా ఏదో జరిగిపోతుంది, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది, తిరుమల కొండ పవిత్రత దెబ్బతినేలా ప్రభుత్వ కనుసన్నలో అన్యమత ప్రచారాం జరుగుతుంది అని ఒక రకమైన విష ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీలు వారి కార్యకర్తల చేత దగ్గరుండి మరీ దుష్ప్రచారం చేయించడం ప్రారంభించాయి. ఇప్పటికే తిరుమల విషయంలో అరడజను పైగా ప్రతిపక్ష పార్టీలు చేసిన ప్రచారం తప్పు అని తేలినా సాక్ష్యాలతో ప్రభుత్వం వాస్థవాలని ప్రజలకు తెలియ చేసినా, ఇంకా అదే పందాలో కొత్తగా తిరుమల భూముల అమ్మకం అనే విషయాన్ని వారు తెరమీదకు తెచ్చారు. తాజాగ ఇప్పుడు ఈ వ్యవహారం కూడా తమ హయంలో జరిగింది కాదు అని 1974 నుండి అన్ని ప్రభుత్వలు చేసినవే అని, గత ప్రభుత్వ హయంలో ఏర్పడిన పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని కేవలం సమీక్షించాం అని ఆదారాలు చూపినా , ఏకంగా భారతీయ జనతా పార్టి నుండి కన్నా లక్ష్మీ నారాయణా లాంటి నాయకులు, జనసేన నుండి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు, తెలుగుదేశానికి పూర్తిగా మద్దతు పలికే చానల్స్ పత్రికలు ఈ వ్యవహారం పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్యాలు గళాలు విప్పటంతో పాటు నిరసనలకు పిలుపునిచ్చారు.

Also Read: ఏడాదిలోనే సి.ఎం జగన్ పై ఇన్ని మతతత్వ దాడులా?

నాడు వై.యస్ పైనా ఇదే తరహా విషప్రచారం

తెలుగుదేశం పార్టి , భారతీయ జనతా పార్టి మూకుమ్మడిగా కలిసి తిరుమల కొండ వ్యవహారంలో అసత్యాలని ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం తెలిసిందే . గతంలో కూడా వై.యస్ పాలనా సమయంలో అదే తిరుమల కొండ ను ఆదారం చేసుకుని పూర్తి అసత్యాలతో కూడిన ప్రచారం చేసిన సంధర్భాలు ఉన్నాయి. వై.యస్ తిరుమల కొండను ఏడు కొండలు కాదని కేవలం రెండు కొండలే అని జి.ఒ ఇచ్చారని. శ్రీవారికి చెందిన కొండలను శ్రీవారికి కాకుండా చేసే ప్రయత్నం వై.యస్ చేశారు అని ఒక అసత్య ప్రచారాన్ని చేసి కొంతమంది ప్రజలను నమ్మించడంలో విజయం సాదించారు.

తిరుమల కొండ వ్యవహారంలో నాడు జరిగింది ఏంటి?

2004 లో వై.యస్ విజయం సాదించి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత, 2005లో తిరుమల అనే గ్రామంలో పంచాయతి ఎన్నికలు జరగాలి అని ఒక వ్యక్తి రాష్ట్ర హైకోర్టు ని ఆశ్రయించారు. దీంతో తిరుమలలో రాజకీయము తగదు అనే ఉద్దేశంతో జస్టిస్ చల్లా కొండయ్య కమీషన్ రిపొర్ట్ ఆదారంగా 2005న పంచాయితీ రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి అయిన జే.సి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యంలో ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక G.O విడుదల చేసింది (G.O నెంబర్ 338) ఆ G.Oలో తిరుమలలో 27.5 చదరపు కిలో మీటర్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి , కార్యాలయాలు , ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయోజనాలకొసం ఏర్పర్చిన గృహాలు , మరియు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అన్ని కలిపి ఒక టౌన్ షిప్ , ఒక పవిత్ర స్థలం ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు , మీటింగులు జరగటానికి వీలు లేదు అని చెబుతు G.O ని విడుదల చేశారు..

ఇలా వై.యస్ ప్రభుత్వం తిరుమల కొండ విస్థరణని ఉదహరిస్తూ జి.ఒ విడుదల చేయడానికి ఆదారంగా గతంలో 1975 డిసెంబర్ 2న విడుదల చేసిన G.O 1605, మరియు 4 నవంబర్ 1965 విడుదల చేసిన G.O నెంబర్ 1784 ని, ఇంకా 1986లో రామారావు ఏర్పాటు చేసిన జస్టిస్ చల్లా కొండయ్య నేతృత్వంలో ఒక కమిటీ. జస్టిస్ చల్లా కొండయ్య కమిటీ తో పాటు మిగిలిన ఆ రెండు జి.ఒ లలో కూడా స్వామివారి ఆలయం చుట్టు ఉన్న 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణ ప్రాంతం మటికి మాత్రమే దేవస్తానానికి మంజూరు అయింది అని చెప్పారు. వీటి ఆదారంగానే నాటి వై.యస్ ప్రభుత్వం తిరుమల గ్రామం విస్తరణని ఉదహరిస్తూ జి.ఒ ని విడుదల చేశారు.

ఈ జి.ఒ ని పట్టుకుని ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టి, భారతీయ జనతా పార్టి వారు వై.యస్ తిరుమల ఏడు కొండలని రెండు కొండలు గా చేశారు అని ప్రచారం అందుకున్నారు – ( వాస్థవం గా చూస్తే ఆ జి.ఒ ముఖ్య ఉద్దేశం జనసంచారం మటికి ఉన్న తిరుమల ప్రాంతంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు ఉండటానికి లేదు అని చెప్పటం) 1925 నుండి విలేజ్ రికార్డ్స్ లో ఉన్న ఏరియా ఎంత ఉందో అదే ఏరియాని వై.యస్ ప్రభుత్వం ఉదహరించిదన్న విషయం తెలిసినా కేవలం రాజకీయంగా విమర్శలు చేసి తిరుమల భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నాటి ప్రతిపక్షాలు వ్యవహరించారు.

దీంతో ప్రతిపక్షాలు మాటలు నమ్మి కొంత మంది సాధువులు 2006 జులై 15 న నిరసన వ్యక్తం చేశారు ఇలా చేస్తు వారు తిరుమల ని కిలోమీటర్ల లా కాకుండా ఏడు కొండలు అని మార్చి జి.ఒ ఇవ్వాలి అని అడిగారు, అలాగే 27 జులై 2006 న టి.టి.డి అదారిటి ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తు తిరుమల 27.5 చదరపు కిలో మీటర్లు కాదు అడవితో సహా అంత కలిపి 332 చదరపు కిలో మీటర్ల ప్రాంతం అని కొత్త జి.ఒ ఇవ్వాలి అని అడిగారు. అదే రోజు ప్రభుత్వ కేబినెట్ అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవి ప్రాంతాన్ని వీరికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని, అటవి ప్రాంతాన్ని డీ నోటిఫై చేసి తిరుమలకి ఇచ్చే విధంగా అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని అభ్యర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని వై.యస్ ప్రభుత్వం లేఖ ద్వారా అభ్యర్ధించింది.

రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగానే కేంద్రం స్పందించి తిరుమల కొండలకు సంభందించిన ఆ అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేస్తు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు కల్పించింది. దీంతో వై.యస్ ప్రభుత్వం 2007 జూన్ 2 న ఏడు కొండలు అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, ౠషబాద్రి తిరుమలకి సంభందిoచిన పవిత్ర ప్రదేశం అని G.O నెంబర్ 746 ని విడుదల చేశారు , దీనితో పాటు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్దం అని 747 G.O ని విడుదల చేశారు. ఇలా అప్పటివరకు తిరుమల కింద లేని ఏడు కొండలని తిరుమల శ్రీవారికి చెందేలా చేసిన వై.యస్ పై నేటికి ఇదే విషయంలో అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారు.

ప్రజా సంక్షేమం విషయంలో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులతో పోటీ పడలేక వారి జన్మతః వచ్చిన మతం ఆదారంగా వారిపై దైవాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల మనోభావాలు గాయపడేలా ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేయడం శోచనీయం. తప్పు జరిగితే ప్రశ్నించడం అనేది ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కానీ లేని తప్పుని సృష్టించి ప్రచారం చేయడం అందులోను కోట్లమంది ప్రజలు ఆరాద్య దైవంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం ప్రతిపక్షాల దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. మతాలను రాజకీయాలనుండి దూరం చేసిన నాడే ఈ దేశం ప్రగతి పధంలో ముందుకు వెళ్తుంది అని చెప్పిన సర్ధార్ భగత్ సింగ్ భావాలు నేటి యువత పాటించాల్సిన అవసర ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఈ దేశంలో ఉన్న ప్రజల అభిమానం ని గెలవలేము అని నిర్ధారించుకున్న రోజున తన అవసరాల కోసం మతాన్ని , కులాన్ని వాడుకోవడానికి ప్రజల భావోద్వేగాలని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందడం కోసం రాజకీయ నాయకులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి